ముసురెత్తిన ముంబాయి
ఎయిర్‌పోర్టు, రైల్వే ట్రాక్‌లపై చేరిన వరద నీరు: పలు రైళ్లు రద్దు
ముంబయి: గత రెండు రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రంతా కురిసిన వర్షాలకు ముంబయిలో జనజీవనం స్తంభించింది. దీంతో ఆదివారం తెల్లవారు జామున కొన్ని లోకల్ రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని ఆలస్యంగా నడపనున్నారు. రాత్రంతా కురిసిన వర్షాలకు రైలు పట్టాలపై నీరు చేరడంతో థానే నుంచి పన్వేల్ వెళ్లే రైళ్లపై ప్రభావం పడింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ముంబయిలోని వివిధ రైల్వే స్టేషన్లలో నిలిచి పోయారు. ఆదివారం మరింత వర్షపాతం దృష్ట్యా ముందస్తు చర్యగా కొన్ని రైళ్లను రద్దు చేశారు. దీంతో పాఠశాలలో ప్రయాణికులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కుర్లా, సియోన్, చూనాభతి ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల ధాటికి తిలక్ నగర్ స్టేషన్ పరిధిలోని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూలి రైలు పట్టాలపై పడటంతో పన్వేల్ వైపు వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. మరో 24 గంటల పాటు భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ తెలపడంతో ముంబయిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.పాల్ఘర్, థానే, రాయ్‌గఢ్, నాసిక్, సతారా జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఎయిర్‌పోర్ట్‌ను ముంచెత్తిన వరద నీరు..
భారీ వర్షాలతో ముంబయి ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరింది. రన్‌వేపైకి నీరు చేరడంతో లు విమాన సర్వీసుల రాకపోకలపై ప్రభావం పడింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
దేశ ఆర్థిక, వినోద రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోతతో మహానగరంలో జనజీవనం స్ధంభించింది. భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరికలకు అనుగుణంగా ఆదివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తడంతో రోడ్డు, రైలు రవాణాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. విమాన రాకపోకలకు సైతం అంతరాయం కలిగింది. నగరంలోని శాంతాక్రజ్, నగ్పడ, సియోన్ ప్రాంతాలతో పాటు థానే, పాల్ఘర్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలతో స్కూళ్లు, విద్యా సంస్ధలకు సెలవు ప్రకటించారు.
వరద నీరు పట్టాలపైకి చేరడంతో హార్బర్ లైన్, అంబర్‌నాథ్, బద్లాపూర్ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇక ముంబై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారిమళ్లించామని, పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇక వరద సహాయక చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం బీఎంసీతో కలిసి పనిచేస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.