అవినీతిపరుల పాలిట సివంగులు
గ్రీన్ గ్యాంగ్
ధైర్యంతో ముందడుగు వేస్తే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించొచ్చు. ఎందరితోనైనా పోరాడొచ్చు అని నిరూపించారు అంగూరీ దహడియా. ఆమె వేసిన ఓ విత్తనమే ఇప్పుడు వక్షమై పదమూడు జిల్లాలకు రక్షణ కవచంలా మారింది. రండి.. అంగూరీ దయాడియా గురించి తెలుసుకుందాం.
‘గులాబీ గ్యాంగ్’ పేరు వినే ఉంటారు. ఆ గ్యాంగ్ చేస్తున్న పనిని మెచ్చుకోని వారుండరు. ఆ గ్యాంగ్‌ను ప్రేరణగా తీసుకుని ‘గులాబీ గ్యాంగ్’ అనే సినిమాను కూడా తీశారు. అలాంటి కోవకు చెందిన గ్యాంగ్ మరొకటి ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలో ఉంది. ఆ గ్యాంగ్ పేరు గ్రీన్‌గ్యాంగ్. ఈ పేరు వినగానే ఇదేదో పర్యావరణానికి సంబంధించిన దళంలా ఉందే అనిపిస్తుంది. కానీ, ఇది పర్యావరణానిది కాదు, న్యాయం కోసం పోరాడే ఓ దళం. బలహీనుల్ని బలవంతులుగా మార్చే దళం. ఈ గ్యాంగ్‌లోని సభ్యులంతా మహిళలే. అందులో కీలకపాత్ర పోషించింది అంగూరీ దహడియా. ఈ గ్యాంగ్‌కు పునాది అంగూరీ నుంచే మొదలయ్యింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఏ జిల్లాకు వెళ్లినా గ్రీన్‌గ్యాంగ్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ‘గ్రీన్‌గ్యాంగ్’ అంటేనే న్యాయానికి ప్రతీక. తప్పు చేసింది ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. ఎలాంటి లింగవివక్ష లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చూస్తారు ఈ దళ సభ్యులు. ఈ దళం కన్నౌజ్ జిల్లాలోని తిరువా టౌన్‌లో 2010లో ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని 13 జిల్లాలో ఈ దళం సభ్యులు ఉన్నారు. ఈ దళంలో 14,252 మహిళలు ఉన్నారు.
అలా మొదలైంది!
‘నా పెళ్లి ఓ పేద కుటుంబంలోని వ్యక్తితో జరిగింది. ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. నా భర్త అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యారు. నేను చీరలు, చెప్పులు, పెట్టుకునే డబ్బాలను తయారుచేసేదాన్ని. అలా పనిచేస్తేకానీ మాకు పూట గడిచేది కాదు. వచ్చిన డబ్బులతోనే ఇంటికి, పిల్లల స్కూల్ ఫీజులు, మందులు అన్నీ చూసుకునేదాన్ని. సొంత ఇంటి కోసం వాయిదా పద్ధతిలో నేనో ప్లాట్‌ను తీసుకున్నాను. రాత్రీ పగలు తేడా లేకుండా కష్టపడి దానికి కట్టాల్సిన డబ్బంతా కట్టాను. కానీ, ఆ ఇంటి యజమాని నన్ను మోసం చేశాడు. నాదగ్గర్నించి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. ఆ ప్లాట్‌ను నాపేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు. నన్ను, పిల్లల్ని కొట్టి మరీ ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆ సమయంలో ఏం చేయాలో నాకు తోచలేదు. ఇద్దరు పిల్లల్ని, ఆయన్నీ వేసుకుని ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. న్యాయం కోసం ప్రతి ఇంటి తలుపులను తట్టాను. కానీ ఎవరూ నాకు సాయం చేయలేదు. నన్ను మోసం చేసిన వాళ్లందర్ని చంపేయాలన్నంతా కోపం వచ్చింది. అప్పుడే నేను ఒంటరిని అనే భావన నన్ను వెక్కిరించింది’ అని అప్పటి నిస్సహాయ స్థితిని గుర్తుచేసుకున్నారు అంగూరీ.
అప్పుడే తనకో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన లోంచి పుట్టుకొచ్చిందే ఈ ‘గ్రీన్‌గ్యాంగ్’. గ్యాంగ్ కోసం మొదటగా కొంతమంది మహిళలనంతా ఒకచోట చేర్చింది అంగూరీ. చాలామంది మొదట్లో ఆ సంఘంలో చేరేందుకు ఒప్పుకోలేదు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి న్యాయ, అన్యాయాల గురించి వివరించడం మొదలెట్టింది. ఆమెకు జరిగిన అన్యాయం గురించీ వివరించింది. నెమ్మదిగా ఆ గ్రామంలోని మహిళలు ఆమె మాటలను నమ్మడం, అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎవరికైతే అన్యాయంగా జరిగిందో ఆ మహిళలంతా గ్రీన్ గ్యాంగ్ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. అలా రోజురోజుకూ ఆ సంఘం సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.
