73వ స్వాతంత్య్రం

స్వతంత్ర భారతానికి చూస్తుండగానే 72 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏటా ఆగస్ట్‌ 15న జాతీయ జెండాను ఎగురవేసి, స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను జరుపుకోవటం, సమరయోధుల వీరగాధలను స్మరించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇదే సందర్భంలో అనేక సంవత్సరాల నుంచి కొంతమందిలో రకరకాల సందేహాలు వుండేవి. ‘నాటి ధీరుల త్యాగం- స్వాతంత్య్ర ఫలం కొంతమంది స్వార్థపరులకు భోజ్యం’ అనే విధంగా నిర్వేదం వ్యక్తపరిచేవారు. ఈ నిర్వేదంలో, అమాయకుల ఆవేదనలో, పేదల ఆక్రందనలో, సగటు జీవుల వైరాగ్యంలో చాలావరకూ వాస్తవం వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన జపాన్‌, జర్మనీ వంటి దేశాలు త్వరితగతిన- పదేళ్ల కాలంలోనే యథాస్థితికి వచ్చాయి. నేటికీ ఆ దేశాలు సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నాయి. రెండు దశాబ్దాల క్రితమే ఆ దేశాలు అభివ ద్ధి చెందిన దేశాల జాబితాలో స్థానం పొందాయి. ఇంకా మనం మాత్రం అభివ ద్ధి చెందుతున్న దేశాల జాబితాలో వున్నామే తప్ప.. ఉన్నత స్థాయికి ఎప్పుడు చేరతామో తెలియని దుస్థితి నెలకొంది. 
ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కు సంకల్పంతో ఎవరికీ అదరక, బెదరక జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో 370 ఆర్టికల్‌ను రద్దు చేయడంతో నేడు అఖండ భారత్‌ అనే నినాదానికి సార్థకత చేకూరింది. భారత్‌లోనే మరో దేశంలా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక సౌకర్యాలు వుండడమేమిటి? ఈ విధంగా ఏటా కశ్మీర్‌లోయలో, జమ్ము కొండల్లో, లద్దాక్‌ ప్రాంతంలో వందలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం కుమ్మరిస్తోంది. కశ్మీర్‌లో కొంతమంది అమాయకత్వంతో, అజ్ఞానంతో పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం, ఇక్కడి రాజకీయ ఆధిపత్యాన్ని అనుభవిస్తున్న నాలుగైదు కుటుంబాలు పరోక్షంగా పాకిస్తాన్‌కు వంతపాడడం వల్ల కశ్మీర్‌ సమస్య దశాబ్దాల తరబడి రావణకాష్టంలా రాజుకొంటూనే ఉంది. తాజాగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని యావత్‌ ప్రపంచం ప్రశంసిస్తున్నది. పాకిస్తాన్‌ ఈ విషయాన్ని నేరుగా ఐక్యరాజ్యసమితి దష్టికి తీసుకెళ్లింది. సమితి పాక్‌ వాదన తిరస్కరించింది. పక్కనే వున్న చైనా సైతం కనీస స్థాయిలో కూడా పాకిస్తాన్‌కు నైతిక మద్దతు తెలపలేదు. అనేక సందర్భాలలో పాకిస్తాన్‌ నైజాన్ని వెనకేసుకొచ్చిన అమెరికా కూడా ఈ విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రత్యేక వేడుకలా పరిగణించవలసి వుంది. ఇదే రీతిలో దేశంలో కులవ్యవస్థను, ప్రాంతీయ అసమానత్వాలను, వర్గవైషమ్యాలను, ఆర్థిక వ్యత్యాసాలను నిర్మూలించి సమసమాజస్థాపన నిర్మాణ లక్ష్యాన్ని అందుకున్న రోజు అసలైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజుగా భావించవలసి వుంది. రాబోయే నాలుగైదు సంవత్సరాలకు అసలైన స్వాతంత్య్రం దిశగా ఫలితాలు సాధించబోతున్నామనే నమ్మకం ప్రజల్లో కలుగుతున్నది. ప్రధాని మోదీ త్రిపుల్‌ తలాక్‌ వ్యవస్థను రద్దుచేయడం ద్వారా ఆ సామాజిక వర్గ మహిళలకు ప్రత్యేక స్వాతంత్య్రం, అసలైన స్వేచ్ఛ, నిజమైన ఆత్మగౌరవం తీసుకొచ్చిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. మహిళల గుండెల్లో రాజా రామ్మోహన్‌రాయ్‌, కందుకూరి వీరేశలింగం లా మోదీ సైతం దురాచారాలను అంతం చేసిన సంస్కర్తలా స్థానం పొందారు. కొన్ని సామాజిక వర్గాలలో ఆర్థిక అసమానత్వ అడ్డుగోడలను తొలగించడానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో నాటి రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల ప్రక్రియను తీసుకొచ్చారు. అయితే, రిజర్వేషన్ల ద్వారా ఆ వర్గాలలోని కొన్ని కుటుంబాలు మాత్రమే ఫలితాలు పొందుతూ అసలైన పేదలు అభివ ద్ధికి నోచుకోవడం లేదు. అగ్రవర్ణాలలో కూడా ఆర్థిక అసమానత్వం రోజురోజుకూ పెరుగుతున్నదని భావించి, వీరికి కూడా మోదీ 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు తీసుకువచ్చారు. ఇదే తరహాలో రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందడానికి రొటేషన్‌ పద్ధతిన క్రీమీలేయర్‌ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయవలసి వుంది. అన్నింటికంటే ముఖ్యంగా సమర్థత, మేధస్సు, సేవాభావం వంటి గుణాలకు కులమతాలతో ముడిపెట్టకూడదు. సమాజంలోని అన్ని వర్గాలు సమాన స్థాయిలో సంతోషించినప్పుడే స్వాతంత్య్ర దినోత్సవానికి సార్థకత చేకూరుతుంది.