సింగరేణిలో

‘కాంట్రాక్ట్‌’ కష్టాలు 
  • పర్మినెంట్‌కు నోచని కాంట్రాక్టు కార్మికులు 
  • అమలు కాని హైపవర్‌ వేతనాలు 
  • ఇబ్బందుల్లో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు 
  • 20 వేలకుపైగా దినసరి కార్మికుల వెతలు 
  • కనీస వేతనాలు, చట్టబద్దమైన హక్కులు అమలు నిల్‌ 

హైదరాబాద్‌: 
తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా నిలిచిన సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల అవస్థలు మాత్రం చెప్పనలవి కాకుండా ఉన్నాయి. రాష్ట్రంలోని గోదావరినదీ పరివాహక ప్రాంతాలైన ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో 11 ఏరియాల్లో సుమారు 20 వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్తత్తిలో వీరూ రెగ్యులర్‌ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నా పనికి తగిన వేతనం లేదు. పర్మినెంట్‌కు నోచడం లేదు. 
సింగరేణి సంస్థలో జరిగే బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాంట్రాక్టు కార్మికులు. మరి అలాంటి కార్మికులను పట్టించుకోవాల్సిన అధికారులు, సింగరేణి సంస్థ గాలికొదిలేస్తోంది. శ్రమను దోచుకుని సమస్యలను పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు పేరు గొప్పగా ఉన్న సంస్థలో పనిచేస్తున్నా ఊరు దిబ్బగా వారి బతుకులు తయారయ్యాయి. 1991 సంవత్సరంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన సరళీక త ఆర్థిక విధానాల మూలంగా సింగరేణిపై తీవ్ర ప్రభావం చూపించాయి. దేశంలో అమలైన సరళీకత ఆర్థిక విధానాల మూలంగా సింగరేణిలో సైతం అనేక సంస్కరణలు వేగవంతంగా అమలయ్యాయి. సంస్థల్లో అమలైన సంస్కరణల ధాటికి రెగ్యులర్‌ కారాఇ్మకులు 1లక్షల 20 వేల మంది ఉండగా వారిని కుదించేశారు. ఈ క్రమంలోనే పర్మినెంట్‌ కార్మికులను తొలగించిన స్థానంలో మళ్లీ కొత్తవారిని భర్తీ చేయకుండా కాంట్రాక్టు కార్మికులను నియమించడం ఆరంభించింది. ఇలా సింగరేణి వ్యాప్తంగా 4 జిల్లాలోని 11 ఏరియాల్లో సుమారు 20వేలకు పైగా కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి మాత్రం కనీస వేతనాలు చట్టబద్దమైన హక్కులు అమలు చేయకుండా సంస్థ శ్రమను దోచుకుంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్టు కార్మికులే… 
సింగరేణి సంస్థలో ఇందుగలడందు లేడన్నట్లు రెగ్యులర్‌ కార్మికులకు ధీటుగా కాంట్రాక్టు కార్మికులు అన్ని విభాగాల్లోనూ పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి మొదలు బొగ్గు సరఫరా, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి రవాణా, ఎక్స్‌ప్లోరేషన్‌, స్టోర్స్‌, సివిక్‌(పారిశుధ్యం), సేల్‌ పీకింగ్‌, బెల్ట్‌ క్లీనింగ్‌ రైల్వే సైండింగ్‌, గార్డెనింగ్‌(తోటమాలి), హౌస్‌ కీపింగ్‌, కన్వేయన్స్‌ వెహికల్‌ డ్రైవర్లు, ఓసీపీలో ఆపరేటర్స్‌, బ్లాస్టింగ్‌ వర్కర్స్‌, క్యాజువల్‌ లేబర్‌గా వీరు కొనసాగుతున్నారు. 
బొగ్గునాణ్యతలో… 
గనుల్లోని భూగర్భంలో ఉత్పత్తి అయినా బొగ్గును ఉపరితలానికి బెల్ట్‌ ద్వారా తరలించడం, అక్కడి నుండి వాహనాల ద్వారా సీఎస్‌పీలకు తరలించి అనంతరం వివిధ ప్రాంతాలకు రైలు ద్వారా ఎగుమతి చేస్తున్నారు భూ గర్భంలో ఉత్పత్తి అయినా బొగ్గును బెల్ట్‌ ద్వారా ఉపరితలానికి తరలించడంలో, సీఎస్‌పీలలో సైతం బెల్ట్‌ ద్వారా బంకర్లకు బొగ్గును తరలిస్తున్నారు. బెల్ట్‌ ద్వారా తరలించే క్రమంలో బొగ్గులో ఏమైనా బండరాళ్లు ఉంటే వాటిని తొలగించి నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు అందించడంలో కాంట్రాక్టు కార్మికులే కీలక పాత్ర పోషిస్తున్నారు. 
పర్మినెంట్‌కు నోచుకునేనా..? 
పదిహేను సంవత్సరాలకు పైగా సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తూ చాలీచాలని వేతనాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించుకుంటు న్నారు కాంట్రాక్టు కార్మికులు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గద్దెనెక్కితే పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో విస్మరిస్తున్నారు. ఇక గుర్తింపు సంఘంగా గెలుపొందిన టీబీజీకేఎస్‌ కూడా ఇచ్చిన మాట ప్రకారం పర్మినెంట్‌ చేయడంలో విఫలం కావడంతో కాంట్రాక్టు కార్మికులు అవస్థలు పడుతున్నారు. 
కానరాని హైపవర్‌ కమిటీ వేతనాలు 
జాతీయ వేతన ఒప్పందంలో భాగంగా కాంట్రాక్టు కార్మికులకు 2013 జనవరి 1 నుండి కనీస వేతనం రోజుకు అన్‌స్కిల్డ్‌ 464 రూ, సెమిస్కిల్డ్‌ రూ.494, స్కిల్డ్‌ రూ. 524, హై స్కిల్డ్‌ రూ. 554, చెల్లించాల్సి ఉన్నా హైపర్‌ వేతనాలకు ఇప్పటికీ కాంట్రాక్టు కార్మికులు నోచుకోవడం లేదు. అలాగే చట్టబద్దంగా రావాల్సిన బోనస్‌, సీఎంపీఎఫ్‌, వైద్య సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఒప్పందం ఉన్నా కోల్‌ ఇండియా పరిధిలోని బొగ్గు సంస్థల్లో అమలు చేస్తున్నప్పటికీ సింగరేణిలో మాత్రం యాజమాన్యం అమలు చేయకపోవ డం పట్ల కార్మికులు మండిపడుతు న్నారు. బోనస్‌ చట్టం-2006 ప్రకారం చెల్లించాల్సిన బోనస్‌ ఇంత వరకు చెల్లించడం లేదు. 
సంక్షేమంలో సైతం… 
సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ కాంట్రాకుట కార్మికుల సంక్షేమానికి మాత్రం 5శాతం కూడా నిధులు వెచ్చించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మిక సంక్షేమ చర్యల్లో భాగంగా కార్మిక కాలనీల్లో రోడ్లను నిర్మించి, మురుగు కాలువలు నిర్మిస్తున్నప్పటికీ రోడ్లను ఊడ్చి కార్మిక గ హాల ముందున్న చెత్తాచెదారం తరలించడం, మురుగుకాల్వలను శుభ్రం చేయడం వంటి పనులు చేపడుతున్నా వారి బతుకులు మాత్రం అధ్వానంగానే ఉంటున్నాయి. చెత్తాచెదారం, మురుగుకాల్వల్లోని చెత్తను తొలగించడంతోపాటు సెప్టెక్‌ ట్యాంక్‌లు శుభ్రపరుస్తున్న కాంట్రాక్టు కార్మికులు అనారోగ్యం బారిన పడినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇలా ప్రతి పనిలోనూ వీరు కీలకంగా మారినా వేతనాల్లో, పర్మినెంట్‌తోపాటు ఇతర సౌకర్యాల విషయంలో మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నారు. 
పర్మినెంట్‌ చేయాల్సిందే 
సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలి. సరైన వేతనాలు అమలు కాకపోవడం మూలంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించి ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి. వేతన ఒప్పందాల్లో భాగంగా హైపవర్‌ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం వేతనాలు చెల్లించాలి. 
– బచ్చలి సురేందర్‌, కాంట్రాక్టు కార్మికుడు 
వివక్షత చూపుత్ను సింగరేణి 
సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయించుకుంటూ వారికి కనీస వేతనాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. సంస్థ లాభాల్లో ప్రత్యక్షగా, పరోక్షంగా కంట్రాక్టు కార్మికుల శ్రమ ఉంది. వారి శ్రమకు తగిన వేతనాలు జేబీసీసీఐలో కుదిరిన ఒప్పదం ప్రకారం సింగరేణిలో అమలు చేయాలి. గత ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం వారిని రెగ్యులర్‌ చేయాలి. అప్పటి వరకు వేతన ఒప్పందం(జేబీసీసీఐ) ప్రకారం వేతనాలు, బోనస్‌లు అమలు చేయాలి. 
– వెంకటస్వామి, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు 