లాఠీ దెబ్బలు కొత్తకాదు!
బాగా పలుకుబడి ఉన్న పెద్దలు, లంచాలు తీసుకొని అలాంటి పెద్దలకు వత్తాసు పలికే పోలీసులను కూడా నిలదీస్తుంది ఈ గ్రీన్‌గ్యాంగ్. ఏవిధంగా ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం జరిగేలా చేయడమే ఈ గ్రీన్‌గ్యాంగ్ అంతిమ లక్ష్యం. క్రమక్రమంగా విస్తరిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని 13 జిల్లాలో ఈ గ్రీన్ గ్యాంగ్ పనిచేస్తోంది. అన్నిచోట్లా సంఘంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు అంగూరీ. గ్రీన్ గ్యాంగ్ ఏ ప్రాంతంలోనైనా ఉందంటే అక్కడేదో సమస్యకు పరిష్కారం దొరికినట్లే. గ్రీన్ గ్యాంగ్‌పై అక్కడి ప్రజలకు అంత నమ్మకం కలిగింది. గ్యాంగ్‌లోని సభ్యులంతా గ్రీన్ కలర్ చీరనే ధరిస్తారు. గ్యాంగ్‌లోని ముఖ్యమైన ప్రతినిధులు ఎర్రని పట్టీ కలర్ ఉన్న చీరను ధరిస్తారు. న్యాయం కోసం పోరాడే క్రమంలో దళంలోని సభ్యులు ఎన్నోసార్లు జైలు గోడలను తాకాల్సి వచ్చింది. పోలీసుల లాఠీదెబ్బలు వారికీ కొత్తేం కాదు. గ్రీన్ గ్యాంగ్ లీడర్ అంగూరీ ఐదుసార్లు జైలుకి వెళ్లారు. ఆ దళంలోని సభ్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండంతో ఆర్థికంగా వారికి సమ్యసలు ఎదురవుతున్నాయి. అయితే, స్థానిక గ్రామస్థులు ఆ దళం సభ్యులకు ఎంతో సహాయాన్ని అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు.
ధైర్యం.. ధీమా.. భరోసా!
పవిత్ర పుణ్యభూమి అయిన వారణాసికి దగ్గరలో ఉంది గ్రీన్‌గ్యాంగ్ ఉన్న ఊరు. పేరు ఖుషియారీ. ఆడపిల్లలకు, ఆడవాళ్లకు అనువైన ఊరు కాదది! అసలు ఆడపిల్ల తల్లి గర్భంలోంచి భూమ్మీద పడడమే ఆ ఊళ్లో కనాకష్టం. పుట్టాక పెరగడం ఇంకా కష్టం. పెరుగుతుంది కానీ.. ఆమెకో జీవితం ఉండదు. పెళ్లీ అవుతుంది. తన మాటకు విలువ ఉండదు. ఆమె తరఫున అత్తమామలే మాట్లాడతారు. ఆమె ఇష్టాలను, అయిష్టాలను వదిన మరదళ్లే నిర్ణయిస్తారు. అలాంటి ఊళ్లో.. ఇంటి పనయ్యాక పచ్చచీర కట్టుకుని బయటికి వచ్చింది ఆశాదేవి. పొలం పనులు ముగించుకుని అప్పుడే ఇంటికి చేరుకున్న మరో ఇరవై మంది మహిళలు ఆ వెంటనే ఆమెను అనుసరించారు. వాళ్లంతా కూడా ఆకుపచ్చ చీరలో ఉన్నారు. అది వాళ్ల యూనిఫారం. ఊళ్లోని మహిళలకు, పిల్లలకు ధైర్యాన్ని, భరోసాను, నమ్మకాన్ని ఇచ్చే రంగు. తాగొచ్చి భార్యను కొట్టే భర్తకు ఆ రంగును చూస్తే భయం. జూదం ఆడే మగాళ్లకు వణుకు. పేకముక్కలు అక్కడే పడేసి వెనక్కైనా చూడకుండా పారిపోతారు. తల్లి మొత్తుకుంటున్నా పిల్లల్ని స్కూలుకు పంపకుండా పనికి తరిమేసే తండ్రుల భరతం కూడా పడుతుంది గ్రీన్ గ్యాంగ్.
