వీ..గన్లు..జంతు ప్రేమికులు
వీగన్లు… ఎవరు వీళ్లు.. అందరిలాంటి మనుషులే.. కానీ సాధారణ మానవులకంటే వీళ్లు ఓ మెట్టు పైన ఉంటారని చెప్పాలి. ఎందుకంటే వీళ్లు మనమధ్య ఉన్న మానవతామూర్తులు కాబట్టి. మనుషుల మధ్య ఉన్న వివక్షల్ని దాటి.. జంతువుల పక్షాన నిలబడ్డారు కాబట్టి మనుషుల్లో వీళ్లు ప్రత్యేకమైన వాళ్లు. ఇలాంటి వీగన్ల సంఖ్య హైదరాబాద్‌లో క్రమంగా పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే.. హైదరాబాద్ వీగన్ల రాజధానిగా మారుతోంది. పూర్తిగా మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్ని మాత్రమే తిని జంతు సంరక్షణకు కషి చేస్తున్న హైదరాబాదీ వీగన్లను గురించి తెలుసుకుందామా..
వారాంతాల్లో ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకొని లైఫ్‌ని జల్సాగా గడిపే యువత హైదరాబాద్‌లో ఎక్కువగానే ఉండొచ్చు.. అలాంటి వారితో పోల్చితే ఇదే హైదరాబాద్‌లో వీళ్ల సమూహం చాలా చిన్నది. కానీ వీళ్ల ఉద్యమం విశ్వమంత పెద్దది. మనుషుల్ని ప్రేమించే వీళ్లు.. జంతువుల హక్కుల కోసం పోరాడే వీగన్లు. హైదరాబాద్ వీగన్స్ ఇది ఒక ఫేస్‌బుక్ పేజ్.. ఈ పేజ్‌లో మూడువేల 600 మంది సభ్యులున్నారు. వీళ్లంతా ఆహారం కోసం మొక్కలపై తప్ప జంతువులపై ఆధారపడబోమని ప్రతిక్ష చేసి వీగన్లుగా మారారు. వీగనిజాన్ని ప్రమోట్ చేసేందుకు వారాంతాల్లో చాలా కార్యక్రమాలు చేస్తోంది ఈ సమూహం. ఏ రెస్టారెంట్లలో మనం వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ సమూహం అక్కడికి వస్తుంది. మనం బతకడానికి జంతువులు చావాల్సిందేనా అని ఓ ప్రశ్న మనముందు ఉంచి వెళ్లిపోతుంది. సినిమా థియేటర్‌కు వెళ్తాం. అక్కడ ముఖానికి మాస్కులు వేసుకున్న ఓ గుంపు ఏదో ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. వాళ్ల చేతుల్లోని ప్లకార్డుల్లో జంతువుల్ని మనం ఎంతగా హింసిస్తున్నామో ఉంటుంది. వాళ్లతో మాట కలిపితే.. జంతువుల వేదనను కథలు కథలుగా చెప్తారు.
హైదరాబాద్ క్రమంగా వీగన్ల రాజధానిగా మారుతోందనేందుకు ఈ జంతుప్రేమికుల కార్యక్రమాలు.. వాటికి వస్తున్న స్పందనే ఉదాహరణ. 2011లో పుల్కిత్, సేజల్ అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ వీగన్స్ మూమెంట్ ప్రారంభించారు. ఇప్పుడు వేలాదిమంది ఈ సమూహంతో చేతులు కలిపి వీగన్లుగా మారుతున్నారు. వీగన్లుగా మారేందుకు ఆహారం ప్రధాన అడ్డంకి.. పాలు కూడా లేని పదార్థాలు మాత్రమే వీళ్ల ఆహారంలో భాగం. అందుకే, ఇలాంటి పదార్థాలను ప్రమోట్ చేసి అంతా పంచుకొని తినేందుకు వీగన్ పాట్‌లాక్స్ పేరుతో సామూహిక విందు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో వీగన్ ఫుడ్ అక్కడికి తీసుకొస్తారు.