పైకి డప్పు…లోన అప్పు

బంగారు తెలంగాణకు రూ.1,80,239 కోట్లకు చేరిన అప్పులు 

  • -అంతకంతకూ పెరిగిపోతున్న రుణాలు 
  • -పైకి షేర్వాణి లోన పరేషాని 
  • -సంక్షేమ పథకాలకే రూ.42 వేల కోట్లు 
  • -ఖర్చులు ఫుల్‌..నిధులు నిల్‌ 
  • -చిన్న బిల్లులు కూడా పెండింగే.. 
  • -ప్రమాద ఘంటికలు మోగిస్తున్న రాష్ట్ర ఖజానా 
  • -రిక్తహస్తం చూపిస్తున్న కేంద్రం 
  • -పన్నులు భారీగా పెంచబోతున్న సర్కారు 
  • -భారంగా మారిన సబ్సిడీ పథకాలు 
  • -సమైక్య రాష్ట్రంలో అప్పు రూ.1,66,000 కోట్లు 
  • -అందులో తెలంగాణ వాటా రూ.61,711 కోట్లు 

హైదరాబాద్‌: 
”సంక్షేమంలో దేశంలోనే మనమే నంబర్‌ వన్‌ ప్రజలు కోరని కార్యక్రమాలు కూడా చేపడ్తున్నం. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి వంటి కార్యక్రమాలను ఏ ప్రజలూ నన్ను అడగలె. ఎవలు ధర్నాల్జెయ్యలె. ఏనాడూ ఏ ప్రభుత్వంకూడా బీడీ కార్మికులను ఆదుకోవాలనే ఆలోచన జేయలేదు. ఈరోజు ఆలోచన చేసి.. వారిని ఆదుకుంటున్నాం! 200 పెన్షన్లను వెయ్యిరూపాయలకు తీస్కొని పోయినం. సంతోషంగ ఉన్నరు! అత్తల్ని ఎల్లగొట్టే కోడళ్లు మళ్ల అత్తల్ని తెచ్చుకుంటున్నరు.. ముసల్దానికి పైసలొత్తయని! మా పేద తల్లులు వాళ్ల కళ్లల్లో ఆనందం ఉన్నది. మా బీడీ కార్మిక చెల్లెళ్లు.. అక్కల కళ్లల్లో ఆనందం ఉన్నది. వికలాంగులైన బిడ్డలకు ఐదు వందలకు మించి ఏ గవర్నమెంటూ ఇయ్యలే. మన గవర్నమెంటు 1500 పెన్షనిచ్చి ఆదుకుంటున్నది. ప్రజా సంక్షేమ రంగంలో పేద ప్రజలకు మేలు చేసే సబ్సిడీ ఖర్చు పెట్టే రాష్టాల్లో మనమే నంబర్‌వన్‌. దేశంలోనే సంక్షేమానికి అత్యధికంగా 42 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం” సరిగ్గా ఈ మాటలు అన్నది ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఒకానొక ప్రజాసదస్సులో తూ.చ.చెప్పిన మాటలివి. అంతా బాగానే ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రానికీ లేని అప్పులు కూడా ఉన్నాయన్నది వాస్తవం. 
తాజా లెక్కల పరాక్రమ తెలంగాణ రాష్ట్రం అప్పులు భారీగా పెరిగాయి. తెలంగాణ అప్పుల వివరాలను కేంద్రం వెల్లడించింది. 2019 మార్చి నెలాఖరు నాటికి అప్పులు 159 శాతం పెరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ ప్రకటన. రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం రాష్ట్రం ఏర్పడేనాటికి (జూన్‌ 2, 2014) రాష్ట్రంపై రూ. 69వేల 517 కోట్ల అప్పులు ఉండగా. 2019 మార్చి చివరినాటికి అవి లక్షా 80వేల 239 కోట్ల రూపాయలకు చేరాయని వివరించారు. 
రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదంటూ రాష్ట్ర స్టేషనరీ, ప్రింటింగ్‌, స్టోర్స్‌ కమిషనర్‌ వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషనరీ, ప్రింటింగ్‌, స్టోర్స్‌ శాఖకు రూ.50 కోట్లు అప్పు ఉందని తెలిపారు. రూ.2 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందన్నారు. స్టేషనరి డిపార్ట్‌మెంట్‌లో కమిషనర్‌గా ఉంటూనే తాను సాంఘిక ఉద్యమం చేపడుతానన్నారు. ప్రస్తుతం ఈ శాఖలో తనకు పనేమీ లేదని.. దీన్ని పూర్తిగా మూసేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. ఇలా చూసుకుంటే దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలలోనూ 
రాబడి తక్కువ..ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
ఒక పక్క తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతూనే ఇన్ని కోట్ల రూపాయిలలో అప్పు వుండటం చర్చనీయంశమైయింది. అయితే దీనిపై కేసీఆర్‌ సర్కార్‌ వాదన మరోలా వుంది. అప్పు తీసుకొని విద్యుత్‌, నీటిపారుదల ప్రాజెక్ట్లు నిర్మించామని, దాని ద్వార వచ్చే ఆదాయం అప్పులతో బ్యాలన్స్‌ అవుతాయని చెబుతుంది కేసీఆర్‌ సర్కార్‌. అయితే ఇందులో ఆదాయం ఎంత వచ్చే అవకాశం వుందనే వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఈ విషయంలో శ్వేత పత్రం విడుదల చేస్తే జనాల్లో వున్న అనుమానాలు తొలుగుతాయనే అభిప్రాయం వెల్లడౌతుంది. 
బంగారు తెలంగాణ నిర్మించాలంటే కోట్ల నిధులు కావాలి. అందుకు అప్పు చేయాలి. ఆ అప్పుకు వడ్డీ కట్టేందుకు మళ్లీ అప్పు చేయాలి. అప్పుతోనే అభివద్ధి సాధ్యమని గత పాలకులు భావించిన రీతిలోనే, దారిలోనే తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులే నిదర్శనం. 
రాష్ట్ర విభజన నాటికి సమైక్య రాష్ట్రం మొత్తం రుణభారం ఒక లక్షా 66 వేల కోట్లు. అందులో 18 వేల కోట్ల రూపాయల అప్పు మీద వివాదాలు ఉన్నాయి. రూ. 1,48,060 కోట్ల అప్పును రెండు రాష్ట్రలు పంచుకోగా అందులో తెలంగాణ వాటాగా రూ.61,711 కోట్ల అప్పు మిగిలింది. 
ఇది తీర్చకుండానే తెలంగాణ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ నాటికి రూ.22,134 కోట్లు అప్పు చేసింది, రెండో బడ్జెట్‌ నాటికి రూ.38,996 కోట్లు, మూడో బడ్జెట్‌ నాటికి రూ.62,110 కోట్లుకు అప్పు పెరిగింది. అంటే మూడు సంవత్సరాలు నిండకుండానే తెలంగాణ అప్పు రెట్టింపు అయిందని తెలుస్తోంది. నాలుగో సంవత్సరం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అప్పట్లో ఓ ప్రకటన చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం మొత్తం అప్పు రూ.1,40,523కోట్లు ఉందని వెల్లడించారు. దీనికి అదనంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇతర మార్గాల ద్వారా రూ.26,400 కోట్లను రుణంగా తీసుకోనున్నట్లు తెలిపారు. 
అంటే మూడున్నరేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వ అప్పులు 22, 134 కోట్ల నుంచి 1,40,523 కోట్లుకు రికార్డు స్థాయిలో పెరిగాయని అర్థం చేసుకోవచ్చు. 
