‘ఉన్నావ్’పై నిర్లక్ష్యం
ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలిపై దాడిలో నిందితులపై చర్య తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయి… కాదు కాదు అంతు లేని నిర్లక్ష్యంతో వున్నాయి… అమానవీయంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వాల్లోని పెద్దల అండదండలతోనే బాధితుల పట్ల నిందితులు ఇంతలా రెచ్చిపోతున్నారని స్పష్టమవుతోంది. జూలై 28న బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ట్రక్కుతో ఢీ కొట్టించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ కారులో ప్రయాణిస్తున్న ఆమె మేనత్త, పిన్నమ్మ మరణించగా, ఆమె తరుపు న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలి ఆరోగ్యం ఇంకా విషమంగా వుంది. లక్నో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. రారుబరేలి జిల్లా లోని తన బంధువును కలుసుకునేందుకు బాధితురాలు తన కుటుంబ సభ్యులతోనూ, న్యాయవాదితోనూ కలిసి వెళ్తుండగా ఆ దాడి జరిగింది. బిజెపి- ఆరెస్సెస్‌లు తమ అధికార బలంతో బాధితుల నోరు నొక్కే ప్రయత్నమే ఈ ప్రమాదం. అక్కడి ప్రభుత్వం తన ధన, కండ బలాలను ఉపయోగించి, చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. పైపెచ్చు నిందితులకు రాచమర్యాదలు చేస్తున్నారు. జైలులో ఉన్న నిందితుడు ఎమ్మెల్యే సెన్‌గార్‌కు ఫోన్ సౌకర్యం కల్పించడంతో సహా అనేక అక్రమాలకు పాల్పడుతోంది. సంస్కారవంతమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని బాకాలూదుకునే బిజెపి తన పార్టీ ఎమ్మెల్యే, అతని బంధుగణం సాగించిన, సాగిస్తున్న రాక్షస చర్యలకు వత్తాసుగా నిలవడం అవమానకరం. ‘బేటీ బచావో’ అన్నది బిజెపి నినాదమే తప్ప ఆచరణలో ఆడపిల్లకు రక్షణే లేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగమూ అలాగే వ్యవహరించింది. కాబట్టే ప్రమాద సమయంలో బాధితురాలి వెంట భద్రతా సిబ్బంది కూడా లేరు. దేశవ్యాపిత సంచలనమైన ఆ కేసులో బాధితురాలికి రక్షణ కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ యోగి సర్కారుకు అలాంటివేవీ లేవని మరోసారి స్పష్టమయింది.
తమకు వస్తున్న బెదిరింపులపై బాధిత కుటుంబం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరుకి రాసిన లేఖను సుప్రీం కోర్టు ఫిర్యాదుగా స్వీకరించింది. గురువారం విచారణ జరిపి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు మధ్యంతర పరిహారంగా చెల్లించాలనీ, కుటుంబానికి రక్షణ కల్పించాలనీ ఆదేశించడం ఆహ్వానించదగింది. ఇందుకు సంబంధించిన ఐదు కేసులను ఢిల్లీ ట్రయల్ కోర్టుకు బదిలీ చేసి 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించడం సత్వర న్యాయం అందించే దిశలో ఒక చర్యగా భావించవచ్చు. ప్రమాదంపై ఏడు రోజుల్లోగా సిబిఐ దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పడంతో వారికీ సాగదీతకు అవకాశం లేకుండా పోయింది. కాలపరిమితికి లోబడి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు విచారణ ప్రారంభించాలని, వేధింపులు, చిత్రహింసలు ఎదుర్కొంటున్న బాధితురాలికి, ఆమె బంధువులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని, ఐద్వా వంటి మహిళా సంఘాలు చేసిన డిమాండ్ పాక్షికంగా నెరవేరినట్టే.
ప్రమాదం జరిగిన అనంతరం సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు బాగున్నప్పటికీ బెదిరింపుల గురించి బాధితురాలు రాసిన లేఖ అందిన వెంటనే స్పందించి వుంటే ఇన్ని అనర్ధాలు జరిగేవి కావు. బెదిరింపులపై జూలై 12వ తేదీ బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ జూలై 30న వెలుగు లోకి రావడం గమనార్హం. అయితే, ఆ లేఖను సుమోటోగా పరిగణన లోకి తీసుకొని కేసు విచారించారు. లేఖలో బాధితురాలు గత నెల 7,8 తేదీలలో జరిగిన సంఘటనలను వివరించింది. సెన్‌గార్ మరి కొందరితో కలిసి వచ్చి కేసు ఉపసంహరించుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరించినట్లు తెలిపింది. తమను బెదిరించిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా అధికారులను ఆదేశించాలని ఆ లేఖలో బాధితురాలు కోరింది. అత్యాచార కేసు నిందితులు, వారి కుమారులు తమ నివాసానికి వచ్చి బెదిరించినట్లు పేర్కొంది. ఆ మరుసటి రోజు మరో వ్యక్తి తమ నివాసానికి వచ్చినట్లు ఆ లేఖలో తెలపడంతో పాటు ఆ వ్యక్తులు తమ నివాసానికి ఏ కారులో వచ్చారో తెలియచేసే వీడియోను కూడా లేఖకు జత పరిచింది. ఇంత వివరంగా వేధింపులను ఏకరువు పెట్టినా గాని వెంటనే తగు చర్యలు చేపట్టకపోవడం అన్యాయం. ఇప్పటికైనా సిబిఐ తగు రీతిన దర్యాప్తు చేసి నేరస్తులంతా కటకటాల వెనక్కు వెళ్లేలా చూడాలి. ఫాస్ట్ ట్రాక్ విచారణ నిజంగా అంత ఫాస్ట్‌గా నడిపి దోషులను శిక్షించాలి. ఈ దుర్మార్గాలకు కారణభూతుడైన సెన్‌గార్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం మాత్రమే చాలదు. ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలి. అందుకు పాలక పార్టీ పైన, ప్రభుత్వం పైన ప్రజల నుండి ఒత్తిడి తేవాలి. మరో ‘ఉన్నావ్’ ఘటన జరగకుండా అన్ని వైపుల నుండి ప్రయత్నం జరగాలి.