కమలాధీశుల కల నెరవేరింది!
కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు చేస్తున్నట్లు అమిత్ షా ప్రకటన చేస్తున్న సమయంలో ఆ చరిత్రాత్మక ఘట్టాన్ని స్వయంగా చూస్తున్నందుకు వెంకయ్య హదయం ఎంతో ఉప్పొంగిపోయినా, రాజ్యసభ చైర్మన్‌గా ఎక్కడా తనలో ఉద్వేగం కనపడకుండా, పార్లమెంటరీ సంప్రదాయాలు భగ్నం కాకుండా అంతా సవ్యంగా జరిగేలా చూశారు.
ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడును ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎందుకు ఎంపిక చేసుకున్నారా అన్న విషయంలో సందేహాలు ఎవరికైనా ఉంటే, ఇటీవల రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దుపై తీర్మానం, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులను ఆమోదించిన తీరు చూసిన తర్వాత ఆ సందేహాలు తీరిపోయి ఉండాలి. రాజ్యసభ చైర్మన్‌గా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం నాడు చెన్నైలో ఆయన పనితీరుపై వెలువడిన ఒక పుస్తకాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభలో వెంకయ్య సమర్థంగా వ్యవహరించడం వల్లే కశ్మీర్‌కు సంబంధించిన తీర్మానం బిల్లులు సులభంగా ఆమోదం పొందగలిగాయని ప్రశంసించారు. గందరగోళంలో బిల్లులు ఆమోదం పొందేలా ఏ సభాధ్యక్షుడైనా చేయగలుతారు. కానీ వెంకయ్య నాయుడు ప్రతిపక్ష నేతలతో మాట్లాడి, ఒప్పించి, పట్టువిడుపులతో వ్యవహరించి కశ్మీర్ పై చర్చ, ఓటింగ్ జరిగేలా, రాజ్యసభలో రెండింట మూడవవంతు సభ్యులు ఆమోదించేలా చేయగలిగారు.
కశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా అంతర్భాగం చేయాలన్న ఆకాంక్ష వెంకయ్య నాయుడుకి విద్యార్థి దశనుంచీ ఉన్నది. అమిత్ షా ఈ విషయాన్ని స్వయంగా చెన్నై సభలో ఉటంకించారు. వెంకయ్య నెల్లూరులో విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు కశ్మీర్‌లో బాంబులు ప్రేలి అనేకమంది అమాయకులు మరణించిన ఘటనకు నిరసనగా తరగతులు బహిష్కరించారు. ‘వెంకయ్యా, మీ సమ్మె దేనికిరా?’ అని తరగతి లెక్చరర్ ఆయనను అడిగారు. ‘కశ్మీర్‌లో బాంబు పేలి అనేకమంది అమాయకులు చనిపోయారు సార్’ అని వెంకయ్య బదులిచ్చారు, దీనికి లెక్చరర్ స్పందిస్తూ ‘కశ్మీర్‌లో బాంబు పేలితే కసుమూరోడికి నీకెందుకురా, పోయి చదువుకో పో’ అని మందలించారు. వెంకయ్య వెంటనే లెక్చరర్‌ని తిరిగి ఇలా ప్రశ్నించారు: ‘సార్, మీ బొటన వేలుకు దెబ్బ తగిలితే మీరేం చేస్తారు?’ అని. ‘ఎవరైనా ఏమి చేస్తారు. కట్టు కట్టుకుంటారు’ అని ఆ లెక్చరర్ బదులిచ్చారు. ‘అయితే బొటన వేలుకు దెబ్బతెగిలితే మీ కన్ను చూడదా, మీ నడుము వంగదా, మీ చేయి తడమదా’? అని వెంకయ్య అడిగారు. దానికి ఆ లెక్చరర్ ‘భలేవాడివే ఇది నా దేహం’ అని జవాబిచ్చారు. ‘అయితే ఇది నా దేశం సార్’ అని వెంకయ్య అనడంతో క్లాస్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.
