‘అమితో’త్సాహానికి యాగంతో చెక్
హిందుత్వ ఎజెండాయే లక్ష్యంగా బీజేపీకి చెక్
మరో మహా యాగానికి కేసీఆర్ సంసిద్ధం
- -టీఆర్ఎస్కు దెబ్బకొట్టే వ్యూహ రచనలో అమిత్‌షా
- ‘తెలంగాణ విమోచన’ అధికారికంగా నిర్వహించాలని డిమాండ్
- సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభకు సన్నాహాలు
- అమిత్‌షా హిందుత్వ ఎజెండాకు యాగంతో చెక్
- యాదాద్రి పునర్నిర్మాణానికి భారీ ఎత్తున యాగం
- అన్ని రాష్ట్రాల సీఎంలు, గవర్నర్ల సమక్షంలో మహా చండీ యాగం
- హిందూ వ్యతిరేక మచ్చ తొలగించుకునేందుకే కేసీఆర్ యాగం
- తెలంగాణలో బలోపేతానికి బీజేపీ భారీ ప్రణాళికలు
- బీజేపీకి చెక్ పెట్టేందుకు గులాబీ శ్రేణుల ప్రయత్నాలు
(నండూరి రవిశంకర్, జ్యోతి న్యూస్)
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ గురిపెట్టింది. వచ్చే ఎన్నికలలోగా బలోపేతం కావడానికి పక్కా ప్రణాళికలు ఖరారు చేసుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇటీవల అమిత్ షాతో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో అమిత్‌షా తెలంగాణ బీజేపీ పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ పాలనపై పోరు ఉధతం చేయాలని సూచించినట్లు సమాచారం. కేసీఆర్ పాలనలో ఎక్కడ లొసుగులున్నా వాటిని హైలెట్ చేయాలని..ప్రజా సమస్యలపై నిలదీయాలని సూచించారు. బీజేపీ పార్టీ నేతలకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దిశా నిర్దేశం చేశారు. సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేయాలన్నారు. ఇక ఇతర పార్టీలనుంచి బీజేపీలోకి వచ్చి చేరే చేరికలపై పక్కా వ్యూహం అనుసరించాలన్నారు.
ఆగస్టు తొలి వారం నుంచి ప్రతి 15 రోజులకు ఒకరు చొప్పున రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటన ఉంటుందన్నారు. ఇప్పటికే ఏడాది వ్యవధిలో 52 మంది మంత్రుల రాకతో బీజేపీ శ్రేణులు అత్యుత్సాహంతో ఉన్నాయి. గత నెల 6న అమిత్ షాతో సభ్యత్వ నమోదు ప్రారంభం అయింది. పార్టీలో చేరేవారిని గుర్తించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టే కార్యక్రమానికి కార్యాచరణ రూపుదిద్దుతున్నారు అమిత్‌షా.
సెప్టెంబరు 17న భారీ బహిరంగ సభ
తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్ సీఎం అయిననాటినుంచి ఆ ఊసే ఎత్తడంలేదు. ఒక వేళ విమోచన దినోత్సవం అధికారికంగా జరిపితే ముస్లిం వర్గాలు దూరం అవుతారనే ఆలోచనతో కేసీఆర్ ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు అమిత్‌షా దీన్ని
బూచిగా చూపించి కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు హైదరాబాద్‌లో వచ్చే సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభకు స్కెచ్ గీస్తున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ హిందుత్వ ఎజెండాకు దూరం అని ప్రచారం ఉధృతం చేయనున్నారు.
మరో యాగానికి కేసీఆర్ రెడీ
బీజేపీ ప్రాభవాన్ని తెలంగాణలో తగ్గించడానికి కేసీఆర్ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. వచ్చే దసరా నాటికి యాదాద్రిని ప్రపంచ వారసత్వ దేవాలయాలకు ధీటుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ చెక్కించే శిల్పాలు, కళా సంపద చూసి అంతా ఆశ్చర్యచకితులవుతున్నారు. ప్రపంచ 8వ వింతగా శ్లాఘిస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. దేశవిదేశాలనుంచి పలువురు నేతలను, ప్రతి రాష్ట్ర సీఎం, గవర్నర్లను ఆహ్వానిస్తున్నారు. మహా కుండలీకరణ యాగంతో, రుత్విక్కుల వేద మంత్రాల మధ్య తాను అసలు సిసలైన హిందుత్వ వాదినని ప్రపంచానికి చాటేందుకు…మరో పక్క బీజేపీ అనుచిత వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకే కేసీఆర్ ఈ యాగం తలపెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చిన జీయర్ స్వామితో చర్చలు
తెెలంగాణ సీఎం కేసీఆర్ మరో యాగానికి శ్రీకారం చుట్టనున్నారు. త్వరలో యాదాద్రి పుణ్యక్షేత్రంలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయమై గత నెలలో చినజీయర్ స్వామితో కేసీఆర్ చర్చించిన విషయం విదితమే. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలోనే రెండు దఫాలు యాగాలు నిర్వహించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తర్వాత 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ తన ఫామ్ హౌజ్‌లో చంఢీయాగం నిర్వహించారు.
ఆ యాగాల తర్వాత మరోసారి కేసీఆర్ యాగం నిర్వహించేందుకు సిద్దమయ్యారు.యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి పుణ్యక్షేత్రంలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టారు.ఈ విషయమై చినజీయర్ స్వామితో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. 100 ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగం నిర్వహించాలని నిర్ణయించారు.3000 మంది రుత్విక్కులు, మరో 3000 మంది సహాయకులతో మహాయాగాన్ని గొప్పగా చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.
