‘బంకు’ల్లో చేతివాటం

నిబంధనలను ఉల్లంఘిస్తోన్న 183 బంకుల యజమానులకు నోటీసులు 
  • లీటరు పెట్రోలుకు కనీసం 100 మిల్లీలీటర్లు తేడా 
  • రాష్ట్రవ్యాప్తంగా 2,553 పెట్రోలు బంకుల్లో తనిఖీలు 
  • రంగారెడ్డి జిల్లాలోని 24 బంకులు, కరీంనగర్‌లో 20
  • కామారెడ్డిలో 20, సిద్దిపేటలో 14 బంకులపై దాడులు 
  • రూ.500 పెట్రోలు కొట్టిస్తే లీడరు పెట్రోలు తేడా 
  • కొన్ని చోట్ల యథేచ్ఛగా కల్తీ పెట్రోలు 
  • తూ.తూ.మంత్రంగా తనిఖీలు..పట్టించుకోని అధికారులు 
  • సీల్‌ బ్రేక్‌ చేసి చిప్స్‌ను అమర్చుతున్న బంకు యజమానులు 
  • రిమోట్‌తో పెట్రోల్‌ కంట్రోల్‌ చేస్తున్నట్లు ఆరోపణలు 
  • ట్యాంపరింగ్‌కు గురవుతున్న పెట్రోల్‌ బంకు మిషన్లు 

హైదరాబాద్‌: 
పెట్రోల్‌ బంకుల్లో మోసాలు సర్వసాధారణమైపోయాయి. లీటరు పెట్రోలుకు కనీసం 100 మిల్లీలీటర్లు తేడా వస్తోంది. దీంతో మన జేబులు గుల్ల. అంతేకాదు… కొన్ని బంకుల్లో కల్తీ కూడా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే… పౌరసరఫరాల శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ నెల ఒకటి నుంచి 22 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు, సిబ్బందితోపాటు ఆయిల్‌ కంపెనీల అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 శాతం(2,553) పెట్రోలు బంకుల్లో తనిఖీలు జరిగాయి. మొత్తంమీద నిబంధనలను ఉల్లంఘిస్తోన్న 183 బంకుల యజమానులకు క్రమశిక్షణా చర్యల కింద నోటీసులు జారీ చేశారు. వీటిలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని 24 బంకులు, కరీంనగర్‌లో 20, కామారెడ్డిలో 20, సిద్దిపేటలో 14 బంకులున్నాయి. 
ఆనంద్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీ ఎంప్లాయి. రోజూ బైక్‌ పైనే ఆఫీసుకు వెళ్తుంటాడు. వారానికి ఒకసారి బైక్‌లో పెట్రోల్‌ కొట్టిస్తుంటాడు. ఇదివరకు 500 రూపాయల పెట్రోల్‌ కొట్టిస్తే.. వారం పది రోజులు నడిచిపోయేది. ఇప్పుడు ఐదు రోజులకు మించి రావడం లేదు. అనుమానం వచ్చి తాను పెట్రోల్‌ కొట్టించే బంకుపై కంప్లయింట్‌ చేశాడు. సివిల్‌ సప్లయి డిపార్ట్‌మెంట్‌తనిఖీలు చేయగా ఆ బంకులో షార్టేజ్‌ మోసాలు జరుగుతున్నట్టు తేలింది. 
వరంగల్‌కు చెందిన రాజు ఓ టాక్సీ డ్రైవర్‌. రోజూ ఒకే పెట్రోల్‌ బంకులో డీజిల్‌ కొట్టించేవాడు. ఒకేసారి ట్యాంక్‌ ఫుల్‌ చేయించేవాడు. కానీ కారు సరైన మైలేజీ ఇచ్చేది కాదు. ఎన్నిసార్లు మెకానిక్‌కు చూపించినా మార్పు లేదు. ఒకసారి డీజిల్‌ కొట్టించే టైమ్‌లో ఎందుకైనా మంచిదని చెక్‌ చేస్తే ఐదు లీటర్లకుపైగా తగ్గడంతో రమేశ్‌ షాక్‌ తిన్నాడు. వీరిద్దరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. పెట్రోల్‌ బంకుల మోసాలకు రోజూ బలైపోతున్నారు. ఇదే విషయాన్ని సివిల్‌ సప్లయి డిపార్ట్‌మెంట్‌కూడా కన్‌ఫర్మ్‌ చేస్తోంది. 
