పల్లె ‘వెలుగు’ పడతులు
వాళ్లంతా ఆదివాసీ మహిళలు… పెద్దగా చదువూ సంధ్యాలేని వాళ్లు, నిరంతరం బతుకు పోరాటంలో నలిగిపోతున్న స్త్రీలు. పని,చాకిరి, కాయకష్టం, చెమట చిందితేనే పొయ్యి మీద అన్నం తయారవుతుంది. ఇలా సమాజంలో అట్టడుగున ఉంటూ ఎవరికీ పట్టని ఆ మహిళలూ ఒక అద్భుతాన్నే సష్టించారంటే ఎవరైనా నమ్మగలరా? కానీ వాళ్ళు ్లసాధించారు సమిష్టి క షితో…. కాలువ నీటిని వెలుగులు చిమ్మే విద్యుత్‌కాంతి కెరటాలుగా మార్చి తమ శ్రమశక్తి ఏమిటో ప్రపంచం ముందు ఆవిష్కరించారు. వారు సాధించిందేమిటో తెలుసుకోవాలంటే తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం లోని చిక్కని అడవుల మధ్య అడ్డతీగల సమీపంలో తణుకురాతిపాలెం నుంచి, వారున్న వేటమామిడి రావడానికి ఏలేరు నదిని నడుం లోతు నీళ్లలో దాటాలి. మరి దాటేద్దాం పదండి..
కొండకోనల్లోని ఏ మారుమూల గ్రామానికైనా వెళ్లి చూసినా అక్కడ పేద గిరిజన మహిళలు పచ్చని పొలాల్లో కూలిపనులు చేస్తుంటారు. అడవుల్లో కట్టెలు ఏరుతూ ఉంటారు. విస్తర్లు కుడుతూనో, బీడీలు చుడుతూనో బతుకుతుంటారు ఇదంతా గ్రామీణ నిరుపేద మహిళ జీవన నేపథ్యం. దీనికి భిన్నంగా ఈ గిరిజన మహిళలు సాంకేతికతను అందిపుచ్చుకొని, అభివ ద్ధిలో భాగస్వాములవుతున్నారు.
ఏం చేస్తున్నారు?
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని అడ్డ తీగల మండలం, వేటమామిడి గ్రామంలో గిరిజన మహిళలు 1.20 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్న తరహా జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ, లక్షలాది రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తున్నారు. గ్రామీణాభివ ద్ధి చరిత్రలో ఇదో అరుదైన అభివ ద్ధి కోణం. రాజమండ్రికి వంద కిలో మీటర్లు దూరంలో అడ్డతీగల మండలంలో ఉందీ గ్రామం. ఈ మారుమూలకు వెళ్లడానికి మెరుగైన రహదారులున్నాయి. గ్రామంలో ఉన్న 500 కుటుంబాలంతా గిరిజనులే. చేపల వేట, వరి, జీడిమామిడి పంటలు సాగు చేస్తూ వీరు జీవిస్తున్నారు. గిరిజన మహిళలే యాజమాన్యంగా, వారే ఉద్యోగులుగా, నిర్దేశకులుగా, ఒక విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తుండడం విశేషమే కదా!
ఇలా మొదలైంది!
కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు జలవిద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సర్వేలు చేశాయి. ఆ సమయంలో ఛాయారతన్ అనే గిరిజనశాఖ ఉన్నతాధికారి అడ్డతీగల వచ్చి స్థానికులతో గ్రామసభ పెట్టించి ”మీ ప్రాంతంలో గిరిజనేతరులు ఎలాంటి కంపెనీలూ పెట్టకూడదు. ప్రభుత్వమే విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి, మీకు అప్పగిస్తారు. దానిని మీరే నిర్వహించుకోండి. వచ్చిన ఆదాయాన్ని మీ ఊరిబాగు కోసం ఖర్చుపెట్టండి” అని ఆమె ఈ ప్రాజెక్టు మీద ఆసక్తి కలిగించారు. ఈ గ్రామం పక్కనే పారుతున్న ఏలేరు నదిలో బట్టలుతుక్కోవడం, చేపలు పట్టుకోవడమే వారికి తెలుసు. పంట పొలాలకు చాలా దిగువ భాగంలో నది ఉండటంతో వ్యవసాయానికీ ఈ నీళ్లు పనికిరావు. కానీ ఈ నీళ్లతోనే కరెంట్ పుట్టించవచ్చని తెలిశాక ఊరంతా ఆశ్చర్యపోయింది. దాంతో ఊరి పెద్దలంతా ఆలోచించి, ఈ ప్రాజెక్టు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక కమిటీగా ఏర్పడి 19 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఇందులో మెజారిటీ సభ్యులు మహిళలే కావడం మరో విశేషం.