దేశంతో సాటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలను, భద్రినాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి లాంటి మహాక్షేత్రాల నుంచి మఠాధిపతులను, కేంద్రప్రభుత్వ పెద్దలను, అన్నరాష్ట్రాల గవర్నర్లను, సీఎంలను, మంత్రులను, వివిధ సంప్రదాయాలకు చెందిన మత గురువులను ఈ యాగానికి ఆహ్వానిస్తారు. మహా సుదర్శన యాగానికి లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విస్త తమైన ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. మహా సుదర్శన యాగం నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ చినజీయర్ స్వామితో చర్చించారు
సీఎం కేసీఆర్ నిర్వహిచిన యాగాలు
యజ్ఞం లేదా యాగానికి హిందూ సంప్రదాయంలో విశిష్టస్థానముంది. విశ్వకల్యాణం, ప్రజాశ్రేయస్సు కోరుతూ ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, మునీశ్వరులు యాగాలు చేశారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా గల మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కూడా యజ్ఞయాగాదుల పట్ల చాలా విశ్వాసం ఉంది. దాదాపు ఇరవై ఏళ్లుగా ఆయన వివిధ సందర్భాల్లో యాగాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం కోసం ఆయన శతచండీయాగం నిర్వహించారు. మరుసటి ఏడాది తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నవ చండీయాగం, ఆయుత శతచండీయాగం నిర్వహించారు. ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన ఆయన లోకకల్యాణం, రాష్ట్ర అభివద్ధి కోసం మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగంను నిర్వహించనున్నారు.
20 ఏళ్లుగా యాగాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గడచిన 20 ఏళ్లుగా యాగాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన అనేక యాగాలు చేశారు. వాటిలో 1996లో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు. సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకం.
– 1997లో బాపిశాస్త్రి ఆధ్వర్యంలో చండీహననం.
– 2005లో కేంద్రమంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మఠం, చండీయాగం.
– 2006లో సహస్ర చండీయాగం.
– 2007లో పాలకుర్తి నరసింహ రామశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో చండీయాగం, సుదర్శన యాగం.
– 2008లో సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో గాయత్రీ యాగం.
– 2009లో తెలంగాణ భవన్లో 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం.
– 2010లో తెలంగాణ భవన్లో చండీయాగం.
– 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శతచండీయాగం.
– 2015 నవంబర్ 27న నవ చండీయాగం.
– 2015 డిసెంబర్ 23 నుంచి 27వరకు ఆయుత శతచండీయాగం.
– 2018 రాజశ్యామల యాగం.
చండీ యాగ విశేషాలు
కలియుగంలో చండీయాగానికి మించిన యాగం మరొకటి లేదని చెబుతారు. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణం చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమమని అంటారు. చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయనుకుంటారు కానీ ఇందు లో ఉండేవి 578 మాత్రమే. అయితే ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలుగా పిలుస్తారు. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకం బరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతా మూర్తులకు సప ్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తశతి అనే పేరు వచ్చింది. కలియుగంలో చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర, అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు. గత 200 ఏళ్ల లో అయుత చండీ యాగాన్ని రెండే రెండుసార్లు చేశారు. మొదటిసారి శంగేరీ పీఠాధిపతి షష్టిపూర్తి సమయంలో చేస్తే.. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు.
యాగంతో రాజయోగం వస్తోందా ? రాజశ్యామల యాగం చేస్తే అధికారం సొంతమవుతుందా ? కొంతకాలం క్రితం కేసీఆర్, ఇటీవల జగన్ యాగం వల్లే విజయం సాధ్యమైందా ? వారి యాగాలే యోగం తెచ్చాయా అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతుంది. ఇంతకీ యాగంతో యోగం సాధ్యమేనా ? పండితులు ఏమంటున్నారు. కేసీఆర్, జగన్ యాగాలు తెలంగాణ సీఎం కేసీఆర్ యజ్ఞ, యాగాదాలు చేస్తుంటారు. చండీ, సహస్ర, ఆయుత చండీయాగాలు కూడా చేశారు. అయితే గత డిసెంబర్లో జరిగే ఎన్నికలకు నెలరోజుల ముందు రాజశ్యామల యాగం చేశారు. ఆ తర్వాతే భారీ మెజార్టీతో విజయం సాధించి అధికారం చేపట్టారు. కేసీఆర్‌ను అనుసరించిన జగన్ విశాఖలో రాజశ్యామల యాగం చేశారు. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో బంఫర్ మెజార్టీ సాధించారు. వీరిద్దరూ యాగాలతో యోగం సిద్ధించిందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకప్పుడు యుద్ధానికి వెళ్లే సమయంలో విజయం కోసం రాజశ్యామల యాగం .. దాంతోపాటు వారాహి యాగం తప్పకుండా చేసేవారని తెలుస్తోంది. కేసీఆర్, జగన్ యాగాలు చేసినట్టు సమాజానికి తెలుసు. కానీ జగన్ పేరు మీద రాజశ్యామల యాగాలు చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. చిక్కడపల్లి, ఏపీలో చాలాచోట్ల జరిగినట్టు సమాచారం. వీరేకాక బీజేపీ నేత లక్ష్మణ్ కూడా రాజశ్యామల యాగం జరిపించారని .. అందుకే తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుచుకున్నారని తెలుస్తోంది. లేదంటే ఆ పార్టీకి ఒక్క అసెంబ్లీ స్థానం దక్కితే .. 4 ఎంపీ సీట్లు ఎలా గెలుస్తోందని వాదన వినిపిస్తోంది. ఇటు సినీనటుడు బాలకష్ణ కూడా యాగం చేశారని .. అందుకే విజయం సాధించారని సమాచారం.