17వ లోక్‌సభ రికార్డు

ఇప్పటికే 35 బిల్లులకుగాను 23 బిల్లులు పాస్‌

న్యూఢిల్లీ: కొత్తగా కొలువైన 17వ లోక్‌సభ అనేక అంశాల్లో విశిష్టతను చాటుకొంది. చట్టాల రూపకల్పన, సమయ సద్వినియోగం, నూతన ఎంపీలకు అవకాశం విషయంలో ఎగువ సభ సరికొత్త రికార్డు నెలకొల్పింది. భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం బిల్లుల ఆమోదంలో వడివడిగా అడుగులు వేస్తోంది. అటు రాజ్యసభలో ఆధిక్యం లేకపోయినప్పటికీ.. బిల్లులను గట్టెక్కించడంలో తమ రాజకీయ వ్యూహాలను పదును పెట్టి సఫలమైంది.
23 బిల్లులు పాస్‌..
ఇప్పటి వరకు మోదీ నేతత్వంలోని ఎన్డీయే సర్కార్‌ సభలో 35 బిల్లులు ప్రవేశపెట్టింది. వాటిలో ఇప్పటికే 23 బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. ఆగస్టు 7వరకు సాగనున్న సమావేశాల్లో మరికొన్నింటినీ చట్టంగా మార్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
సమయం సంపూర్ణ సద్వినియోగం..
సమయం సద్వినియోగం విషయంలో 17వ లోక్‌సభ 25ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. అవసరమైనప్పుడు మధ్యరాత్రి వరకు కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం సభ 132శాతం సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇప్పటి వరకు 250 గంటల సమయం వినియోగించుకున్నారు. దీంతో 2015 బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా 239గంటల పాటు సభ నడిచిన రికార్డు బద్దలైంది. ఈ సమావేశాలు ఆగస్టు 7వరకు కొనసాగేందుకు నిర్దేశించారు. ఆగస్టు 9 క్విట్‌ ఇండియా డేని పురస్కరించుకొని సభను మరో రెండు రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అదే జరిగితే ఒక సమావేశ కాలంలో అత్యధిక రోజులు పనిచేసిన సభగా 17ఏళ్ల రికార్డుని దాటివేయనుంది.
ఒక్క బిల్లూ స్థాయి సంఘానికి వెళ్లలేదు…
రికార్డు స్థాయిలో బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్క బిల్లును కూడా పార్లమెంటు స్థాయి సంఘాలకుగానీ, ప్రత్యేక కమిటీలకుగానీ పంపలేదు. బిల్లుల్ని ఆదరాబాదరగా ఆమోదింపజేసుకోవడంలో నిమగ్నమైన అధికారపక్షం.. వాటిపై విస్త త చర్చ, సమీక్షకు అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
స్పీకర్‌ పాత్ర ప్రశంసనీయం…
సభ ఈ స్థాయిలో రికార్డులు నెలకొల్పడంలో స్పీకర్‌ పాత్ర ప్రశంసనీయం. సభలో ఎలాంటి నిరసనలు, గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా సజావుగా నడపడంలో సఫలమయ్యారు. ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సైతం ఓం బిర్లాను కామన్‌వెల్త్‌ దేశాల్లో ఉత్తమ స్పీకర్‌గా గుర్తించాలని వ్యాఖ్యానించారంటే స్పీకర్‌ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త సభ్యులకు అవకాశం కల్పించడం కోసం, ప్రజా సమస్యల్ని లేవనెత్తడం కోసం అనేక సార్లు శూన్య గంట(జీరో అవర్‌) సమయాన్ని పెంచారు. అలాగే ఎక్కువ సమస్యలు సభలో చర్చించేలా ప్రశ్న, సమాధాన్ని వీలైనంత సూటిగా, స్పష్టంగా ఉండాలని స్పీకర్‌ సూచించడం-సభ అత్యంత సమర్థంగా నడవడానికి మరో కారణం.