‘చిదంబర’ రహస్యం

రాజకీయ దురుద్దేశమా?..స్వయంకృతాపరాధమా? 
  • చిదంబరానికి 20 ప్రశ్నలు వేసిన సీబీఐ 
  • సీబీఐ ప్రశ్నలకు సూటిగా జవాబివ్వని మాజీ మంత్రి 
  • మూడు గంటలకు పైగా సాగిన విచారణ 
  • ఇంద్రాణీ ముఖర్జియాతో సమావేశం, ఇతర అంశాలపై ప్రశ్నలు 
  • విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు 
  • అరెస్టుకు నిరసనగా సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు వేసిన చిదంబరం 
  • ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థపై 2017లో నమోదయిన ఎఫ్‌ఐఆర్‌ 
  • చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం పేరు కూడా నమోదు
  •  ఇంద్రాణీ ముఖర్జీ విచారణతో బయటకువచ్చిన చిదంబరం పేరు 
  • పులిమీద పుట్రలా కాంగ్రెస్‌కు సరికొత్త తలనొప్పులు 

న్యూఢిల్లీ: 
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ముందు సీబీఐ 20 ప్రశ్నలు ఉంచింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ ఆయన్ను బుధవారం రాత్రి 12గంటల సమయంలో విచారించడం ప్రారంభించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాత్రంతా ఆయన నిద్ర లేకుండా గడిపినట్లు వెల్లడించాయి. గురువారం ఉదయం కూడా మరో దఫా ప్రశ్నించారు. 
మొదటి దఫా ప్రశ్నావళికి ముందు భోజనం చేయాల్సిందిగా సీబీఐ అధికారులు ఆయనకు సూచించారు. అందుకు ఆయన తిరస్కరించారు. తర్వాత విచారణ ప్రారంభించారు. సుమారు 20 కీలక ప్రశ్నలను ఆయన ముందు ఉంచారు. ఇంద్రాణీ ముఖర్జియాతో సమావేశం, ఇతర అంశాలపై ఆయనను ప్రశ్నించారు. రెండో దఫా విచారణ ఉదయాన్నే 8గంటల సమయంలో మొదలైంది. దాదాపు ప్రశ్నలన్నింటికీ చిదంబరం ‘చెప్పలేను’, ‘స్పష్టంగా తెలీదు’ అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. 
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం విచారణ ముగిసింది. సుమారు మూడు గంటలకు పైగా ఆయనను విచారించారు. ఈ సమయంలో ఈయనను 20 ప్రశ్నలు అడిగారు. ఐఎన్‌ఎక్స్‌ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ పాత్ర, హైకోర్టు ఆదేశాల అనంతరం కనిపించకపోవడానికి గల కారణాల గురించి సీబీఐ ప్రశ్నించింది. అయితే సీబీఐ అధికారులు ఆశించిన స్థాయిలో చిదంబరం స్పందించలేదు. విచారణకు ముందు ఆహారం ఇవ్వగా చిదంబరం తిరస్కరించారు. దీంతో అల్పాహారం ఇంటి నుంచి తెప్పించుకునేందుకు అనుమతినిచ్చారు. భోజనం తీసుకోవాలని చెప్పినా ఆయన తిరస్కరించారు. అయితే ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. మూడు గంటల పాటు విచారించినప్పటికీ చిదంబరం వారికి సహకరించలేదు. ఆయనను ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటికే కోర్టు వద్దకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింగ్వి చేరుకున్నారు. కార్తి చిదంబరం, చిదంబరం సతీమణి నళినీ చిదంబరం, సీనియర్‌ న్యాయవాది వివేక్‌ ఠంకా కోర్టు వద్దకు చేరుకున్నారు. 
సీబీఐకి వ్యతిరేకంగా పిటిషన్లు.. 
అరెస్టును నిరసిస్తూ చిదంబరం సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు వేశారు. సీబీఐకి వ్యతిరేకంగా ఒకటి, ఈడీకి వ్యతిరేకంగా మరొకటి దాఖలు చేశారు. ఇందులో ఈడీకి వ్యతిరేకంగా వేసిన పిటషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. 
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరంపై ఆరోపణలు 
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం నిందితుడు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆయనపై మనీ ల్యాండరింగ్‌ కేసు కూడా ఉంది. దీన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన ఢిల్లీ హైకోర్టులో అపీల్‌ చేశారు. అయితే, ఆయన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో చిదంబరం తరఫున ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఇదే సమయంలో తమ వాదన వినకుండా చిదంబరానికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయరాదని సుప్రీంకోర్టులో సీబీఐ కెవియట్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో చిదంబరాన్ని అరెస్టు చేసి సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచారు. 
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు ఏమిటి? 
ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థపై 2017 మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఐఎన్‌ఎక్స్‌ప్రెస్‌, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే చెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఇందులో నిందితులుగా సీబీఐ పేర్కొంది. అయితే, ఈ ఎఫ్‌ఐఆర్‌లో చిదంబరం పేరు లేదు. 
సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది? 
సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు విదేశీ పెట్టుబడులు తీసుకోవాలని భావించింది. ఇందుకోసం ఫారెన్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ (ఎఫ్‌ఐపీబీ) అనుమతి కోరింది. ఒక్కో షేర్‌ను 10రూపాయల ముఖ విలువతో జారీ చేస్తామని పేర్కొంది. దీంతో ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి 4 కోట్ల 62 లక్షల విదేశీ పెట్టుబడులకు ఎఫ్‌ఐపీబీ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ఐఎన్‌ఎక్స్‌ న్యూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలోకి డౌన్‌స్ట్రీమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి విడిగా అనుమతి తీసుకోవాలని ఎఫ్‌ఐపీబీ స్పష్టంగా చెప్పింది. ఎఫ్‌ఐపీబీ సిఫార్సుతో ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థ దరఖాస్తుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అయితే, ఐఎన్‌ఎక్స్‌ మీడియా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి, ఐఎన్‌ఎక్స్‌ న్యూస్‌ సంస్థలో 26శాతం డౌన్‌స్ట్రీమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. డౌన్‌స్ట్రీమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఎఫ్‌ఐపీబీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్నా.. ఐఎన్‌ఎక్స్‌ మీడియా ఆ పని చేయలేదు. 4 కోట్ల 62 లక్షల రూపాయల విదేశీ పెట్టుబడులకు ఎఫ్‌ఐపీబీ అనుమతివ్వగా.. 305 కోట్లకుపైగా ఎఫ్‌బీఐలను సేకరించింది. విదేశీ పెట్టుబడిదారులకు ఒక్కో షేర్‌ను 10 రూపాయలకు కేటాయించాల్సి ఉండగా.. 800 రూపాయలకు ఒక షేర్‌ జారీ చేసింది. 
చిదంబరం పేరు ఎలా వచ్చింది? 
ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో 2008 ఫిబ్రవరిలో దీనిపై వివరణ ఇవ్వాలని ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు ఎఫ్‌ఐపీబీని కోరారు. దీంతో తాము కూడా ఈ వ్యవహారంపై సమాంతరంగా దర్యాప్తు చేస్తామని ఐటీ శాఖకు ఎఫ్‌ఐపీబీ సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు లేఖ రాసింది. 
ఎఫ్‌ఐపీబీ నుంచి లేఖ అందుకున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా దీన్నుంచి తప్పించుకునేందుకు కార్తీ చిదంబరంతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడిందని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. కార్తీ చిదంబరం అప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కుమారుడు. చెస్‌ మెనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రమోటర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. కార్తీ చిదంబరం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థికశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తే పని సాఫీగా సాగుతుందని ఆ సంస్థ భావించిందని సీబీఐ పేర్కొంది. 
ఆ తర్వాత చెస్‌ మెనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సూచించినట్లుగా ఐఎన్‌ఎక్స్‌ మీడియా ఎఫ్‌ఐపీబీకి లేఖ రాసింది. అన్ని వ్యవహారాలు సక్రమంగానే జరిగాయంటూ వివరణ ఇచ్చింది. కార్తీ చిదంబరం ఒత్తిడితో ఈ కేసును ఎఫ్‌ఐపీబీ అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు చర్యలు తీసుకోకపోగా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నించారు. ఐఎన్‌ఎక్స్‌ న్యూస్‌ సంస్థలోకి ఇదివరకే వచ్చిన డౌన్‌స్ట్రీమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనుమతి కోసం కొత్తగా ఎఫ్‌ఐపీబీకి దరఖాస్తు చేయాలని సూచించారు. అధికారులు చెప్పినట్లు ఐఎన్‌ఎక్స్‌ మీడియా అప్లికేషన్‌ పెట్టడం, ఎఫ్‌ఐపీబీ ఆమోదించడం జరిగిపోయాయి. ఈ వివాదం నుంచి బయటపడేసినందుకు కార్తీ చిదంబరం ఆధ్వర్యంలో నడుస్తున్న చెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌కి ఐఎన్‌ఎక్స్‌ మీడియా డబ్బులు చెల్లించినట్లు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 
కార్తీ చిదంబరంపై ఆరోపణలు 
ఐఎన్‌ఎక్స్‌ మీడియాపై జరగబోయే దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నించారని కార్తీ చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి. కార్తీ డబ్బులు డిమాండ్‌ చేశారని ఐఎన్‌ఎక్స్‌ మీడియా మాజీ డైరెక్టర్‌ ఇంద్రాణీ ముఖర్జీ తమకు చెప్పారని సీబీఐ చెబుతోంది. ఈ ఒప్పందం దిల్లీలోని ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్లో జరిగిందని దర్యాప్తు ఏజెన్సీ చెబుతోంది. ఇంద్రాణీ ముఖర్జీని ఈడీ విచారించినప్పుడు చిదంబరం పేరు బయటకు వచ్చింది. 2018లో ఈడీ మనీ లాండరింగ్‌ కేసు కూడా నమోదు చేసింది. అప్పడు ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం ఇంద్రాణీ ముఖర్జీకి సాయం చేయమని కార్తీ చిదంబరానికి చెప్పారని ఈడీ తన చార్జీషీట్‌లో పేర్కొందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం రాసింది. 
ఈ కేసులో 2018 ఫిబ్రవరిలో కార్తీ చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాపై దర్యాప్తు జరగకుండా చూసేందుకు ఒక మిలియన్‌ డాలర్లు డిమాండ్‌ చేసినట్లు కార్తీ చిదంబరంపై అభియోగాలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను చిదంబరం కొట్టిపారేశారు. తనపై, తన కుమారుడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై అభియోగాలు చేస్తున్నారని చిదంబరం తరచూ చెప్తున్నారు.