తెలంగాణా రాష్ట్రం ధనిక రాష్ట్రం అది ఒకప్పుడు..కానీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం అప్పుల రాష్ట్రం. మనది ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ ఇన్నీ కావు. ఇక సీఎం కేసీఆర్‌ ఉద్యోగస్తులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. రిటైర్‌ అయిన తర్వాత వారికి ఇవ్వాల్సిన అన్ని బెనిఫిట్స్‌ ఒకే సారి ఇచ్చేసి కారులో దర్జాగా ఇంటికి పంపిస్తామని చెప్పిన సీఎం మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఒకానొక దశలో తెలంగాణా ఖజానా ఖాళీ అయింది. కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. రిటైర్‌ అయిన ఉద్యోగులు నెలల తరబడి తమ బెనిఫిట్స్‌ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 104 సర్వీసు ఉద్యోగస్తులకు నాలుగు నెలలుగా జీతాల్లేని పరిస్థితి. భగీరథ రుణాలను తిరిగి చెల్లించే ప్రక్రియ ఈ ఏప్రిల్‌ నుంచి స్టార్ట్‌ కావాల్సి ఉన్నా అవి చెల్లించలేని దుస్థితి . ఖర్చుల మీద ఖర్చులు చేస్తూ, ఒక లెక్కా పత్రం లేకుండా నిధులను ఇష్టారాజ్యంగా వాడేసిన ఫలితం ఇప్పుడు తెలంగాణా ఖజానా ఖాళీ అయ్యింది. కొత్త అప్పు తెస్తే కానీ బండిని నడపలేని పరిస్థితి తెలంగాణలో ప్రస్తుతం వుందని తాజా పరిస్థితులు చెప్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా చిన్న చిన్న బిల్లులను సైతం చెల్లించలేని దయనీయ స్థితి నెలకొన్నాఆర్థిక శాఖ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది తప్ప చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తామనే భరోసా మాత్రం కల్పించలేకపోతుంది. 
ఆవగింజంత ఆదాయం.. కొండంత వ్యయం … అనాలోచిత నిర్ణయాల పర్యవసానం 
కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం పడిందని చెప్పక తప్పదు. తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కి కూడావేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఆదాయం అనుకున్నంతగా లేదు కానీ వ్యయం మాత్రం కొండంత ఉంది. అనాలోచిత నిర్ణయాలు, పక్కా ప్రణాళికా బద్దంగా వ్యవహరించకపోవటం, ఇష్టారాజ్యంగా సంక్షేమ పథకాలను ప్రకటించటం వంటి అనేక అంశాల వల్ల ఆర్ధిక పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో చిన్న చిన్న బిల్లుల చెల్లింపునకు సైతం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న పరిస్థితి తెలంగాణా రాష్ట్రంలో నెలకొంది. దీంతో.. పనులు చేసిన కాంట్రాక్టర్లు , జీతాలు ఆపిన వివిధ శాఖల చిరు ఉద్యోగులు కుదేలవుతున్నారు. సంపన్న తెలంగాణ అని చెప్పుకున్న కేసీఆర్‌.. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎవరూ ఊహించనంతగా దిగజార్చారు. అసలు ఆదాయానికి, ఖర్చుకు ఒక అంచనా లేని ప్రభుత్వం .. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నా ఏం లాభం… 
ప్రతి నెలా తక్కువలో తక్కువ రూ.4వేల కోట్ల ఖర్చు తెలంగాణా రాష్ట్రంలో అవుతుంటే ఏడాదికి రూ.48వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం తమ పని తాము చేసేందుకు అయ్యే ఖర్చు. ఇక ప్రజలకు అందించే అభివ ద్ధి కార్యక్రమాలతో పాటు.. ప్రాజెక్టుల నిర్మాణం.. పనులు చేయటంలాంటి వాటికి అదనపు ఖర్చు. మరింత భారీగా ఖర్చు ఉన్నప్పుడు ఆదాయ వనరుల విషయం అటుంచి ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అర్ధం అయినా చెయ్యగలిగేది ఏది లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు . 
అన్ని శాఖల్లో పెండింగ్‌ లో ఉన్న బిల్లుల మొత్తం రూ.22400 కోట్లు.. అప్పుల ఊబిలో తెలంగాణా ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో పెండింగ్‌ లో ఉన్న బిల్లుల మొత్తం రూ.22400 కోట్ల వరకు ఉన్నాయని చెబుతున్నారు. వీటిల్లో సాగునీటి బిల్లులే రూ.10వేల కోట్ల వరకూ ఉందని సమాచారం . వస్తున్న ఆదాయం అంతంతమాత్రంగా ఉండటం.. ఖర్చు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. తెలంగాణా రాష్ట్రం మిగులు బడ్జెట్‌ రాష్ట్రం కాదు లోటు బడ్జెట్‌ రాష్ట్రం అని చెప్తూ అప్పుల దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తూ అప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. ఇక ఇప్పటికైనా తెలంగాణా సర్కార్‌ కళ్లు తెరవకుంటే.. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత హీన స్థితికి చేరుకుంటుందని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.