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయని ప్రకటించింది. 500 రూపాయల పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకుంటే లీటర్‌ వరకూ షార్టేజ్‌ వస్తోందని తెల్చింది. ఈ మేరకు 20 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 638 బంకుల్లో తనిఖీలు చేసిన ఆ శాఖ.. 183 బంకుల్లో మోసాలు జరిగినట్లు గుర్తించి నోటీసులిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల్లో రూల్స్‌ను పాటించకపోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది. తూనికలు, కొలతల శాఖ రూల్స్‌ ప్రకారం ఐదు లీటర్లలో 25 మిల్లీ లీటర్ల వరకు తక్కువగా వస్తే ఇబ్బంది లేదు. కానీ ప్రతి లీటర్‌లో ఆయిల్‌ తక్కువగా పంపింగ్‌ జరుగుతున్నట్లు వెహికల్స్‌ ఓనర్లు ఆరోపిస్తున్నారు. పెట్రోల్‌ బంకుల్లో సీల్‌ బ్రేకింగ్‌ జరుగుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డీలర్లు సీల్‌ బ్రేక్‌ చేసి చిప్స్‌ను అమర్చడం, రిమోట్స్‌తో పంపింగ్‌ను కంట్రోల్‌ చేయడం లాంటి ఘటనలు గతంలోనూ వెలుగు చూశాయి. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల్లో అవకతవకలు, కల్తీ విక్రయాలపై ఫిర్యాదులు రావడంతో సివిల్‌ సప్లయి డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేకంగా తనిఖీలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 శాతం బంకుల్లో తనిఖీలు చేసి 183 బంకులకు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డిలో 24, కరీంనగర్‌లో 20, కామారెడ్డిలో 20, సిద్దిపేటలో 14 బంకుల్లో రూల్స్‌ పాటించడంలేదని ఆఫీసర్లు గుర్తించారు. షార్టేజ్‌ వచ్చిన బంకులు ఒకసారి రూల్స్‌ పాటించకపోతే ఫైన్‌ వేస్తామని, రెండోసారి అదే నేరం జరిగితే కోర్టుకు పంపిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. బీఫామ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోని వారికి ఫైన్‌ వేస్తామన్నారు. 
రోజూ కోటీ 20 లక్షల లీటర్ల వినియోగం 
రాష్ట్రవ్యాప్తంగా 2,553 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీఎల్‌ కంపెనీలకు చెందిన ఈ బంకుల్లో రోజూ పెట్రోలు, డీజిల్‌ కలిపి దాదాపు కోటీ 20 లక్షల లీటర్లు వరకూ వినియోగిస్తున్నారు. ఇందులో 40 లక్షల లీటర్ల పెట్రోల్‌, 35 లక్షల డీజిల్‌ ఒక్క హైదరాబాద్‌ లోనే వాడుతున్నారు. సూర్యాపేట, చర్లపల్లి, ఘట్‌కేసర్‌ తదితర 6 కంపెనీ టెర్మినళ్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంకులకు రోజూ 600 ట్యాంకర్లలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా అవుతోంది. 
ఏం చేయాలి.. ఏం జరుగుతోంది? 
రూల్స్‌ ప్రకారం ఐదు లీటర్లలో 25 మిల్లీ లీటర్ల వరకు తక్కువగా వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని బంకుల్లో ఐదు లీటర్లకు అర లీటర్‌ నుంచి లీటర్‌ వరకూ తేడా వస్తోంది. పెట్రోల్‌ పంపింగ్‌ చేసే గన్‌ వద్ద బయటకు కనిపించేలా ఏర్పాట్లు ఉండాలి. కానీ ఏ బంకూ ఈ రూల్‌ను పాటించలేదు. కొలతలను చెక్‌ చేసుకోవడానికి పెంట్రోల్‌ బంకుల వద్ద గాజు బీకరు ఉండాలి. ఏడాది క్రితమే ఈ రూల్‌ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా అమలు కావడం లేదు. 
తూనికలు, కొలతల శాఖ ఆఫీసర్లు ఏడాదికోసారి ఫిల్లింగ్‌ మిషన్‌ను పరిశీలించి సీల్‌ వేసి స్టాపింగ్‌ చేస్తారు. లీగల్‌ మెట్రాలజీ, ఆయిల్‌ కంపెనీల ఆఫీసర్ల సమక్షంలో టెక్నీషియన్లు పంపింగ్‌ మీషన్‌ను పరిశీలించి స్టాంపింగ్‌ చేస్తారు. ఐనా సీల్‌ బ్రేకింగ్‌కు సంబంధించి ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. ఏటా లైసెన్స్‌ రెన్యూవల్‌ కోసం బంకు డీలర్లు గడువు కంటే 15 రోజుల ముందు తూనికలు, కొలత శాఖకు అప్లై చేసుకోవాలి. కానీ చాలా బంకులు గడువు ముగిసినా రెన్యూవల్‌కు అప్లై చేయడం లేదు. 
