ఆరోగ్య తెలంగాణ

కేసీఆర్‌ మదిలో మరో ఆలోచన 

  • -సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు 
  • -దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న పథకం 
  • -మోదీకి దీటుగా సంక్షేమ పథకాలు 
  • -ఇప్పటికే విజయవంతమైన కంటి వెలుగు కార్యక్రమం 
  • -తెలంగాణలో ప్రతి ఒక్కరికీ వైద్యం ఉచితం 
  • -కేసీఆర్‌ ఆలోచనలను చూచాయగా వెల్లడించిన కేటీఆర్‌ 
  • -సీఎం సొంత ఊరు చింతమడకనుంచే పథకానికి శ్రీకారం 
  • -ఏ రాష్ట్రంలోనూ లేని ఉచిత వైద్య సదుపాయం

హైదరాబాద్‌: 
తెలంగాణలో కేసీఆర్‌ మరో భారీ పథకానికి నాంది పలుకబోతున్నారా? దేశం గర్వించే ఆ పథకం అమలు చేస్తే కేసీఆర్‌ కు తిరుగుండదా.? దేశాన్ని షేక్‌ చేసే ఆ పథకం కనుక అమలైతే తెలంగాణలో కేసీఆర్‌ కు పోటీ అంటూ ఉండదనే అభిప్రాయలు వెలువడుతున్నాయి.. తాజాగా టీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో 5 కోట్ల నిధులతో నిర్మించే ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్‌ చేశారు. త్వరలోనే కేసీఆర్‌ ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించబోతున్నారని.. ఈ మేరకు ఆయన మదిలో ఓ గొప్ప పథకం రూపుదిద్దుకోబోతోందని సూచనగా చెప్పుకొచ్చారు. 
ఇప్పటికే ఈ విషయంలో గ్రౌండ్‌ వర్క్‌ పూర్తయ్యిందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో ప్రతి ఒక్కరి ఆరోగ్యసమాచారాన్ని కొద్దిరోజులుగా ఏఎన్‌ ఎంలు ఆరోగ్య కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా సేకరించి ఆన్‌ లైన్‌ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి గ్రామాలు పట్టణాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి రోగాలను నిగ్గుతేల్చి మందులు చికిత్సలు అందించారు. 
ఇప్పుడు ఆ డేటాను మొత్తం క్రోడీకరించి వెబ్‌ సైట్‌లో పెట్టి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు యాక్సెస్‌ ఇస్తారట.. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ పౌరుడికి ఉచిత చికిత్స అందించే గొప్పపథకాన్ని కేసీఆర్‌ రాబోయే ఏడాదిలోగా ప్రారంభించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ పథకం కనుక అమలైతే తెలంగాణలోని అందరికీ ఉచిత వైద్యం అందుతుంది. తెలంగాణ ప్రజల దశను మార్చే ఈ గొప్ప పథకం గురించి తాజాగా కేటీఆర్‌ ఇచ్చిన లీక్స్‌ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 
చింతమడక నుంచే ఆరంభం 
ఆరోగ్య తెలంగాణాకు అడుగులు సీఎం కేసీఆర్‌ స్వగ్రామం నుంచేనన్నారు ఎమ్మెల్యే హరీష్‌ రావు. చింతల్లేని తెలంగాణ కూడా చింత మడక నుంచేనన్నారు. సిద్ధిపేట రూరల్‌ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి వారి సౌజన్యం తో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదొక చారిత్రాత్మక ఆరోగ్య సూచీ అన్నారు. దేశంలోనే ప్రథమన్నారు. మొట్టమొదటి సారిగా చింత మడక, మాచపూర్‌ , సీతారాం పల్లి నుండే ఆరంభం కావడం శుభసూచకమన్నారు. 
రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ భావించారని తెలిపారు. ఇంగ్లండ్‌, అమెరికా లాంటి దేశాల తర్వాత మన దగ్గర మొదటప్రారంభమైందన్నారు. కేసీఆర్‌ క షి కారణంగానే చింత మడక గ్రామానికి యశోద ఆసుపత్రినే తీసుకువచ్చారని తెలిపారు హరీశ్‌ . 

కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి యశోద ఆసుపత్రి నిర్వాహకులు ఈ క్యాంప్‌ నిర్వహించినందుకు కతజ్ఞతలు తెలిపారు. 8 రోజుల్లో 5, 561 మందికి 36, 146 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పారు. అంతేకాదు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత,శుభ్రత, పరిసరాల శుభ్రత అవసరమన్నారు. జబ్బులు రాకుండా చూసుకునే బాద్యత మనపైనే ఉందన్నారు. త్వరలోనే గ్రామ అభివద్ధి కోసం సమావేశం నిర్వహిస్తామన్న హరీశ్‌ రావు.. ఈ గ్రామంలో మొదటి కార్యక్రమం హెల్త్‌ క్యాంప్‌ తో ప్రారంభం చేసుకున్నామన్నారు. 
ఆరోగ్య తెలంగాణ 
సీఎం కేసీఆర్‌ చెబుతున్న బంగారు తెలంగాణ అంటే ఆరోగ్య తెలంగాణ అని ఆచరణలో రుజువు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలతో, పథకాలతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తెస్తున్న సీఎం కషికి వైద్య ఆరోగ్య సిబ్బంది అంతా అండగా నిస్తుంది. ప్రజారోగ్యం అనేది కేవలం డాక్టర్లు, దవాఖాన ల సమస్య కాదు. అది సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్య అని సీఈఏ విన్‌స్లో అన్నారు. సరిగ్గా ఈ విధంగానే.. ప్రజారోగ్యాన్ని గురించి, దాని ప్రాధాన్యం గురించి గుర్తెరిగిన కేసీఆర్‌ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని చాటి చెబుతున్నా రు. అయితే ముప్ఫై ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు బలైంది. ప్రభుత్వ హాస్పిటళ్లు నిర్లక్ష్యానికి బలైపోయాయి. గత ప్రభుత్వాల తీరు చూస్తే.. 1994-2004దాకా ప్రభుత్వ ఆస్పత్రులన్నీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొన్నాయి. సరిపోయినన్ని నిధులు అనేక విధాలుగా సతమతమయ్యా యి. రోగులకు కనీస సేవలనూ అందించలేకపోయాయి. ఈ పరిస్థితులన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల వ్యవస్థ అనేదే ప్రజల విశాసాన్ని కోల్పోయింది. 2004-06ల మధ్య అప్పటి పాలకులు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మరో పోటీ ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించాయి. 
వివాదాస్పద ఆరోగ్యశ్రీపథకాన్ని 2007 ఏప్రిల్‌లో ప్రారంభించారు. దీంతో ప్రజల సొమ్మంతా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు చేరిందనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆస్పత్రులన్నీ అన్నివిధాలుగా కూనారిల్లిపోయాయి. సరైన పరికరాలు, వైద్య సదుపాయాలు, వసతులు.. చివరికి భవనాలు, పరిశుభ్రతకు కూడా నోచుకోలేదు. దీంతో ఒక రకం గా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ నిర్వీర్యమైపోయాయి. అనేక హెల్త్‌ సర్వేలు చెప్పిందేమంటే.. ప్రజారోగ్య వ్యవస్థ కనిష్ట స్థాయిలో ఉన్నది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు అవసాన దశకు చేరుకున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పూర్వవైభవం తెచ్చేందుకు పూనుకున్నది. ముఖ్యమంత్రి ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసి బడ్జెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో.. పీహెచ్‌సీల నుంచి నిమ్స్‌ దాకా సకల సదుపాయాలు కల్పించి పేదలకు ఆరోగ్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. 1957 నుంచి హైదరాబాద్‌లో ఒక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ కూడా ఏర్పాటు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పడ్డనాడు ఏడు లక్షల జనాభా ఉన్నది నేడు కోటికి చేరుకున్నది. ఇంత జనాభాకు ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లే సేవలు అందించాలంటే ఎంత సంక్లిష్టమో చెప్పనక్కరలేదు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ నగరంలో నాలుగు దిక్కులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లు నెదర్లాండ్‌ నిధుల సాయంతో నిర్మించాలని తలపెట్టారు. దీనిద్వారా పేద, మధ్య తరగతి ప్రజానీకానికి వైద్య సేవలు అందుబాటులోకి తెవడానికి క షి చేస్తున్నారు. అలాగే కాలేయ మార్పిడి లాంటి చికిత్సలు ఉస్మానియా, గాంధీలలో నిర్వహించి కార్పొరేట్‌ హాస్పిటళ్ల కన్నా తామేమీ తక్కువ కాదని చాటిచెప్పాయి. అలాగే జిల్లా స్థాయి ఆస్పత్రులన్నింటిలో ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కార్పొరేట్‌ హాస్పిటళ్లపై ఆధారపడటం తగ్గి ప్రజలకు ఎంతో భారం తగ్గుతుంది. గతంలో చూస్తే.. 2013-14 బడ్జెట్‌లో ఆరోగ్యానికి 6482కోట్లు కేటాయించా రు. ఈ బడ్జెట్‌ మొత్తాన్ని జనాభా నిష్పత్తి (58:42)ప్రకారం పంచితే తెలంగాణకు దక్కింది 2722 కోట్లు మాత్రమే. తెలంగాణ వచ్చిన తర్వాత మన పాలనలో ఆరోగ్యానికి రెండింతలు అంటే 5,967కోట్లు కేటాయించింది. దీంతో మందుల కోసమే 225 కోట్లు కేటాయించారు. దీంతో పేద వర్గాలు ఇక నుంచి తమ సంపాదన నుంచి మందుల కోసం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కోసం 600 కోట్లు కేటాయించారు. ఇన్నాళ్లూ సరైన వైద్య పరికరాలు లేక ప్రభుత్వ దవాఖానలు రోగులకు వైద్య సేవలు అందించడంలో వైఫల్యం చెందాయి. 30-40 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 
వైద్య పరికరాల కోసం మరో 230 కోట్లు 
వైద్య పరికరాల కోసం మరో 230 కోట్లు కేటాయించారు. ఇది గతంలో కన్నా 225శాతం ఎక్కువ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నోసిస్‌వ్యై పరీక్షల కోసం కూడా 300 కోట్లు కేటాయించారు. దీంతో రోగులు ప్రతి పరీక్ష కోసం ప్రైవేటు హాస్పిటళ్లకు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు పరుగెత్తే పరిస్థితి ఉండదు. అంతే కాకుండా.. ఆపదలో ఆదుకునే 104,108 సర్వీసుల కోసం మరో 104 కోట్లు కేటాయించారు. ఇది గ్రామ స్థాయి నుంచి పేద,మధ్య తరగతి ప్రజలందరికీ ఉచిత అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయి. అలాగే చరిత్రలో మొదటి సారి పరిశుభ్రత కోసం వంద కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రులంటే.. అపరిశుభ్రతకు ఆలవాలంగా ఉండేవి. ప్రభుత్వ దవాఖాన అంటేనే.. సరైన పారిశుధ్యానికి నోచుకోక సకల రోగాలకు నెలవుగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి దూరం కానున్నది. 
తెలంగాణ ప్రజలందరికీ అన్నిరకాల వైద్య పరీక్షల అందుబాటు లో ఉంచేందుకు 40 వైద్య పరీక్షా (డయాగ్నోస్టిక్‌ సెంటర్లు) కేంద్రాలను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 40 డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేట్లు చూస్తున్నారు. దీంతో కిడ్నీ రోగులకు ఎంతో ఊరట కలుగుతుంది. అన్నింటి కన్నా ముఖ్యంగా.. పేదల సాయం కోసం ఎమర్జెన్సీ కాంటిజెన్సీ ఫండ్‌ కూడా 56 కోట్లు ఏర్పాటు చేశారు. ఈ నిధులు ఆయా ఆస్పత్రుల సూపరిండెంట్లు, డీఎంఈ/డీపీహెచ్‌ల ఆధ్వర్యంలో ఉండి అవసరమైన వారికి అందుబాటులో ఉంటాయి. గతంలో ఆస్పత్రుల్లో ఏ చిన్న పరికరం చెడిపోయినా, అవసరం ఉన్నా దాని కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అత్యవసరాలకు ఎప్పుడూ అందుబాటులో నిధులు ఉండటం మూలంగా రోగులకు వైద్యసేవలు సరైన రీతిలో, సరైన సమయంలో అందుతాయి. 

