భా.జ(పా)బలి

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రభావాన్ని తగ్గించేందుకు 
కేసీఆర్‌, జగన్‌ల ప్రణాళిక 

  • -రెండు రాష్ట్రాలలో బీజేపీ బలపడేందుకు అమిత్‌షా పథకం 
  • -ఇటు టీఆర్‌ఎస్‌, అటు వైసీపీకి ఏకకాలంలో చెక్‌ పెట్టాలనే యోచన 
  • -టీఆర్‌ఎస్‌ నేతలకు గేలం వేస్తున్న కేంద్రం 
  • ఏపీలో తెలుగుదేశం నుంచి భారీగా బీజేపీలోకి చేరికలు 
  • – బీజేపీ బలపడకుండా ఉండేందుకు కేసీఆర్‌, జగన్‌ల ప్లాన్‌ 
  • -పార్టీలో కార్యకర్తలకు ఇన్సూరెన్స్‌తో సహా సౌకర్యాలు
  • ప్రభుత్వ పథకాలలో లబ్ధిచేకూర్చే యత్నం 
  • యువతకు భారీగా రుణరూపేణా సాయం 
  • మహిళలకూ భారీగా నగదు సాయం 
  • దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ 

హైదరాబాద్‌: 
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ మధ్య గురువారం కీలక సమావేశం జరిగింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఇరువురు ముఖ్యమంత్రుల భేటీలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, సాగునీటి అంశాలతో పాటు రాజకీయపరమైన విషయాలు కూడా ప్రముఖంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై కేసీఆర్‌, జగన్‌ ఎక్కువ సేపు చర్చించారని సమాచారం. తెలంగాణతో పాటు ఏపీలో రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ… ఇందుకోసం కొద్ది రోజులుగా ముమ్మరంగా పావులు కదుపుతోంది. 
ఏపీలోని టీడీపీలోకి ముఖ్యనేతలను, కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ… అధికార పార్టీ వైసీపీపై కూడా అప్పుడే విమర్శలు మొదలుపెట్టింది. ఇటు తెలంగాణలోనూ క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఇందుకోసం స్వయంగా ఆ పార్టీ చీప్‌ అమిత్‌ షా రంగంలోకి దిగబోతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో తమకు సవాల్‌ విసురుతున్న బీజేపీని నిలువరించడం ఎలా అనే అంశంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీని అడ్డుకోకపోతే భవిష్యత్తుల్లో తమకు మరిన్ని రాజకీయ సవాళ్లు ఎదురుకావడం ఖాయమనే అభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినట్టు తెలుస్తోంది. 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ గురువారం ప్రగతి భవన్‌లో ఏకాంతంగా సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఇద్దరే మాట్లాడుకున్నారు. వారిద్దరి మధ్య అంత సుదీర్ఘంగా సాగిన చర్చ ఏమై ఉంటుంది? ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఇద్దరు నేతలూ ప్రధానంగా ఉభయ రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణ కాంక్ష గురించే మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీగా అవతరించడానికి ఆ పార్టీ దూకుడుగా తీసుకుంటున్న చర్యలు ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇద్దరూ కలిసికట్టుగా వ్యవహరించకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను అవకాశంగా చేసుకొని రెండు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డట్లు సమాచారం. 
ఇప్పటికే దూకుడుగా అన్ని పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటున్న విషయం వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతను, స్నేహగీతాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ప్రభుత్వాల నడుమ సహద్భావ వాతావరణం ఉంటే ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయానికి వచ్చారు. రాష్ట్ర విభజన సమస్యలు కొలిక్కి రావటంతో పాటు రాజకీయంగాను ఇరు పార్టీలకు ప్రయోజన కరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర విభజన సమస్యలు, నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఉమ్మడిగా కలిసి ముందుకు సాగకుంటే కేంద్రం జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని వారు అనుకున్నట్లు సమాచారం. 
