వైకల్యాన్ని మించిన పోరాటపటిమ

రాజకీయాల్లో బహు అరుదైన వ్యక్తిత్వం 
తెలంగాణ ఏర్పాటులో అంకితభావంతో కృషి 
రాజకీయ దురంధరుడిగా జైపాల్‌ రెడ్డి చిరస్మరణీయుడు 
హైదరాబాద్‌,జూలై29: తనకు అంగవైకల్యం ఉందన్న విషయాన్ని ఏనాడూ పట్టించుకోని రాజకీయ దురంధురుడు దివంగత జైపాల్‌రెడ్డి. ఆయన జీవితంలో ఎన్నో ఉత్థానపతనాలను చూసినా ధృడచిత్తంతో ముందుకు సాగిన రాజకీయవేత్త ఆయన. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన జైపాల్‌ రెడ్డి పదవుల కోసం ఏనాడూ పాకలాడని అరుదైన వ్యక్తి. రాజకీయాల్లో ఏ మాత్రం అవకాశం ఉన్నా డబ్బు సంపాదించడానికే పాటు పడే వారికి జైపాల్‌ రెడ్డి జీఅవితం ఓ చెంపపెట్టులాంటి సందేశంగా కాగలదు. రాజకీయాల్లో నిబద్దంగా ఉండాలంటే జైపాల్‌ రెడ్డి జీవితం చదవాల్సిందే. వైకల్యం తన మనసుకు లేదని నిరూపించుకోవడం కూడా బహు అరుదైన విసయంగా చూడాలి. ఇంగ్లిషులో ఆయన అనర్గళంగా మాట్లాడడం చూస్తుంటే దానికోసం ఆయన ఎంతగా పట్టుబట్టారో తెలుసుకోవాలి. ఇంగ్లిషు పండితులను సైతం అచ్చెరువొందేలా చేయగలిగే పాండిత్యం ఆయనది. రాజకీయ నాయకుడిగా అందరికీ ఆమోద యోగ్యుడు అనిపించుకునే అజాతశత్రుత్వం ఆయనకు మాత్రమే సొంతం. చట్టసభల్లో ఎలా నడుచుకోవాలనే విషయంలో ప్రజాప్రతినిధులకు ఆయన మార్గదర్శకుడనడంలో సందేహం లేదు. ఆయన చూపిన మార్గం 
నేటి యువతరం రాజకీయవేత్తలకు పాఠం కావాలి. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందు కున్నారు. అప్పటికి.. దక్షిణాది నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఎంపీ ఆయనే. తన పోరాట పటిమ, వాక్చాతుర్యం, మేథాశక్తి ద్వారా అంచెలంచెలుగా ఎదిగిన జైపాల్‌రెడ్డి.. కేంద్రంలో ఎన్నో కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలో జన్మించి.. విద్యార్థి దశనుంచే రాజకీయ లక్షణాలను పుణికిపుచ్చుకొని.. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయి నాయకుడిగా వెలుగొందడం జైపాల్‌రెడ్డికి మాత్రమే సాధ్యం అయ్యింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మాడ్గుల మండల కేంద్రంలో 1942 జనవరి 16న దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు తొలి సంతానంగా జైపాల్‌రెడ్డి జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లిష్‌ పట్టాపుచ్చుకున్నాక,. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, జర్నలిజంలో డిగ్రీచేశారు. 1963-65లో ఓయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా గెలుపొందారు. 1965-71 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, 1969 నుంచి 72 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఓయూలో రాజకీయజీవితానికి బీజం పడితే కల్వకుర్తి నుంచి తొలి ప్రస్థానం మొదలైంది. ఈ నియోజకవర్గం నుంచి తొలిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1969లో, ఆ తర్వాత వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 1969-84 మధ్యకాలంలో అసెంబ్లీలో తన వాణిని వినిపించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ను వీడి జనతా పార్టీలో చేరారు. 1980లో కేంద్ర రాజకీయాలపై దృష్టిసారించారు. 1980లో మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఇందిరా గాంధీపై పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1984లో ఎంపీగా తొలిసారి మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి జనతా పార్టీ తరఫున గెలుపొందారు. 1998లో తిరిగి ఆ పార్టీ తరఫున.. అదే స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 1999లో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. 1999లో, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలిచారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరపున చేవెళ్ల నుంచి విజయం సాధించారు. మొత్తంగా ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఆయన సభలో తన వాణిని సమర్థంగా వినిపించారు. 1990 నుంచి 1998 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభలో విపక్ష నేతగా పనిచేశారు. వీపీసింగ్‌, ఐకే గుజ్రాల్‌, మన్మోహన్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారా శాఖ, కేంద్రపట్టణాభివృద్ధి శాఖ, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా సేవలందించారు.జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన రాజ నీతిజ్ఞుడు, రాజకీయాలకు అతీతంగా అందరి స్నేహాన్ని చూరగొన్న అజాత శత్రువు, బహుభాషా కోవిదుడు, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కీర్తి గడించిన నేతగా పేరొందారు. దేశ రాజకీయ యవనికపై తనదైన ముద్రను చిరస్థాయిగా వేసిన రాజకీయ దురంధరుడాయన. తన అపార మేధస్సుతో, బహుభాషా పాండిత్యంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు. శారీరక వైకల్యాన్ని అధిగమించి.. మానసిక చైతన్యంతో జాతీయ రాజకీయాల్లో రాణించిన రాజనీతిజ్ఞుడుగా బహుఅరుదైన ప్రజ్ఞను సంపాదించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన జైపాల్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములు అయ్యారు.