అమాంతం పెరిగిన “టమాటా” ధరలు కిలో 50రూపాయలకు చేరిన రేటు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి

హైదరాబాద్‌,జూలై26 : టమాటాలు ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్లో ఇప్పుడు కిలో టమాటా 50 రూపాయలుగా అమ్ముతున్నారు. టమాటాల దిగుబడి తగ్గిందని వ్యాపారులు అంటున్నారు.
ఎండల తాకిడికి టమాట పంట తీవ్రంగా దెబ్బతిన్నది. రైతులు వేసిన పంటలు సరిగా పూతకు రాకపోవడంతో టమాట పంట దిగుబడి పడిపోయింది.దీంతో టమాటను, పచ్చి మిర్చిని చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నుంచి దుగుమతి చేసుకుంటున్నారు. అలాగే ఉల్లిపాయల ధరలు కూడా కన్నీరు పెట్టిస్తున్నారు. మేలరకం ఉల్లిగడ్డలను కిలో 28 నుంచి 30 వరకు అమ్ముతున్నారు. తెల్ల ఉల్లిగడ్డ అయితే 30 నుంచి 40 వరకు అమ్ముతున్నారు. వర్షాలు ముఖం చాటేయడం, ఇంకా ఎండలు కొనసాగుతుండడంతో కూరగాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్‌లో ఏ కూరగాయనూ కొనేట్టు లేదని గృహిణులు వాపోతున్నారు. రూ. 20 కూడా పలకని వంకాయలు ప్రస్తుతం 60 రూపాయలకు పెరగగింది. బీన్స్‌ ధరలు
300 దాకా వెళ్లాయి. గతానికి భిన్నంగా జిల్లాల్లో కూరగాయల సాగు కూడా గణనీయంగానే పెరిగిపోయింది. పొరుగు జిల్లాల నుంచి కూరగాయల తెచ్చుకోకుండా రైతులు స్థానికంగా కూరగాయలు పండిస్తున్నా ధరలు మాత్రం సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. కూరగాయల ధరలు పెరగడంతో ఆకు కూరలతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి ధరలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ఏ రకం ఆకు కూర కావాలన్నా రూ.20 ప్రెట్టాల్సిందే. కొత్తిమిర, పాలకూర అసలు నాణ్యమైనది దొరకని పరిస్థితి వచ్చింది. రూ. 10కి రెండునుంచి పాలకూర కట్టలు రాగా ఇప్పుడు రూ. 20 రూపాయలు పెట్టినా 5 కట్టలే ఇస్తున్నారు. గత రెండు నెలలుగాధరలు ఇదే స్థాయిలో ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ధరలు సామాన్యులను కలవర పెడు తున్నాయి. కిలో కూరగాయలు కొందామని వచ్చిన వినియోగదారులు పావు కిలోతో సరి పుచ్చుకునే పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. అన్ని కూరల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకు దిగుబడులు తగ్గి ధరలు మండిపోతున్నాయి. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు, వేసవి ఎండల దెబ్బకు కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. వీటిని సాగుచేసిన ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోవడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. దేశ్యాప్తంగా అన్ని కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కూరగాయలతో పాటు ఆకు కూరలది అదే పరిస్థితి. ఒక్క ఆలుగడ్డ తప్ప అన్నింటి ధరలు రెట్టింపు కావడంతో వినియోదారులు లబోదిబో ముంటున్నారు. ఆయా ప్రాంతాలలో వేసిన కూరగాయల తోటలు ఎండల దాటికి వట్టి పోవడం, కొన్ని చోట్ల బోర్లు ఎండిపోవడం లాంటి సమస్యలు రైతన్నలను వెంటాడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వ్యవసాయాధికారుల ప్రోత్సాహంతో కూరగాయల సాగు విస్తీర్ణం భారీగానే పెరిగిపోయింది. అయితే పంట మాత్రం రైతుల చేతికి పూర్తి స్థాయిలో రాలేదు. గత ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడం, ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. అన్ని ప్రాంతాలలో కూరగాయల సాగు ఎక్కువగా చేస్తున్నారు. టమాట, బీరకాయ, దొండకాయ, కాకర, గోకర, పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ, దోసకాయ, సొరకాయ, ఆకు కూరలు పంటలు వేసినా రైతులకు అక్కరకు రాకపోవడంతో ధరలు మిన్నంటాయని చెప్పొచ్చు.