వినికిడి లేకున్నా.. ‘విది’ని ఎదిరించింది
మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలతోపాటు ప్రపంచవ్యాప్తంగా యువతుల ప్రతిభాపాటవాలను వెలికితీయడానికి అనేక అందాల పోటీలు నిర్వహిస్తుంటారు. వాటిలో మిస్ డెఫ్ వరల్డ్ ఒకటి. బధిర యువతుల కోసం నిర్వహించే ఈ పోటీలో భారత యువతి సత్తా చాటింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన విదిశా బలియాన్ 16 దేశాల అమ్మాయులను వెనక్కి నెట్టేసి 2019 టైటిల్ కొట్టేసింది. దక్షిణాఫ్రికాలోని ఎంబోంబెలాలో నిర్వహించారీ పోటీలను. 21 ఏళ్ల విదిశ ఆ నందబాష్పాల నడుమ అందాల సుందరి కిటీరాన్ని ధరించింది. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూనే ఆమె అన్ని కేటగిరీల్లో ప్రతిభ కనబరించింది. భారత్‌కు ఆ టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. టెన్నిస్ క్రీడాకారిణి కూడా అయిన విదిశ డెఫిలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొంది. డాన్స్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్, యోగ, టెన్నిస్.. వీటన్నింటినీ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో నేర్చుకుని వినికిడి లోపాన్ని మరిచిపోయేలా చేసుకుంది. అలాగే అందాల పోటీల కోసం కష్టపడింది.
గుర్‌గావ్, నోయిడాల్లో అందాల పోటీలకు శిక్షణ తీసుకుంది. అలా విదిశా ‘మిస్ డెఫ్ వరల్డ్ ‘గా నిలిచింది.
మగువల అందానికి, అంతః సౌందర్యానికీ, ఆత్మవిశ్వాసానికి అద్దం పడతాయి అందాల పోటీలు.. ఈ పోటీల్లో నెగ్గాలంటే శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా ఉండి అందంగా ఉండాలా? అవయవలోపం ఉన్న అమ్మాయిలు అందగత్తెలు కాదా? అంటే ఎందుకు కాదు. అలాంటివారు కూడా అందాల పోటీల్లో గెలిచేందుకు పూర్తిగా అర్హులేనని నిరూపించింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన 21 సంవత్సరాల విదిశా బలియాన్. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 21 సంవత్సరాల విదిశా బలియాన్ దక్షిణాఫ్రికాలో బధిరుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన అందాల పోటీల్లో ‘మిస్ డెఫ్ వరల్డ్-2019’గా విజయం సాధించి అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ కేటగిరీలో అందాల కిరీటం నెగ్గిన తొలి భారతీయ యువతిగా చరిత్ర సష్టించింది. విదిశా పుట్టినప్పటి నుంచే బధిరురాలు. కానీ అలా ఎప్పుడూ ప్రవర్తించేది కాదు. అన్ని విషయాల్లోనూ ముందుండేది. దేన్నయినా పట్టుదలతో నేర్చుకోవడం ఈమెకు అలవాటు. అందుకే మొదట టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఎంచుకుంది కూడా. ఎంతో కష్టపడి టెన్నిస్ ఆటపై పట్టు సాధించింది. భారతదేశం తరఫున పలు అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొంది. అంతేకాదు.. ‘డెఫ్ ఒలంపిక్స్’లో అంటే బధిరులకోసం నిర్వహించే ఒలంపిక్ క్రీడల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇలా టెన్నిస్ ఆటలో కొనసాగుతున్న సమయంలో.. ఒకరోజు దురద ష్టవశాత్తు విదిశా నడుముకు గాయమైంది. దాంతో టెన్నిస్‌కు దూరంగా ఉండాలన్న వైద్యుల సలహా మేరకు ఆ ఆటకు దూరమైంది. కానీ తాను ఎంతో కష్టపడి ఎంచుకున్న కెరీర్‌కు దూరమైనందుకు మొదట్లో ఎంతో బాధపడింది విదిశా..
వినికిడి లోపమున్న విదిశా కనీసం డోర్‌బెల్ కూడా వినలేని పరిస్థితి. అలాంటి ఆమె ప్రయాణం సాఫీగా సాగలేదు. చాలామంది ఆమెను నిర్లక్ష్యం చేసి మాట్లాడేవారు. అలాంటప్పుడు బాధపడేది. కానీ ఆమె ఎంచుకున్న స్పోర్ట్స్ కెరీర్ ఆమెను ఆ బాధల నుంచి బయటపడేసేది. టెన్నిస్ ఆమె ఊపిరి. ‘డెఫ్ ఒలంపిక్స్’లో విదిశా ఐదో స్థానంలో నిలిచింది. కానీ అంతలోనే ఊహించని అలజడి. నడుముకి తీవ్రగాయం కావడంతో ఆమె ఆశలసౌధం కూలిపోయింది. ఆమెకు దిక్కుతోచలేదు. జీవితం ఒక్కసారిగా అంధకారమైనట్లు అనిపించిందట. అలాంటి గడ్డుపరిస్థితుల్లో ఆమె కుటుంబం ఆమెకు అండగా నిలిచింది.