కార్మికుల డిమాండ్లివే.. 
– టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, టీబీజీకేఎస్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు పర్మినెంట్‌ చేయాలి. 
– బొగ్గు మంత్రిత్వశాఖ ఆమోదించిన హైపవర్‌ కమిటీ వేతనాలు అమలు చేసి ఏరియర్స్‌ చెల్లించాలి. 
– సీఎంపీఎఫ్‌ వైద్య సౌకర్యం కల్పించాలి. 
– 8 గంటల పని విధానాన్ని అమలు చేసి పని ఆధారంగా క్యాటగిరైజేషన్‌ చేసి వేతనాలు చెల్లించాలి. చట్టబద్ద బోనస్‌ చెల్లించాలి. 
– 2006-07 నుండి చెల్లించాల్సిన పెండిగ్‌ బోనస్‌ చెల్లించాలి. పర్మినెంట్‌ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి. 
– కాంట్రాక్టు లేబర్‌ చట్టం ప్రకారం), సులబ్‌, సివిల్‌, స్కావెంజర్‌ విధులు నిర్వహిస్తున్న వారికి ప్రత్యేక కేటగిరీ వేతనం అమలు చేయాలి. రక్షణ పరికరాలు ఇవ్వాలి. 
– క్వార్టర్‌ సౌకర్యం కల్పించడంతోపాటు సంవత్సరానికి రెండు జతల యూనిఫాం అందించాలి.