దాదాపు 24 సంవత్సరాల పాటు వెంకయ్యనాయుడు వద్ద ఒక సహాయకుడుగా పనిచేసిన నాకు ఆయనలో దేశ భక్తి, జాతీయత నరనరాల్లో ఎంత జీర్ణించుకుపోయాయో బాగా తెలుసు. కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు చేస్తున్నట్లు అమిత్ షా ప్రకటన చేస్తున్న సమయంలో ఆ చరిత్రాత్మక ఘట్టాన్ని స్వయంగా చూస్తున్నందుకు వెంకయ్య హ దయం ఎంతో ఉప్పొంగిపోయినా, రాజ్యసభ చైర్మన్‌గా ఎక్కడా తనలో ఉద్వేగం కనపడకుండా, పార్లమెంటరీ సంప్రదాయాలు భగ్నం కాకుండా అంతా సవ్యంగా జరిగేలా చూశారు.
చాలా చిన్నవయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రభావానికి లోనయిన వెంకయ్య, విద్యార్థి నాయకుడుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ జాతీయ స్థాయికి ఎదిగిన తీరు నేటి తరానికి ఆదర్శం. అటల్ జీ, ఆడ్వాణీల పర్యటనలకు సంబంధించిన పోస్టర్లు అతికించిన వ్యక్తే ఆ తర్వాతి రోజుల్లో బిజెపి అధ్యక్షుడుగా వారిద్దరి మధ్యా కూర్చోగలిగారు. వెంకయ్య నాయుడు వద్ద అన్ని సంవత్సరాలు ఉండి కూడా నాకు ఆయనలోని మూడు ప్రధాన లక్షణాలు అలవడలేదు. అవి: క్రమశిక్షణ, సమయ పాలన, వాక్చాతుర్యం. ఏ రోజూ ఆయన క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేదు. ఉదయం 5 గంటలకు లేచినప్పటినుంచీ రాత్రి వరకూ నిర్విరామంగా పనిచేసే నాయకులు నేడు దేశంలో చాలా అరుదు. కానీ వెంకయ్య ఏనాడూ తన దిన చర్యకు, నిర్ణయించిన కార్యక్రమాలకు అతీతంగా వ్యవహరించింది లేదు. ఏ కార్యక్రమానికైనా ఆయన చెప్పిన సమయం కంటే ముందుగా వెళతారు. వెంకయ్యనాయుడు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయన ముందుగా వస్తారని తెలిసిన అటల్ జీ, ఆడ్వాణీ ఆయన కంటే ముందు వచ్చేందుకు ప్రయత్నించేవారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా వెంకయ్య సమయపాలన బాగా తెలుసు. వెంకయ్యనాయుడు చూపే సమయ స్ఫూర్తి అద్భుతమైనది. ఆయనకు వున్న వాక్చాతుర్యం చాలా తక్కువమంది నేతల్లో కనపడుతుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి దాదాపు రెండునెలలు ఖాళీగా ఉండి దిక్కుతోచక రెండు రోజుల క్రితం మళ్లీ సోనియాగాంధీని అధ్యక్షురాలిగా ఎన్నుకున్నప్పుడు నాకు ఒక సారి వెంకయ్య అన్న మాటలే గుర్తుకు వచ్చాయి. ఇండియా టుడే సదస్సులో ఆ సంస్థ అధినేత అరుణ్ పురి కేంద్ర మంత్రి మన్మోహన్ సమక్షంలో నాడు బిజెపి అధ్యక్షుడుగా ఉన్న వెంకయ్యనాయుడును ఒక ప్రశ్న అడిగారు.
