విభజన సమస్యలపై మరో ముందడుగు

ఇరు రాష్ట్రాల సంబంధాల బలోపేతానికి పునాది 
సిఎంల భేటీతో సమస్యలపై మరింత స్పష్టత 
హైదరాబాద్‌,ఆగస్ట్‌2-: విభజన సమస్యలపై ఇద్దరు సిఎంలు వ్వయహరిస్తున్న తీరు ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాల బలోపేతానికి పునాది కానున్నాయి. ఎపిలో వైకాపా అధినేత జగన్‌ సిఎం అయిన నాటి 
నుంచి కెసిఆర్‌ అనేక విషయాల్లో స్నేహహస్తం సాచారు. సమస్యలను ఇరువురి మధ్యనే పరిస్కరించుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ గురువారం ప్రగతి భవన్‌లో ఏకాంతంగా సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఇద్దరే మాట్లాడుకున్నారు. వారిద్దరి మధ్య అంత సుదీర్ఘంగా సాగిన చర్చలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినా ప్రధానంగా ఇరు రాష్ట్రాల్లోని సమస్యలే ఎజెండా అయివుంటాయి. ముఖ్యంగా ఇద్దరూ కలిసికట్టుగా వ్యవహరించకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయన్న భావన ఏర్పడిందని తెలుస్తోంది. ఈ వ్వయహారంపై ఇరు రాష్ట్రాల్లో నూ సానుకూలత వ్యక్తం అవుతోంది. రాజకీయ పరిశీలకలుఉ కూడా అభినందిస్తున్నారు. ఇరుగు పొరుగు సఖ్యతగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్ల మంచి వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతను, స్నేహగీతాన్ని కొనసాగించాలని నిర్ణయించడం వల్ల సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రభుత్వాల నడుమ సహృద్భావ వాతావరణం ఉంటే రాష్ట్ర విభజన సమస్యలు కొలిక్కి రావటంతో పాటు రాజకీయంగాను ఇరు పార్టీలకు ప్రయోజన కరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర విభజన సమస్యలు, నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఉమ్మడిగా కలిసి ముందుకు సాగడంతో సమస్యలను దూరం చేయాలన్న భావనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.అన్ని సమస్యలను కేంద్రం జోక్యం లేకుండానే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. ఇక నదీజలాల విషయంలో గోదావరి వృధానీటిని ముందునుంచి సద్వినియోగం చేసుకోవాలన్న వాంచ బలపడింది. ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత వరంగల్‌ జిల్లాలోని రాంపూర్‌ వద్ద నీటి లభ్యత ఎక్కువగా ఉందని, ఇక్కడి నుంచి నీటిని తరలించుకుందామని కేసీఆర్‌ సూచించినట్లు సమాచారం. కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.70-80 వేల కోట్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చారు.ఈ అంచనాలతో ప్రాజెక్టును ప్రారంభించి, తర్వాత అంచనా వ్యయాలను పెంచుకోవచ్చని, అప్పటి పరిస్థితులకనుగుణంగా నిర్ణయం తీసుకుందామని అనుకున్నారని సమాచారం. ఇందుకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య విభజన సమస్యలన్నింటిని పరిష్కరించుకునే దిశగా ఈనెల మూడో వారంలో మరోసారి ముఖ్య మంత్రుల స్థాయి సమావేశం జరగనుంది. విభజన అంశాల పరిష్కారానికి ముందడుగు పడిందని, వీటిని సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించినట్లు తెలిసింది.
గోదావరి జలాల వినియోగం, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై దాదాపు గంట సేపు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అర్థవంతమైన చర్చ జరిగిందని సమాచారం.