సభ్యత్వమే సగం బలం

15 కోట్లకు చేరుకున్న బీజేపీ సభ్యత్వాలు 
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరణ 
  • అనూహ్యంగా బలం పుంజుకున్న బీజేపీ 
  • సభ్యత్వాలలో దూసుకుపోతున్న కమలనాధులు 
  • టార్గెట్‌ను మించిన సభ్యత్వాలతో జోష్‌ 
  • 65 లక్షల మంది చేరికతో తొలిస్థానంలో ఉత్తరప్రదేశ్‌ 
  • వెస్ట్‌బెంగాల్‌లో 36 లక్షలు, గుజరాత్‌లో 34 లక్షలు 
  • ఢిల్లీలో 15 లక్షల మందితో కొత్త సభ్యత్వాలు
  •  దక్షిణాదిలోనూ టార్గెట్లతో పాగా 
  • ఇతర పార్టీలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న కమలం 
  • కాంగ్రెస్‌ కార్యకర్తల్లో తగ్గిపోతున్న ఆసక్తి 
  • మోదీ, అమిత్‌షాల ద్వయం వ్యూహాలు 
  • ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తర, దక్షిణ రాష్ట్రాలు 

హైదరాబాద్‌: 
కేంద్రంలో తిరుగులేని ఆధిక్యతతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ… మరింత బలపడే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వాల విషయంలో దూసుకుపోయింది. తాజాగా దాదాపు 4 కోట్ల మంది బీజేపీలో కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. దీంతో, బీజేపీ సభ్యత్వాలు 14.78 కోట్లకు చేరుకున్నాయి. బీజేపీలో 3,78,67,753 మంది కొత్తగా సభ్యత్వాలు తీసుకున్నారని ఓ ప్రకటనలో ఆ పార్టీ వెల్లడించింది. జూలై 6న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్నటితో (ఆగస్ట్‌ 20) ముగిసిందని తెలిపింది. కొత్త సభ్యత్వాలతో కలిపి బీజేపీ మొత్తం సభ్యత్వాలు 14,78,67,753కు చేరుకున్నాయని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌ లో 55 లక్షలు, ఢిల్లీలో 15 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారని చెప్పింది. తొలుత 2 కోట్ల కొత్త సభ్యత్వాలను టార్గెట్‌ గా పెట్టుకున్న బీజేపీ… ఆ తర్వాత టార్గెట్‌ ను 4 కోట్లకు పెంచింది. అనుకున్నట్టుగానే తన టార్గెట్‌ ను బీజేపీ చేరుకోవడం గమనార్హం. ఊహించని విధంగా బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న మద్దతు ఇతర పార్టీలకు వణుకు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. 
దాదాపు 11 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతున్న బీజేపీ బలం మరింత పెరిగింది. దాదాపు నెలన్నరపాటు సాగిన మెంబర్‌?షిప్‌? డ్రైవ్‌ సూపర్‌? సక్సెస్‌? అయిందని, డ్రైవ్‌ ముగిసిన మంగళవారం నాటికి పార్టీలోకి కొత్తగా 3.78 కోట్ల మంది చేరారని, అన్ని రాష్ట్రాల నుంచి కచ్చితమైన లెక్కలొస్తే ఆ సంఖ్య ఈజీగా 5 కోట్లకు చేరుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ కో కన్వీనర్‌ దుష్యంత్‌కుమార్‌గౌతమ్‌ తెలిపారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2015లోనే పార్టీ మెంబర్ల సంఖ్య11 కోట్లకు చేరిందని గుర్తుచేసిన ఆయన.. 2019 మెంబర్‌షిప్‌ డ్రైవ్‌లో కనీసం 20 శాతం కొత్తవాళ్లను అంటే 2.2 కోట్ల మందిని చేర్చుకోవాలని పార్టీ టార్గెట్‌ పెట్టుకుందని అయితే టార్గెట్‌ కంటే రెట్టింపు సంఖ్యలో సభ్యులు చేరడం బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని దుష్యంత్‌ అన్నారు. జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ జయంతి నాడు(జులై 6న) బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో, పార్టీ చీఫ్‌ అమిత్‌ షా తెలంగాణలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రైవ్‌ చివరిరోజైన ఆగస్టు 20 నాటికి 3, 78, 67, 753 మంది కొత్తవాళ్లు బీజేపీలో చేరారని, అన్ని రాష్ట్రాల నుంచి పూర్తి లెక్కలు ఇంకా రావాల్సి ఉందని వివరించారు. 