‘వెంకయ్యాజీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీనతలేమిటి’ అని. ‘ఈ ప్రశ్నను మీరు మన్మోహన్ సింగ్ గారిని అడగాలి’ అని వెంకయ్య జవాబిచ్చారు. ‘ప్రతిపక్షంలో ఉన్నారు కదా.. మీరేమనుకుంటున్నారు’ అని అరుణ్ పురి రెట్టించారు. వెంకయ్య తడుముకోకుండా ‘ఇన్ డెమాక్రసీ, డైనాస్టీ ఈజ్ నాస్టీ, బట్ ఇటీజ్ టేస్టీ టు సం పీపుల్’ (ప్రజాస్వామ్యంలో వారసత్వం అనేది రోతగా ఉంటుంది. కాని కొందరికి రుచికరంగా ఉంటుంది) అని సమాధానం ఇవ్వడంతో మొత్తం సమావేశమంతా నవ్వులతో ప్రకంపించింది. పార్టీ అధ్యక్షుడుగా ఆయన సభల్లో మాట్లాడిన ప్రతిభావంతమైన ఏక వాక్యాలు తర్వాతి కాలంలో నినాదాలుగా మారాయి. ‘నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్. సెల్ఫ్ లాస్ట్’ (మొదట దేశం, తర్వాత పార్టీ, ఆ తర్వాతే నేను) అన్న ఆయన నినాదం ఇప్పుడు బిజెపి సిద్ధాంతంగా మారింది. ‘ప్రతి చేతికీ పని, ప్రతి చేనుకూ నీరు’ అని ఆయన దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాన్ని సరళమైన మాటల్లో చెప్పేవారు. వాజపేయి నేత త్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నా బిజెపి సిద్ధాంతాలను వదిలిపెట్టదన్న విషయాన్ని సరళంగా చెబుతూ వెంకయ్య ‘ఒక చేతిలో బిజెపి జెండా, మరో చేతిలో ఎన్డీఏ ఎజెండా’ అన్న నినాదాన్ని వ్యాప్తి చేశారు ‘మాకు లీడర్ ఉన్నారు, వారికి రీడర్ మాత్రమే ఉన్నారు..’ అని వాజపేయి, సోనియా నాయకత్వాలపై ఆయన చేసిన వ్యాఖ్య ఎంతో ప్రాచుర్యం పొందింది. బిజెపిలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ‘ఇన్ బిజెపి, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్. కమిటీ డిసైడ్స్’ (బిజెపిలో అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారు, మిగతా వారు నిర్ణయిస్తారు) అనేవారు.
18వ ఏట నుంచి దాదాపు 50 ఏళ్ల పాటు ఒకే పార్టీలో ఉండి ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా నియమించినప్పుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూనే, పార్టీ నుంచి ఎడబాటు సహించలేక కంటతడి పెట్టుకున్నారు. నరేంద్రమోదీ సహా పలువురు బిజెపి నేతలు ఆయన్ని ఓదార్చారు. ఓటింగ్‌కు ముందు జరిగిన ఒక సభలో మోదీ మాట్లాడుతూ వెంకయ్య పార్టీని వీడి ఉపరాష్ట్రపతి కావడం ఒక స్త్రీ పుట్టినింటి నుంచి మెట్టినింటికి మారినట్లుగా అభివర్ణించారు. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కొంత కాలం స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన వెంకయ్య కొద్ది రోజుల్లోనే తేరుకుని ఉపరాష్ట్రపతి, రాజ్యసభా చైర్మన్ పదవిని పూర్తిగా తనకు అనుకూలంగా మలుచుకున్నారు. పార్లమెంట్ పై , ప్రజాస్వామ్యంపై ప్రజల్లో చైతన్యం పెంచడమే తన లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
పుట్టినింటికి ఎంతో న్యాయం చేసిన ఆయన మెట్టినింటికి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టారు. ప్రజల్లో ఉండకుండా ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆయన ప్రజల మధ్య ఉండడం మానుకోకుండా ప్రజల్లో ఆ పదవీ గౌరవాన్ని పెంచారు. న్యాయమూర్తులు, మేధావులు, పాత్రికేయులు, అధికారులు, విద్యార్థులు, మహిళలు, రచయితలు, కవులు ప్రతి వర్గాన్నీ తనకు సన్నిహితం చేసుకున్నారు. ఒక సహాయకుడుగా ఉన్నప్పటికీ ఆయన ఏనాడూ నన్ను ఉద్యోగిగా కాక కుటుంబ సభ్యుడుగా చూసుకున్నారు. ఆయన వద్ద విలువలతో కూడిన రాజకీయాలు నేర్చుకున్నందువల్లనే నేను పార్టీలో ఇవాళ బాధ్యతతో ఇచ్చిన పనులు నెరవేర్చగలుగుతున్నాను అన్నారు.