రంపచోడవరం ఏజెన్సీలో ప్రవహిస్తున్న ఏలేరు నదిపై ఈ ప్రాజెక్టు ఏర్పాటవడం వెనుక ఎపి గిరిజన విద్యుత్ సంస్థ ఉంది. మారుమూల గిరిజన గ్రామాలలో నదులు, వాగులు, వంకలలో ప్రవహించే నీళ్ళ నుండి విద్యుత్ ఉత్పత్తిచేయడం, ఆ ఆదాయంతో స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, వారి గ్రామాల అభివ ద్ధికి తోడ్పడేలా మినీ హైడల్ పవర్ ప్రాజెక్టులను స్థాపించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యుత్ సంస్థ ఏర్పాటయ్యింది. రంపచోడవరం ఐటిడిఎ పరిధిలో ఏలేరు నదిపై వేటమామిడి, మిట్టపాలెం, పింజరికొండ గ్రామాల వద్ద 1.20 మె.వా. సామర్థ్యంతో, మూడు హైడల్ ప్రాజెక్టుల నిర్మాణమయ్యాయి.
మహిళలకు శిక్షణ ఇచ్చి
ఈ మహిళలకు తగిన చదువులేనప్పటికీ సాంకేతిక శిక్షణనిచ్చి, స్వంతంగా విద్యుత్‌కేంద్రం నిర్వహించుకునేలా వారిని తీర్చిదిద్దారు. విద్యుత్ ఉత్పత్తి, యంత్రపరికరాల నిర్వహణ, పవర్ హౌస్ నిర్మాణం, టర్బైన్‌ను పనిచేయించడం వంటి విషయాల్లో మహిళలకు అవగాహన కల్గించడానికి, చెట్టిపేట, నిడదవోలు ప్రాంతాల్లోని జలవిద్యుత్ కేంద్రాలలోని పనివిధానాన్ని ప్రత్యక్షంగా చూపించడం ద్వారా ప్రయోగాత్మకంగా శిక్షణ అందించారు. మహిళలకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సాంకేతిక శిక్షణ కోసం బిహెచ్‌ఈఎల్, నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, నైవేలీ సంస్థల సహకారాన్ని ఎపీ జెన్‌కో తీసుకుంది. సాంకేతిక, ఆర్థిక, యాజమాన్య అంశాలపై వీరికి సమగ్ర శిక్షణనిచ్చారు. పవర్‌హౌస్ నిర్మాణం పూర్తయిన తర్వాత గత తొమ్మిదేళ్ల నుంచి వేటమామిడి జలవిద్యుత్ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి మొదలైంది. ఆ ఆదివాసీ మహిళలకు అండగా నిలిచింది రాష్ట్రప్రభుత్వం. మరోవైపు ఆర్థికంగా నాబార్డు ఆదుకుంది.
ఈ విద్యుత్‌ని కొనేదెవరు?
ఈ మూడు ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు.. ఆంధ్రప్రదేశ్ తూర్పు మండల విద్యుత్ పంపిణీ సంస్థతో ప్రాజెక్టు కమిటీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఒక్క యూనిట్‌కి రూ.2.49 పైసల చొప్పున అమ్ముతున్నారు. విద్యుత్ అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను గిరిజన మహిళల కమిటీకి అందజేసి వారి గ్రామాభివ ద్ధికి వినియోగిస్తారు.