2015నాటి మెంబర్‌షిప్‌ డ్రైవ్‌పై విమర్శలొచ్చిన నేపథ్యంలో ఈ సారి ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. పార్టీలో చేరేందుకు మిస్డ్‌ కాల్‌ ఇచ్చినవారి పేర్లు, అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు పక్కాగా సేకరించారు. గతంలోలాగే ఈసారి కూడా మెజార్టీ చేరికలు మిస్డ్‌కాల్‌ ద్వారానే జరిగాయి. బీజేపీ వెబ్‌సైట్‌, మోడీ యాప్‌ ద్వారానూ ఈసారి చెప్పుకోదగ్గస్థాయిలో మెంబర్లు చేరారు. 
రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా 65 లక్షల మంది కొత్త సభ్యుల చేరికతో ఉత్తరప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. వెస్ట్‌బెంగాల్‌లో 36 లక్షలు, గుజరాత్‌లో 34 లక్షలు, ఢిల్లీలో 15 లక్షల మంది కొత్తగా కాషాయ కండువా కప్పుకున్నారు. మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ ముగియడంతో ఇక సెప్టెంబర్‌లో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని, డిసెంబర్‌ నాటికి నేషనల్‌ కౌన్సిల్‌ మెంబర్ల ఎన్నిక పూర్తవుతుందని దుష్యంత్‌ తెలిపారు. మోడీ పాపులారిటీ, అమిత్‌ షా చాణక్యనీతికి ఆకర్షితులై కొత్తవాళ్లు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన చెప్పారు. 
కేంద్ర హోంమంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నేడు రాష్ట్రానికి రానున్నారు. 24న ఉదయం హైదరాబాద్‌లో పోలీస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొననున్నారు. అయితే, ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ కార్యాలయానికి రావాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అమిత్‌ షా రాకసందర్భంగా పలువురు ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ లేదంటున్న వారు పార్లమెంట్‌ ఎన్నికల్లో కవిత ఎలా ఓడిపోయారో తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి కామెంట్‌ చేశారు. గతంలో కంటే బీజేపీ చాలా బలంగా ఉందని, లోక్‌ సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం అంటున్నారు బీజేపీ నేతలు. 
ఇదిలా ఉంటే… తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచుతుండటంతో, ఇకపై కమలం పార్టీని లక్ష్యంగా చేసుకుని పావులు కదిపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ప్రతివ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. 
కాంగ్రెస్‌: 
తీవ్ర సంక్షోభంలో కూరుకొని పోయిన పార్టీల్లో ప్రధానమైనది.. కాంగ్రెస్‌. ఈ పార్టీకి నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. అమేథీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ ఓడిపోయారు. ఇప్పుడాయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సోనియాకు వయసు మీద పడింది.. ఈ భారాన్ని మోయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ ఏడాది డిసెంబర్‌ నెలలో మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు కీలకమైనవి. వీటిలో ఒడిపోయిందా ఆ పార్టీని కాపాడడం కష్టమే. 
కమ్యూనిస్టులు: 
కమ్యూనిస్టులు గతమెంతో ఘనం అంటూ చదువుకోవాల్సిందే. ఆ పార్టీలకు సమీప భవిష్యత్‌లో ఎలాంటి ఆశలేదు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఐదు సీట్లల్లో నాలుగు తమిళనాడులోని డీఎంకే పుణ్యమాని గెలిచినవే. మిగిలిన ఒక్కటి కేరళలో గెలిచింది. 30 ఏళ్లు ఏకఛద్రాదిపత్యంగా ఏలిక బెంగాల్‌లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయారు. ఆ పార్టీలకు మిగిలింది కేరళ ఒక్కటే. అది కూడా ఎంతకాలమో చూడాలి. 
