అమిత్ షాతో.. మాజీ ఎంపీ వివేక్ భేటీ
- – సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని వినతి
- – త్వరలో బీజేపీలో చేరనున్న వివేక్?
న్యూఢిల్లీ, జులై23: తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ¬ం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా పాలన సాగిస్తుందని, ప్రతిపక్షాలన్నీ, ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా సచివాలయాన్ని కూల్చివేయాలని చూస్తున్నారని వివేక్ అన్నారు. సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని అమిత్ షాను ఆయన కోరారు. కొంతకాలంగా వివేక్ బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీలో చేరికపైనే వివేక్, అమిత్ షా తో చర్చించినట్లు తెలుస్తోంది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత వివేక్ బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. వివేక్ వెంట ఆయన కుమారుడు వంశీ కూడా ఉన్నారు. వివేక్ బీజేపీలో జాయిన్ అవ్వటంతోపాటు.. ఆయన కుమారుడి పొలిటికల్ ఎంట్రీకి కూడా లైన్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వివేక్ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో.. ప్రచార బాధ్యతలతోపాటు ఇతర వ్యవహారాలను తెరవెనక ఉండి చూసుకునేవారు. బీజేపీలోకి కొడుకుతోపాటు జాయిన్ కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షాతో భేటీకి కుమారుడు వంశీని కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీజేపీ చేపట్టిన కార్యక్రమంలో ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిధ్దంగా ఉన్నారు. ఆషాఢం ముగిసిన తర్వాత వారంతా పార్టీలో చేరతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఆషాఢం ముగిసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.