చదువుకున్నవారి సహకారం
గ్రీన్ గ్యాంగ్‌లో కొందరు కరాటే తెలిసిన మహిళలు కూడా ఉన్నారు! పరిస్థితి చెయ్యి దాటినప్పుడు వట్టి చేతులతో టాస్క్‌ని ఫినిష్ చేసేస్తారు. ఇదేమీ పెద్ద విషయంగా కనిపించకపోవచ్చు. కానీ ఖుషియారీలో మహిళలు ఇలా సంఘటితం అవడం కష్టమైన సంగతే. కట్టుబాట్లపరంగా స్త్రీల పట్ల వివక్షకు మారు పేరు ఖుషియారీ. గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు గ హహింసకు, గ హ లైంగికహింసకు గురవుతున్నారు. వివాహిత మహిళల్లో మూడింట ఒక వంతు మంది భర్తల చేతుల్లో భౌతిక, లైంగిక హింసను అనుభవిస్తున్నారు. పట్టణాలతో పోల్చి చూస్తే గ్రామాల్లోని మహిళలపైనే ఈ హింస ఎక్కువగా ఉంటోంది. అలాంటి గ్రామాలకు ఒక ముఖచిత్రం ఖుషియారీ. అయితే ఈ నివేదికల్లో చూపించేదాని కన్నా ఎక్కువగానే మహిళలపై హింస జరగుతోందని గ్రీన్ గ్యాంగ్‌కు తెలియందేమీ కాదు. ప్రభుత్వం వైపు నుంచి మహిళల రక్షణ, భద్రతలకు జరిగేది జరుగుతున్నా, ఏ గ్రామానికి ఆ గ్రామంలో బాధితుల తరఫున మహిళలూ పూనుకుంటే తప్ప మగాళ్లలో మార్పు రాదని గ్రీన్ గ్యాంగ్ నిశ్చయించుకుని స్త్రీలను, పిల్లలను కాపాడే ఉద్యమానికి నడుం కట్టింది.
గ్రీన్ గ్యాంగ్ సభ్యులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న వలంటీర్లు
స్వయంగా ఆశాదేవి కూడా ఒక బాధితురాలే. రోజూ తాగొచ్చి భార్యను అదొక అలవాటుగా బాదేవాడు! ఆమె తలను గోడకేసి కొట్టేవాడు. రక్తం కారేది. నొప్పిని ఆలాగే భరిస్తుండేది కానీ ఏనాడూ ఎదురు తిరగలేదు. కానీ ఒకరోజు పిల్లల ముందు ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. ఆ చెయ్యిని అక్కడే ఆపేసింది ఆశాదేవి. నిర్ఘాంతపోయాడు. పిల్లల కళ్లల్లో సంతోషం. అమ్మ కూడా ఎదిరించగలదు. అమ్మకూడా ఎదురు తిరగగలదు. అంతే. నాన్నంటే భయం పోయింది. అమ్మంటే గౌరవం పెరిగింది. ఈ విషయం ఆశాదేవి గ్రహించింది. ఊళ్లో తన దొక్కటే కుటుంబం కాదు. తనొక్కతే బాధితురాలు కాదు. పిల్లల్ని తండ్రి ప్రేమగా చూసుకోవచ్చు. కానీ వాళ్ల కళ్లముందే తల్లిని అవమానిస్తే, అగౌరవపరిస్తే వాళ్లూ బాధితులే అవుతారు. ఈ దుస్థితిని తన పిల్లలకు తొలగించిన ఆశాదేవి, తనలాంటి వారే మరికొందరితో కలిసి ఊళ్లోని బాధిత మహిళల కోసం, వారి పిల్లల కోసం ‘గ్రీన్ గ్యాంగ్’ ఆవిర్భావానికి తోడ్పడింది. ఒక గ్యాంగ్ గా ఏర్పడడానికి వీళ్లకు స్ఫూర్తిని ఇచ్చింది మాత్రం కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులు. వాళ్లలోని వలంటీర్‌లు ఊళ్లోకి వచ్చి, స్త్రీల హక్కుల గురించి చెప్పి వెళ్లిపోయారు. అరె.. హక్కులుండీ హక్కులు లేనట్లు పడివుండటం ఏంటని అనుకున్నారు ఖుషియారీ మహిళలు. విద్యార్థులలోనే కొందరికి కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలతో పరిచయాలున్నాయి. అలా దివ్వాంశు ఉపాధ్యాయ్ అనే సేవా సంఘం నిర్వాహకుడు కొంతమంది యువ వలంటీర్‌ల చేత స్థానిక మహిళలకు చట్టాలపై, సెక్షన్‌లపై అవగాహన కల్పించాడు. ముఖ్యంగా పోలిస్ కంప్లయింట్ ఎలా ఇవ్వాలో చెప్పించాడు. ఆ తర్వాతి నుంచి ఊళ్లో మగాళ్లపై కేసులు నమోదవడం మొదలైంది. భర్తపై భార్య పెట్టిన కేసులే వాటిల్లో ఎక్కువ! తర్వాతి స్థానం జూదం ఆడేవారిది, తాగొచ్చి కొట్టేవాళ్లది, గుడుంబా కాసేవాళ్లదీ. ఊళ్లో ఇప్పుడీ పచ్చరంగు చీరల్లోని ఆడవాళ్లు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా మహిళల్ని, బాలికల్ని కాపుకాస్తున్నారు. రక్షణ వలయంగా నిలుస్తున్నారు. వీళ్లకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నది కూడా యవ వలంటీర్‌లే.