అప్పుల పాల్చేసి నిర్మాణాలా?

ఆ అవసరంఇప్పుడేమొచ్చింది
ప్రజల సమస్యలను పక్కకుపెట్టడం దారుణం
మండిపడ్డ అఖిలపక్ష నేతలు
హైదరాబాద్‌,జూలై25: అప్పులపాలైన రాష్ట్రంలో ప్రజల అవసరాలకు నిధులను ఖర్చుచేయాలి కానీ.. విలాసాలకు కాదని ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఉన్నవి కూల్చు..కొత్తవి కట్టు అన్నదే ప్రభుత్వ విధానంగా మారడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పుడు ఉన్న భవనాలను కూల్చాల్సిన అవసరం ఏవిూ లేదన్నారు. ఈ పోరాటాన్ని ప్రజల కోసం మరింత పెద్దది చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ లో జి.వెంకటస్వామి ఫౌండేషన్‌,. ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్‌ నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో ప్రధాన పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగ ఆమాట్లాడిన కోదండరామ్‌ సచివాలయ, అసెంబ్లీల నిర్మాణం అవసరం లేదన్నారు. ప్రజల అవసరాలు తీర్చే పనులుచేయకుండా నిధుల దుర్వినియోగంపై దృష్టి పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా నిరసన చేసే అవకాశం లేకుండా పోయిందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. పర్మిషన్‌ ఇచ్చి అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. అఖిలపక్షాన్ని ఒప్పించి కట్టే దమ్ము కేసీఆర్‌కు లేదా అని ఆయన ప్రశ్నించారు. రాజాప్రసాదాలు తన సొంత డబ్బులతో కట్టుకోవాలన్నారు. కొత్త సెక్రటేరియట్‌, అసెంబ్లీ కట్టడం వలన ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు మళ్ళీ ఉద్యమం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు ఫ్రొఫెసర్‌ పి.ఎల్‌ విశ్వేశ్వర్‌ రావు అన్నారు. కొత్త నిర్మాణాల పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారన్నారు. మేనిఫెస్టోలోని హావిూలను అమలు చేయాలన్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని ఫ్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌ రావు అన్నారు. జనం కోసం ప్రజా ధనాన్ని వినియోగించాలన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌
రెడ్డి. ఎవరు అడిగారని కొత్త సెక్రటేరియట్‌, కొత్త అసెంబ్లీ కడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర ఉండకూడదనే కేసీఆర్‌ ఇవన్నీ చేస్తున్నారన్నారు. ముందు సంక్షేమ పథకాలకు నిధులు రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ అబద్దాలతోనే పుట్టాడని మాజీ మంత్రి ప్రసాద్‌ రావు విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేసీఆర్‌ పాలన ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని,కేసీఆర్‌ను గ్దదె దించేందుకు సామాజిక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామిక తెలంగాన ఆధ్వర్యంలో చేసే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. కేసీఆర్‌ తుగ్లక్‌ లాగా పాలిస్తున్నాడని పీఓడబ్ల్యూ సభ్యురాలు సంధ్య అన్నారు. ప్రజలు ఎవరు కేసీఆర్‌ను ఆమోదించడం లేదనీ.. ప్రజా ఆమోదం కొలిచే కొలమానం ఉంటే జనాల దగ్గరకి వెళ్లి అడగాలని సూచించారు.