కశ్మీర్‌కు వి’ముక్తి’
ఆర్టికల్ 370, 35 ఏ రద్దు…రెండు ముక్కలయిన కశ్మీర్..
అ’ద్వితీయ’ చారిత్రక ఘట్టానికి నాంది
” ఆగష్టు 15 భారతావనికి స్వాతంత్య్రం లభించిన రోజైతే ఆగష్టు 5 కశ్మీర్ విముక్తమయిన రోజుగా చరిత్రలో నిలిచిపోనుంది..ఏళ్లుగా నలుగుతూ.. కల్లోలంగా ఉన్న జమ్మూకశ్మీర్ విషయంలో నరేంద్రమోదీ సర్కారు చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రాతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేస్తున్నట్టు సాహసోపేతమైన నిర్ణయాన్ని వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో జమ్మూకశ్మీర్ ముఖచిత్రం మారిపోనుంది. భారత మ్యాపులో కూడా మార్పులు రానున్నాయి. రాష్ట్రాన్ని రెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్, లడఖ్‌గా విభజించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం నిరంతర సమస్యగా మారడం, రాష్ట్రం గతకొంతకాలంగా కల్లోలంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అమిత్ షా తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారనున్న జమ్మూకశ్మీర్‌కు శాసనసభ ఉంటుందని, కానీ లడఖ్ శాసనసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందని ఆయన వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు ప్రకటన, జమ్మూకశ్మీర్ విభజన బిల్లును ప్రవేశపెట్టడంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది”
- -ఇక జమ్ములో త్రివర్ణ జెండా రెపరెపలు
- -చారిత్రాత్మక బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించిన అమిత్‌షా
- -రిజర్వేషన్ల సవరణ బిల్లుకు ప్రతిపాదన
- -ప్రతిపక్షాల ఆందోళనల మధ్య రాష్ట్రపతి ఆదేశాలు జారీ
- -ప్రతి చట్టం ఇకపై జమ్ముకశ్మీర్‌లో అమలు కానుంది
- -రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్ల ఆధీనంలోకి
- -పోలీసు యంత్రాంగం, భూముల నిర్వహణపై అధికారాలు ఉండవు
- -జమ్ము కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతల్లో భూములను కొనుగోలు చేయొచ్చు
- -లద్దాఖ్‌లో అసెంబ్లీ ఎన్నికలంటూ ఉండవు, కేవలం లోక్‌సభ ఎన్నికలే
- -29 నుంచి 28కి తగ్గిన రాష్ట్రాల సంఖ్య, 9 కి పెరిగిన కేంద్ర పాలిత సంఖ్య
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లును సోమవారం రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రతిపాదించారు. ఉదయం 11 గంటలకు మొదలైన రాజ్యసభ సెషన్‌లో ఆయన జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లుతోపాటు ఆర్టికల్ 370 రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆందోళనకు దిగాయి. గందరగోళం మధ్య కొద్దిసేపు రాజ్యసభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారానే ఈ బిల్లు రద్దు జరుగుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు కశ్మీర్‌లో నియోజకవర్గ పునర్ వ్యవస్థీకరణ బిల్లు కూడా రాజ్యసభ ముందుకు వచ్చింది. వెనువెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కశ్మీర్‌పై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా ఫోన్ చేసి తెలియజేస్తున్నారు. రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బిహార్, ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి కశ్మీర్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. అన్ని రాష్ట్రాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరుణంలో కశ్మీర్ లోయకు బలగాల మోహరింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కశ్మీర్ లోయకు వాయుమార్గంలో పారామిలిటరీ బలగాలను తరలించారు. యూపీ, ఒడిశా, అసోం, ఇతర ప్రాంతాల నుంచి బలగాలను తీసుకెళ్తున్నట్లు సమాచారం.
జమ్మూ కశ్మీరుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. హిమాలయ పర్వత సానువుల్లోని కీలక రాష్ట్రాన్ని మూడు భాగాలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జమ్మూ, కశ్మీర్, లద్ధాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ,కశ్మీర్ ఏర్పడనున్నాయి. చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్ధాఖ్ ఏర్పడనుంది. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35ఏ కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో.. టిబెట్, చైనా, గిల్గిత్-బాల్టిస్థాన్ సరిహద్దులుగా కలిగిన లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతమైంది.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. అధికరణ 370రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని అమిత్ షా ప్రకటించారు. అలాగే జమ్ము-కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లద్దాఖ్‌ను చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించారు.
రాజ్యసభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను వెనువెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. నజీర్ అహ్మద్ లావాయ్, ఎంఎం ఫయాజ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ ప్రతులను ఆ ఇద్దరు చింపేశారు. దీంతో వారిని సభ నుంచి బయటకు పంపాలని మార్షల్స్‌కు చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సభ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఇ ఇద్దరు సభ్యులు చొక్కాలు చింపుకుని నిరసన వ్యక్తం చేశారు.
దేశంలో రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రం రెండు భాగాలుగా విభజన చేసింది. జమ్మూకశ్మీర్ నుంచి లడఖ్ ను వేరు చేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీంతో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గింది. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడక ముందు మొత్తం 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను వెనువెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. దీంతో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.
ఆర్టికల్ 370బీ ‘కశ్మీర్‌కు ప్రత్యేకం’!