నెలకు రెండు లక్షల ఆదాయం
నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం ఈ విద్యుత్ కేంద్రం ద్వారా వస్తోందని ప్రాజెక్టు కమిటీ ట్రెజరర్ బట్టు రాజేశ్వరి అంటున్నారు. ఆ విశేషాలు చెబుతూ ”మాది తణుకురాతి పాలెం గ్రామం. అక్కడి నుంచి వేటమామిడి రావాలంటే రహదారులు లేవు. అడ్డంగా పారుతున్న ఏలేరు వాగును మెడలోతు నీళ్లలో జాగ్రత్తగా దాటుకుంటూ రావాలి. మాకు ఇది రోజూ అలవాటైపోయింది. మా ప్రాజెక్టులో 12 మంది టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. వీరి జీతాల కోసం నెలకు రూ.65 వేలు ఖర్చవుతుంది. వేసవిలో నదీ ప్రవాహం తక్కువ కాబట్టి, తక్కువ విద్యుదుత్పత్తి చేస్తాం. మేం ఉత్పత్తి చేసే కరెంట్‌పై నెలకు సుమారుగా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. నదిలో ప్రవాహం ఎక్కువగా లేనపుడు నీటిని నిలువ చేసి, ప్లాంట్‌కి వాడుతున్నాం. పవర్‌ప్లాంట్ వల్ల వచ్చిన ఆదాయం అంతా ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ దగ్గర ఉంటుంది. దాంతో మా గ్రామాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నాం. మాలో సగం కుటుంబాలకే మరుగుదొడ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికీి నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నాం” అన్నారు.
సొంతలాభాల కోసం కాదు… ఒక బాధ్యతతో
పర్వావరణ హితమైన ఈ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్వహిస్తూ, ఏడాదికి దాదాపు కోటి రూపాయల ఆదాయం తెస్తున్న ఈ గిరిజన మహిళలు అతితక్కువ గౌరవ వేతనాన్ని పొందుతున్నారు. కూలీ పనులకు వెళ్లి, మరికొంత సంపాదించి, కుటుంబ పోషణ చేస్తున్నారు. తమ గ్రామాభివ ద్ధికి తోడ్పడాలనే తపనతోనే ఇదంతా చేస్తున్నామని వారంటారు. పవర్ ప్రాజెక్టుతో స్థానిక గిరిజనులు స్వయంసమ ద్ధి సాధించాలనేది ప్రధానలక్ష్యం. దీన్ని సాధించడానికి జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను గిరిజన మహిళలతో ఏర్పాటైన ప్రాజెక్టు కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. అలా …అమాయకమైన ఆదివాసీ అమ్మాయిలు ఆత్మవిశ్వాసం తొణికిసలాడే ‘పారిశ్రామికులు’గా తయారయ్యారు.
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించిన ప్రాజెక్టు
జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటు వల్ల ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంటోంది. పర్యావరణ పరంగా ఈ ప్రాంతం వలస పక్షులను ఆకట్టుకుంది. భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. పర్యాటక కేంద్రంగా మారి స్థానికులకు ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రాజెక్టు కోసం నిర్మించిన రోడ్లు, ఇతర మౌలిక వసతుల వల్ల స్థానిక గ్రామాలకు విద్య, ఆరోగ్య సౌకర్యాలు కలుగుతున్నాయి. స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడుతున్నాయి. జలాశయంలో చేపల వేట పెరిగి, దానిమీద ఆధారపడే వారికి ఉపాధి కలుగుతోంది. జలాశయ నిర్మాణం వల్ల నీటి పరిమాణం పెరిగి, ఆక్వాటిక్ జీవులు నివసించేందుకు విశాలమైన ప్రాంతం లభించింది. నిల్వ నీటిలో పెరిగే జలచరాలు, అనేక వలస పక్షులకు ఆహారంగా అందిస్తాయి. పరిసరాల్లోని జీవజాలం అభివతద్ధి చెందడం వల్ల జీవవైవిధ్యం ఈ ప్రాంతంలో వికసిస్తోంది.