అప్పుడే పుట్టిన పిల్లల సంరక్షణ కోసం న్యూ బార్న్‌ కిట్స్‌ కు మూడు కోట్లు కేటాయించారు. దీంతో శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోతాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం జిల్లాల్లోనే ఏడు పీహెచ్‌సీలను 24 గంటలు వైద్య సేవలు అందించే ఆస్పత్రులుగా అభివ ద్ధి చేస్తున్నది. వీటి కోసం రెండు కోట్లు కేటాయించింది. దీంతో వైద్య పరిశోధనల కోసం ప్రభుత్వం 12 కోట్లు కేటాయించింది. దీంతో వైద్య పరిశోధనల్లో కొత్త శకం ఆరంభం కానుంది. అలాగే పేద వర్గాలకు అండ గా నిలిచేందుకు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొం దుతూ చనిపోతే.. వారిని ఊరి దాకా చేర్చేందుకు వాహన సౌకర్యమూ అందుబాటులోకి తెచ్చింది. ఈ బడ్జెట్‌ కేటాయింపులతోనే మన ముఖ్యమంత్రి వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పుకోవచ్చు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఇత ర రాష్ట్రాల్లో మెరుగైన వైద్య సేవలు ఏ రూపంలో అందుతున్నాయి, వాటి నిర్వాహణ ఎలా ఉన్నదనేది అధ్యయనం చేయడం కోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాలను సందర్శించారు. ఆరోగ్యమంత్రి తమిళనాడు, శ్రీలంక దేశాన్ని సందర్శించి అక్కడి వైద్య విధానాలను అధ్యయనం చేశారు. మనకంటే మెరుగైన రీతిలో వైద్యసేవలు అందిస్తున్న కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలను సందర్శించి అక్కడి ప్రజారోగ్య విధానాలను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాల పునాదిగా రాబోయే కాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.