ఏఐడీఎంకే: 
అంపశయ్య మీద ఉన్న పార్టీల్లో మొదటిది అన్నా డీఎంకే. 2016లో ఆ పార్టీ చీఫ్‌ జయలలిత చనిపోయిన తర్వాత.. చుక్కాని లేని నావలా మారి.. గాలివాటుగా ప్రయాణం చేస్తోంది. 
తెలుగుదేశం: 
బయటకు నాయకత్వం పటిష్టంగా ఉన్నట్టు కన్పిస్తున్నా.. అత్యంత బలహీనంగా ఉన్న పార్టీ తెలుగుదేశం. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలయ్యింది. ఒడిపోగానే.. ఆ పార్టీలో ఉన్న నాయకులు బీజేపీలోకి చేరి పోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి.. టీడీపీ నామ మాత్రంగా మిగలడమో.. అంతర్థానం కావడమో జరుగుతుంది. 
జనతాదళ్‌ (సెక్యులర్‌): 
లోక్‌ సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. కుటుంబ కలహాలు పెరిగిపోతున్నాయి. కుమారస్వామి సోదరుడు రేవణ్ణ అసంతప్తిగాలో ఉన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు దేవేగౌడకు వయసు మీరింది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు.. బీజేపీ వైపు చూప సారించే అవకాశముంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి జేడీ(ఎస్‌) పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. 
సమాజ్‌వాదీ పార్టీ 
ఉత్తరప్రదేశ్‌లో ఈ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 5 సీట్లు మాత్రమే గెలిచింది. అసెంబ్లీలో బలం అంతంతే. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏర్పాటైన మహాకూటమి చీలిపోయింది. మళ్లీ కూటమి ఏర్పడే అవకాశాలు తక్కువే. ఇప్పటివరకూ ఎస్పీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న యాదవులు.. బీజేపీ వైపునకు మళ్లింది. బీసీ ఓటు బ్యాంకు కూడా బీజేపీకే మద్దతుగా నిలుస్తోంది. 
ఆర్‌జేడీ, జనతాదళ్‌ (యూ) 
వచ్చే ఏడాది 2020లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. చివరకు ఆ పార్టీ యువనాయకుడు తేజస్వీయాదవ్‌ కూడా ఓడిపోయారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు లాలూ యాదవ్‌ జైల్లో ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌.. ఇప్పటివరకూ బలంగానే ఉన్నారు. బీజేపీతో కలిసి అన్ని లోక్‌సభ స్థానాలు గెలుచుకున్నారు. ఎన్నికల తర్వాత నితీష్‌కు, బీజేపీకి పొసగడం లేదు. 2020 ఎన్నికల నాటికి కలిసి పోటీ చేస్తారా..? విడివిడిగా చేస్తారా.? అన్నది చూడాలి. 
నాయకుడే లేని బీజేడీ 
ఒడిసా.. ఈ రాష్ట్రంలో వరుసగా ఐదోసారి ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ (72) బాధ్యతలు చేపట్టారు. ఈ పార్టీకి వంశ పారంపర్యం లేదు. రాబోయే రోజుల్లో అంతర్ధానమయ్యే పార్టీల్లో ఇది కూడా ఒకటి కావచ్చు. ఆ రాష్ట్రంలో బీజేపీ వేగంగా పుంజుకుంటోంది. గత ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకుంది. ఈ రాష్ట్రంలో భవిష్యత్‌ బీజేపీకి మాత్రమే ఉన్నది. 
మజ్లిస్‌ కకూడా అదే దారిలో 
దేశంలో మత ప్రాతిపదికన రాజకీయాలు చేసే పార్టీల్లో హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న ఎంఐఎం పార్టీ ఒకటి. ఈ పార్టీకి నాయకత్వం ఓవైసీ కుటుంబం మాత్రమే. ప్రస్తుతం ఈ పార్టీకి ఓవైసీ సోదరులు నాయకత్వం వహిస్తున్నారు. వీరిలో అక్బరుద్దీన్‌ ఆరోగ్యం విషమించి.. చికిత్స పొందుతున్నారు. ఎంఐఎం పార్టీకి ఓవైసీ సోదరుల తర్వాత నాయకత్వ సమస్య తలెత్తుతుంది. భవిష్యత్లో ఈ పార్టీ కూడా అంతర్ధానమవుతుంది.