దష్టి మరల్చడం 
పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించే ముందు రీడింగ్‌ సున్నా చేసి ఫ్యుయల్‌ నింపుతారు కదా. అయితే మన ముందు మాత్రం రీడింగ్‌ సున్నా చేస్తారు. కానీ కొంత ఫ్యుయల్‌ కొట్టగానే మనల్ని నెమ్మదిగా మాటల్లో పెట్టి రీడింగ్‌ మార్చడం, లేదా ఇంధనం తక్కువగా కొట్టడం చేస్తారు. దీంతో మనకు రావల్సిన ఫ్యుయల్‌ రాదు. కాబట్టి ఫ్యుయల్‌ నింపే సమయంలో రీడింగ్‌నే చూడాలి. ఎవరు ఎలా డిస్టర్బ్‌ చేసినా దష్టి మార్చకూడదు. 
నాజిల్‌ను పదే పదే ప్రెస్‌ చేయడం 
పెట్రోల్‌ బంకుల్లో ఫ్యుయల్‌ నింపే సమయంలో కొందరు వర్కర్లు పదే పదే ఫ్యుయల్‌ నాజిల్‌ను ప్రెస్‌ చేస్తూ ఉంటారు. ఇది మనకు అంతగా కనిపించదు. ఎందుకంటే మనం రీడింగ్‌పై దష్టి పెడతాం కదా. అప్పుడు వారు నాజిల్‌ను ప్రెస్‌ చేస్తూ ఉంటారు. దీంతో కొంచెం ఫ్యుయల్‌ మనకు తక్కువగా వస్తుంది. టూ వీలర్స్‌ కాకుండా కార్ల వంటి ఫోర్‌ వీలర్స్‌లో ఉన్న వారు ఒక్కోసారి వాహనం దిగకుండానే ఫ్యుయల్‌ పోయిస్తుంటారు. దీని వల్ల పెట్రోల్‌ బంక్‌ వర్కర్లు ఇంకా ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని తస్కరించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనం దిగి ఫ్యుయల్‌ రీడింగ్‌ను చూసుకోవాలి. అంతేకాదు, నాజిల్‌పైనా ఓ కన్నేయాలి. 
పెద్ద పెద్ద పైపులను వాడడం 
సాధారణంగా ఏ పెట్రోల్‌ బంకులోనైనా ఫ్యుయల్‌ నింపే పైపులు పెద్దగా ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యుయల్‌ మెషిన్‌కు దగ్గరగా ఉంటే ఆ పైపులు వంగిపోతాయి. దీని వల్ల కొంత ఫ్యుయల్‌ ఆ పైపుల్లో ఆగిపోతుంది. దీంతో మనకు రావల్సిన ఫ్యుయల్‌ రాదు. అయితే దీన్ని నివారించాలంటే వాహనాన్ని మెషీన్‌కు కొంత దూరంలో నిలపాలి. దీని వల్ల పైపు సాగినట్టు అవుతుంది. అప్పుడు వాటిలో ఫ్యుయల్‌ ఆగేందుకు అవకాశం ఉండదు. 
మెషిన్లను ట్యాంపర్‌ చేయడం 
కొన్ని పెట్రోల్‌ బంకుల్లో మెషిన్లను ట్యాంపర్‌ చేస్తారు. దీని వల్ల ఫ్యుయల్‌ క్వాంటిటీలో తేడా వస్తుంది. మనకు రావల్సిన మొత్తంలో ఫ్యుయల్‌ రాదు. అయితే దీన్ని ఎలా కనుక్కోవాలంటే ఎప్పుడైనా మీరు పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించినప్పుడు తక్కువ ఫ్యుయల్‌ వచ్చిందని అనుమానం వస్తే వెంటనే అదే పెట్రోల్‌ బంక్‌లో టెస్ట్‌ చేసుకోవచ్చు. అందుకోసం 5 లీటర్ల క్యాన్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఫ్యుయల్‌ కొట్టించి ఎంత వస్తుందో చూడాలి. తక్కువగా వస్తే సదరు పెట్రోల్‌ బంక్‌పై సంబంధిత అధికారులకు మీరు ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా ఫ్యుయల్‌ నాణ్యంగా లేకపోయినా, నాసిరకంగా ఉన్నా అదే పెట్రోల్‌ బంక్‌లో ఫిల్టర్‌ పేపర్‌ టెస్ట్‌ ఉంటుంది. దాన్ని కూడా మీరు అడిగి చేయించుకోవచ్చు. ప్రతి పెట్రోల్‌ బంక్‌లోనూ ఈ రెండు టెస్ట్‌లను ఉచితంగా చేస్తారు. వాటిలో ఏవైనా తేడాలు గమనించినట్టయితే సంబంధిత అధికారులకు మీరు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. పైన చెప్పిన సూచనలు పాటిస్తే మీకు ఇంధనం నాణ్యమైంది అందడమే కాదు, సరైన పరిమాణంలో లభిస్తుంది. దీంతో మీ నెలవారీ ఫ్యుయల్‌ ఖర్చులు అదుపు తప్పకుండా ఉంటాయి.