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 370 పేరిట చేర్చిన తాత్కాలిక నిబంధన ఇది. 1947 అక్టోబరు 26న కశ్మీర్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు అనే మూడు అంశాలకే ఈ విలీనం పరిమితమైంది. విలీనం తుది విధి విధానాలు అప్పటికింకా ఖరారు కాలేదు. వీటిపై 1949 జులైలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత షేక్ అబ్దుల్లా భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారు. పర్యవసానంగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం రక్షణ, విదేశీ, ఆర్థిక, కమ్యూనికేషన్ వ్యవహారాలు తప్ప మిగతా వాటిలో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఇతర చట్టాల్ని అమలుచేయాలంటే రాష్ట్ర సమ్మతిని పార్లమెంటు తీసుకోవాల్సి ఉంటుంది. పౌరసత్వం, ఆస్తిపై హక్కు, ప్రాథమిక హక్కుల విషయంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు భూముల్ని కొనలేరు. ఆర్టికల్ 360 కింద ఈ రాష్ట్రంలో కేంద్రం ఆర్థిక ఎమర్జెన్సీని విధించలేదు.
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సోమవారంనాడు సంచలన ప్రకటన చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 370 అధికరణ రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం, ఆ కొద్ది సేపటికే రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడంతో ఇకకశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే సంక్రమించనున్నాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు కానుంది.
జమ్మూ-కశ్మీరు మహారాజు హరి సింగ్ 1927, 1932లలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా పాలితులు, వారి హక్కులను నిర్వచించారు. ఆ రాజ్యానికి వలస వెళ్ళినవారి హక్కులను కూడా క్రమబద్ధీకరించారు. 1947 అక్టోబరులో రాజా హరిసింగ్ భారత దేశంలో తన రాజ్యాన్ని విలీనం చేశారు. భారత దేశంలో విలీనమైన తర్వాత జమ్మూ-కశ్మీరు షేక్ అబ్దుల్లా పాలనలోకి వచ్చింది. ఆయన 1949లో భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, రాజ్యాంగంలో అధికరణ 370ని చేర్చేలా చేశారు. ఈ అధికరణ ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి లభిస్తోంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు మినహా మిగతావన్నీ జమ్మూ-కశ్మీరు అధికార పరిథిలోనే ఉంటాయని ఈ అధికరణ చెప్తోంది.
1952 ఢిల్లీ అగ్రిమెంట్ ప్రకారం కొన్ని రాజ్యాంగ నిబంధనలను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 1954లో జమ్మూ-కశ్మీరుకు వర్తింపజేశారు. ఈ అగ్రిమెంట్‌ను షేక్ అబ్దుల్లా, జవహర్లాల్ నెహ్రూ కుదుర్చుకున్నారు. అదే సమయంలో అధికరణ 35ఏను రాజ్యాంగంలో చేర్చారు.
1956లో జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించారు. దీనిలో గతంలో మహారాజా నిర్వచించిన శాశ్వత నివాసుల నిర్వచనాన్ని యథాతథంగా ఉంచారు. దీని ప్రకారం 1911కు పూర్వం రాష్ట్రంలో జన్మించిన లేదా స్థిరపడిన అందరూ శాశ్వత నివాసులవుతారు. లేదంటే, 1911కు పూర్వం పదేళ్ళ నుంచి ఆ రాష్ట్రంలో నివసిస్తూ చట్టబద్ధంగా స్థిరాస్తిని సంపాదించుకున్నవారు కూడా శాశ్వత నివాసులవుతారు. జమ్మూ-కశ్మీరు నుంచి పాకిస్థాన్‌కు వలసవెళ్ళిపోయినవారిని రాష్ట్ర పాలితులుగానే పరిగణిస్తారు. వారి రెండు తరాల సంతతిని రాష్ట్ర పాలితులుగానే పరిగణిస్తారు.
పర్మినెంట్ రెసిడెంట్ చట్టం వల్ల శాశ్వత నివాసులు కానివారు ఆ రాష్ట్రంలో స్థిరపడటం నిషిద్ధం. స్థిరాస్తిని కూడా సంపాదించుకోకూడదు, ప్రభుత్వోద్యోగాలు, ఉపకార వేతనాలు, ఇతర సహాయాలు పొందడానికి హక్కులు ఉండవు. మరోవైపు జమ్మూ-కశ్మీరు మహిళలు నాన్ పర్మినెంట్ రెసిడెంట్స్‌ను వివాహం చేసుకుంటే, ఆ మహిళలకు రాష్ట్ర పాలితులుగా ఉండే హక్కులు లభించవు. ఈ హక్కులు ఇటువంటి మహిళలకు వర్తించవు. అయితే 2002 అక్టోబరులో ఆ రాష్ట్ర హైకోర్టు కాస్త ఊరట ఇచ్చింది. నాన్ పర్మినెంట్ రెసిడెంట్స్‌న వివాహం చేసుకునే మహిళలు తమ హక్కులు కోల్పోరని, వారి సంతానానికి మాత్రం వారసత్వ హక్కులు ఉండవని తెలిపింది.
35ఏ గురించి…
భారత రాజ్యాంగంలోని అధికరణ 35ఏ ప్రకారం జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర శాశ్వత నివాసులను నిర్వచించే అధికారం ఆ రాష్ట్ర శాసన సభకు ఈ అధికరణ ద్వారా లభిస్తోంది. ఈ అధికరణను 1954 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా, ఆ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో భారత రాజ్యాంగంలో చేర్చారు. కాగా, ‘వుయ్ ద సిటిజెన్స్’ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో) 2014లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధికరణ 35ఏను రాజ్యాంగంలో చేర్చిన తీరును ప్రశ్నించింది. అధికరణ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించవలసి ఉండగా, అటువంటి సవరణ జరగకుండానే అధికరణ 35ఏను చేర్చారని ఆరోపించింది. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని, వెంటనే అమల్లోకి రాలేదని తెలిపింది.