ప్రత్యేక దర్శనాల్లో టిటిడి ఉదారత వృద్దులకు, ఐదేళ్ల పిల్లల తల్లిదండ్రులకు అవకాశం 23, 24 తేదీల్లో ప్రత్యేక టోకెన్లతో దర్శనాలు తిరుమల -జ్యోతి న్యూస్‌

తిరుమల శ్రీవారిని సందర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించాని టిటిడి నిర్ణయించింది. ప్రతినెలా సాధారణ దినాల్లో ప్రత్యేక దర్శనాలు కల్పించేందుకు తితిదే సంకల్పించింది. ఇందులో భాగంగా ఈ నెల 23నమంగళవారం 65సంవత్సరాలపైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనార్థం 4వేల దర్శన టికెట్లు జారీ చేయనుంది. ఉదయం 10గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటల స్లాట్‌కు 2వేల టోకెన్లు, మధ్యాహ్నం 3గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. రద్దీ రోజుల్లో వీరు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ సౌలభ్యాన్ని తీసుకువచ్చినట్లు టిటిడి తెలిపింది. ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్లలో ఈ టికెట్లు లభిస్తాయి. ఉదయం 7గంటలకు రెండు స్లాట్‌లకు సంబంధించిన టోకెన్లిస్తారు. ఐదు సంవత్సరాల్లోపు చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులకు జులై 24న అంటే బుధవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో అయితే సంవత్సరంలోపు చిన్నారులకు మాత్రమే ఈ అవకాశం లభిస్తోంది. అయితే భక్తుల కోరిక మేరకు చిన్నారుల వయస్సు పరిమితిని ఐదేళ్లకు పెంచారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవా లని దేవస్థాన ప్రజాసంబంధాల అధికారి కోరారు. ఇదిలావుంటే ప్రముఖులకు మాత్రమే పరిమితమైన శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనంసామాన్యులకు కేటాయించనుందని వస్తున్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళంగా చెల్లించిన ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం కల్పించాలని ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పినట్లుగా శనివారం వార్త వచ్చిందని,అది నిజం కాదని తెలిపింది. ఇలాంటి విధానపరమైన నిర్ణయాలను ధర్మకర్తల మండలిలో చర్చించిన తర్వాత బోర్డు ప్రకటిస్తుందని చెప్పింది. 
తిరుమలలో పెరిగిన రద్దీ 
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కిలోవిూటరు మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటలు, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 78,325 మంది భక్తులు దర్శించుకున్నారు.