అంతటితో తాను ఆగిపోదలచుకోలేదు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఈ క్రమంలోనే అత్యంత ఆత్మవిశ్వాసంతో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంది. అవయవలోపమున్నంత మాత్రాన వారు ఇతరులతో ఎందులోనూ తక్కువ కాదని అందరికీ నిరూపించాలనుకుంది. ప్రస్తుతం ‘ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (ఏఏఎఫ్‌టీ)’లో మోడలింగ్ స్టూడెంట్‌గా చేరింది. నెమ్మదిగా మోడలింగ్ అవకాశాలు రావడం మొదలయ్యాయి. అందం, ఫ్యాషన్ వంటి విషయాల్లో బొత్తిగా అవగాహన లేని విదిశా పోటీల్లో గెలవాలంటే చాలా విషయాలను నేర్చుకోవాలనుకుంది. దానికి ఎంతో కష్టపడాలని తెలుసు. కానీ వెనకడుగు వేయలేదు. ఎంతో శ్రద్ధతో, పట్టుదలతో ముందడుగు వేసింది. మోడలింగ్ అవకాశాలు పుంజుకుంటున్న తరుణంలో ఆమె చూపు అందాల పోటీలపై పడింది. చిన్నతనం నుంచీ ఏదైనా విషయంపై పట్టు సాధించాలంటే అందుకు ఎంత కష్టపడుతున్నాను అని కానీ, ఇంత సమయాన్ని దీనికోసం వెచ్చిస్తున్నాను అని కానీ ఎప్పుడూ చూసుకోని విదిశా.. దీని కోసం కూడా అంతే కష్టపడింది. డాన్స్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్, యోగ, టెన్నిస్.. వీటన్నింటినీ ఆత్మవిశ్వాసం పట్టుదలతో నేర్చుకుని వినికిడి లోపాన్ని మరిచిపోయేలా చేసుకుంది. అలాగే అందాల పోటీల కోసం కష్టపడింది. గుర్‌గావ్, నోయిడాల్లో అందాల పోటీలకు శిక్షణ తీసుకుంది. అలా విదిశా ‘మిస్ డెఫ్ ఇండియా’గా నిలిచింది. తరువాత మిస్ వరల్డ్ పోటీలకు సన్నద్ధం అవ్వాలి. ఈ సమయంలో ‘వీలింగ్ హ్యాపీనెస్’ అనే స్వచ్ఛంద సంస్థ వారు ఆమెకు ఎంతో సహాయం చేశారు. శిక్షణలో భాగంగా మెంటర్స్, టీచర్స్, గైడ్స్.. ఇలా ప్రతి ఒక్కరితో ఆమెను మమేకం చేసి విశ్వపోటీకి అన్ని విధాలా సన్నద్ధం అయ్యేలా తయారుచేశారు. అలా.. అదే ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ‘మిస్ డెఫ్ వరల్డ్- 2019’ పోటీల్లో పాల్గొంది విదిశా. అక్కడ ఫైనల్ రౌండ్‌లో పదకొండు మందితో పోటీపడిన విదిశా తనదైన ఆత్మవిశ్వాసంతో కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ అందాల కిరీటాన్ని దేశానికి అందించిన తొలి భారతీయ యువతిగా చరిత్రకెక్కింది ఈ యూపీ అందాలరాశి విదిశా. పోటీలో గెలిచిన అనంతరం కిరీటాన్ని తలపై అలంకరించుకున్న ఆ క్షణం తన జీవితంలోనే అత్యంత మధురమైన ఘట్టంగా అభివర్ణిస్తున్న విదిశా.. అప్పుడు తన మనసులో కలిగిన భావోద్వేగం వర్ణనాతీతం అని చెబుతోంది. అందాల కిరీటాన్ని చేజిక్కించుకుని ఇండియాకు తిరిగి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ పోటీకి సంబంధించిన కొన్ని ఫొటోల్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ మురిసిపోయింది. ఈ క్రమంలో తన మనసులోని అందమైన భావాల్ని, అనుభవాన్ని, లక్ష్యాన్ని ఓ పోస్ట్‌రూపంలో రాసుకొచ్చింది.
నా లక్ష్యం ఇదే..
‘కష్టపడి పనిచేసే తత్త్వం, సానుకూల ద క్పథం ఉంటే అనుకున్న లక్ష్యం ఎంతదూరంలో ఉన్నా సరే.. మీరు దాన్ని చేరుకుని విజయ పథంలో నడిచేలా చేస్తుంది. ఈ పోటీద్వారా నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. నేను ప్రస్తుతం మోడలింగ్ విద్యను అభ్యసిస్తోన్న ఏఏఎఫ్‌టీ నన్ను ఓ వ్యక్తిగా ఎదిగేలా చేసింది. నా ఈ విజయంతో మరింతమంది వినికిడి లోపమున్న వారిలో స్ఫూర్తి కలిగించాలనుకుంటున్నా. శారీరిక లోపమున్నా, లేకపోయినా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నేను ప్రత్యేకంగా వినికిడి లోపమున్న అమ్మాయిల్లో ఉండే ప్రతిభను వెలికి తీయాలనుకుంటున్నా. అంగవైకల్యం విజయానికి అడ్డుకాదు అని చాటిచెప్పాలనుకుంటున్నా.. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఇదే’ అని చెప్పింది విదిశా. నీ సంకల్పానికి జోహారు విదిశా..