ఉభయ రాష్ట్రాల సమస్యలను పరిష్కరించే పేరుతో బీజేపీ రెండు చోట్లా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయవచ్చని కేసీఆర్‌, జగన్‌ భావించారని తెలిసింది. తప్పదనుకున్న అంశాల్లో మినహా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని సమస్యలను కేంద్రం జోక్యం లేకుండానే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఇరు రాష్ట్రాల మధ్య తాజాగా నెలకొన్న సంబంధాలపై చేసిన విమర్శలను ఈ సందర్భంగా జగన్‌ ప్రస్తావించారని సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలను చూసి బాబు ఓర్వలేక పోతున్నాడని కేసీఆర్‌ వ్యాఖ్యానించారని తెలిసింది. జెరూసలెం పర్యటనకు వెళ్తున్న జగన్‌కు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. జెరూసలెం పర్యటనకు వెళ్లే ముందు గురువారం హైదరాబాద్‌కు వచ్చిన జగన్‌ మొదట తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. అనంతరం నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్‌తో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎంపీ జోగినిపల్లి సంతోషలు సాదరంగా ఆహ్వానించారు. జగన్‌ వెంట ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి, సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి ఉన్నారు. అనంతరం ఇద్దరు సీఎంలు విడిగా కూర్చొని మాట్లాడుకున్నారు. కష్ణా బేసిన్‌కు గోదావరి జలాల తరలింపు, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూలు సంస్థల విభజన, ఈ నెల 8న ఢిల్లీలో హోంశాఖ ఆధ్వర్యంలో విభజన సమస్యలపై జరగబోయే సమావేశం గురించి చర్చించారు. 
తెలుగు రాష్ట్రాల బంధం 
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి తెలంగాణతో మంచి సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ ఆలోచనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వాగతించారు. జగన్‌ దంపతులను కేసీఆర్‌ ‘ప్రగతి భవన్‌’కు ఆహ్వానించి సత్కరించారు. భౌగోళికంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు వేరైనప్పటికీ- సామాజికంగా, సాంస్క తికంగా, భాషాపరంగా ఒక్కటేననే బలమైన సంకేతాలను కేసీఆర్‌ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు పంపారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్‌ హాజరయ్యారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం, తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని సందర్శించుకుని మొక్కులు చెల్లించారు. కుటుంబ సమేతంగా కొద్ది రోజుల క్రితమే తిరుమలను సందర్శించి పూజలు నిర్వహించారు. భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, ఆగమశాస్త్రానికి అనుగుణంగా నిర్మిస్తున్న దైవభక్తి పరాయణుడు కేసీఆర్‌. 
నదీజలాల సద్వినియోగం కావాలన్న ఆకాంక్ష కేసీఆర్‌కు ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రను విశ్లేషిస్తే నదీ జలాల లెక్కలను తడుముకోకుండా చెప్పడంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి దిట్ట. ఆ తర్వాత అంతటి పట్టు సాధించిన నేత కేసీఆర్‌. దేశంలోని అన్ని నదుల నుంచి 70 వేల టీఎంసీ జలాలు సముద్రంలో వ థాగా కలుస్తున్నాయని, వీటిని మళ్లించి బీడువారిన భూములను సస్యశ్యామలం చేయాలనే కోరిక కేసీఆర్‌కు ఉంది. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ జెండా, అజెండాలను పక్కనపెట్టి రైతు బంధు స్కీం మాదిరిగానే నదీ జలాల వినియోగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సలహాలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. నదీజలాల వినియోగంపై కేసీఆర్‌ చేసిన కసరత్తు ప్రపంచ స్థాయి నీటిపారుదల నిపుణులు కూడా చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు. 
