ట్రంప్‌ వ్యాఖ్యలపై..

  • ప్రధాని వివరణ ఇవ్వాల్సిందే 
  • – లోక్‌సభలో పట్టుపట్టిన కాంగ్రెస్‌ సభ్యులు
  •  – కశ్మీర్‌ సమస్యపై ఎవరి మధ్యవర్తిత్వం ఉండదు
  •  – స్పష్టం చేసిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 
  • – సభనుంచి వాకౌట్‌ చేసిన కాంగ్రెస్‌ 

హైదరాబాద్‌, జులై24: కశ్మీర్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభ మరోసారి దద్దరిల్లింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ ఈ అంశాన్ని లేవనెత్తింది. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేసింది. ఇతర విపక్ష పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తూ ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ విషయంలో మోదీ మౌనంగా ఉండటం సరికాదని విమర్శించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ దీనిపై సమాధానం చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. మోదీనే నేరుగా మాట్లాడాలని పట్టుబట్టాయి. అనంతరం కేంద్రం తీరును నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కశ్మీర్‌ వివాదంపై స్పందించారు. కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం ప్రశ్నే లేదని, మోదీ-ట్రంప్‌ భేటీలో ఆ విషయం చర్చకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ‘భారత ఆత్మగౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. కశ్మీర్‌ విషయంలో విదేశాంగమంత్రి జయ్‌శంకర్‌ చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే ఒసాకాలో మోదీ-ట్రంప్‌ 
భేటీ జరిగినప్పుడు ఆయన కూడా ఉన్నారు. కశ్మీర్‌ విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం. ఇది మన గౌరవానికి సంబంధించిన విషయం. అంతేగాక మధ్యవర్తిత్వం అనేది శిమ్లా ఒప్పందానికి విరుద్ధమని రాజ్‌నాథ్‌ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తో ట్రంప్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం చేయాలని మోదీ తనను కోరినట్లు ట్రంప్‌ చెప్పారు. దీంతో గత రెండు రోజులుగా పార్లమెంట్‌లో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ట్రంప్‌, మోదీ మధ్య ఏం చర్చ జరిగిందో అన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, పార్లమెంట్‌కు మోదీ వచ్చి వివరణ ఇవ్వాలని అధిర్‌ రంజన్‌ డిమాండ్‌ చేశారు.