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని వివాదాలు ఉండవచ్చు. అధికారంలో ఉన్న నేతలు సుహద్భావ వాతావరణంలో తరచుగా సమావేశమైతే అవన్నీ సులువుగా పరిష్కారమవుతాయి. ఈ దిశగా వచ్చే ఐదేళ్లు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం అడుగులు వేస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా రావాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కేసీఆర్‌ పదేపదే చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. కాని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సంక్షేమం, అభివ ద్ధికి వెచ్చించేలా ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిసి పయనిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. లి 
జగన్‌కు జేజేలు… 
నవ్యాంధ్ర అవతరించాక రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మే 30న విజయవాడలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రమాణస్వీకారం చేశారు. వైకాపాకు ఇది చరిత్రాత్మక విజయం. అలుపెరుగని పోరాట యోధుడిగా జగన్‌ నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజారంజక పాలన అందించి, కాంగ్రెస్‌ పార్టీకి పునర్జన్మ ఇచ్చిన ఘనత దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచేందుకు, కేంద్రంలో కాంగ్రెస్‌ సారథ్యంలో యూపీఏ సర్కార్‌ ఏర్పడేందుకు తన శక్తియుక్తులను అందించిన ధీశాలి, రాజనీతిజ్ఞుడు వైఎస్‌. 1956 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ముగ్గురు నేతలు ఎన్టీ రామారావు, వైఎస్‌ఆర్‌, చంద్రబాబు నాయుడు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు, ఆరోగ్య బీమా, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో నడిపించిన పాలనాదక్షుడు వైఎస్‌ఆర్‌. 
వైఎస్‌ రాజశేఖర రెడ్డి, విజయమ్మ దంపతుల కుమారుడైన వైఎస్‌ జగన్‌ తొమ్మిదేళ్ల సుదీర్ఘ రాజకీయ పోరాటాల్లో పదునెక్కారు. తాను అనుకున్నది సాధించేందుకు ఓపికతో, ఆత్మవిశ్వాసంతో నిరీక్షించారు. అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులు, రాజకీయ శత్రువుల కుట్రలను ఎదిరించి ప్రజాబలంతో అఖండ మెజారిటీతో బలమైన నేతగా ఆయన ఎదిగారు. 1972 డిసెంబర్‌ 21న కడప జిల్లాలో జన్మించిన జగన్‌ పాఠశాల విద్యను పులివెందులలో, హైస్కూలు, ఆ తర్వాత ఉన్నత విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఇంగ్లాండ్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సును అభ్యసించారు. ఆయన ఆంగ్లం, తెలుగు భాషల్లో మంచివక్త. తన తండ్రి వైఎస్‌ఆర్‌ మాదిరిగా తన భావాలను అందరితో పంచుకోరు. జగన్‌ అంతర్ముఖుడు. కాని తండ్రి మాదిరిగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు దేనికైనా తెగిస్తారు. 2009 ఎన్నికల్లో కడప నుంచి గెలిచి తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్‌ రెడ్డిపై కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన నేతలు అవినీతి అభియోగాలు మోపడం, సీబీఐ విచారణ ఫలితంగా 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. పిన్న వయస్సులో జగన్‌ మాదిరి మరెవరూ ఇంత విపత్కరమైన పరిణామాలను, మానసిక వేదనను అనుభవించి ఉండరు. తన తండ్రి వైఎస్‌ఆర్‌ పేరును జనం గుర్తుచేసుకునేలా ‘వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ’ని స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక పాలనపై ఆయన పోరాడారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైకాపా అధికారానికి చేరువ కాలేకపోయింది. ఆ ఎన్నికల్లో జగన్‌ పార్టీకి 67 సీట్లు వచ్చాయి. అసెంబ్లీ లోపల, వెలుపల ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను లెక్కపెట్టకుండా అకుంఠిత దీక్షతో, ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో 3వేల కి.మీ మేరకు ప్రజాసంకల్ప యాత్ర చేశారు. జగన్‌కు కుటుంబ అనుబంధం ఎక్కువ. తల్లి విజయమ్మ, భార్య భారతీదేవీ, సోదరి షర్మిల అండదండలతో, రాజకీయంగా వడివడిగా అడుగులు వేసి, ప్రజాశీస్సులతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.