చినుకు పడితే సిగ్నల్స్‌ ఖతం

వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న ట్రాఫిక్‌ లైట్లు

  • -ఎక్కువ చోట్ల సరిగా పనిచేయని వైనం
  • -సాంకేతిక, నిర్వహణ లోపంతో ఇబ్బందులు
  • -పలుచోట్ల సమస్యలు
  • -పరిష్కరించాలని అధికారుల సూచన
  • -మరిన్ని ప్రాంతాల్లో సిగ్నలింగ్‌ వ్యవస్థ
  • -జీహెచ్‌ఎంసీకి ట్రాఫిక్‌ పోలీసుల ప్రతిపాదనలు
  • నాసిరకమైన పురాతన వ్యవస్థ
  • – సిగ్నల్‌కు, సిగ్నల్‌కు మధ్య అనుసంధాన లేమి
  • -వాహన రద్దీకి అనుగుణమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ లేదు
  • – బ్యాటరీ బ్యాకప్‌ లేద
 ఎర్ర రంగు వెలిగిన తర్వాత మళ్లీ ఎన్ని సెకన్లలో ఆకుపచ్చ రంగు వెలుగుతుందో  సూచించే సిగ్నల్స్‌ చాలా తక్కువగా ఉన్నాయి. వాహనాల రాకపోకల నియంత్రణకు ఒకరు  బదులు నలుగురు ట్రాఫిక్‌ సిబ్బంది పనిచేయాల్సి రావడం. సమీకత,  ఇంటెలిజెంట్‌ ఆధారిత ట్రాఫిక్‌ వ్యవస్థలో భాగంగా ప్రధాన సిగ్నల్స్‌  రెండుదశల్లో ఆధునికీకరించేందుకు నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపినా  దానికీ అతీగతీ లేదు.  

హైదరాబాద్‌ :
మహానగరం పరిస్థితి పేరుగొప్ప ఊరు దిబ్బలా తయారైంది. నగరంలోని ఎక్కువ శాతం మంది వాహనదారులు, పాదచారులు ప్రతిరోజు ఎదుర్కొనే ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రమవుతోంది. మెట్రోరైలు పనులు వేగవంతం కావటంతో ఒకవైపు ట్రాఫిక్‌ ఆంక్షల అమలుకు తోడు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సక్రమంగా పనిచేయకపోవటం సమస్య తీవ్రతకు కారణమని చెప్పవచ్చు. మహానగరంలో చిన్నపాటి చినుకులు పడితే చాలు..ఉన్నట్టుండి ఒక్కసారిగా సిగ్నల్స్‌ పనిచేయవు. అవి పనిచేయకపోవటంతో వాహనదారులు అయోమయానికి గురికాగా, వాటిని ఆన్‌ ఆఫ్‌ చేసేందుకు పోలీసులు రోడ్డుపై పరుగులు తీయాల్సి వస్తోంది. ఫలితంగా పోలీసులకు ట్రాఫిక్‌ నియంత్రణ అధికారులకు తలనొప్పిగా మారింది.


పేరుకు గ్రేటర్‌లోని 221 చౌరస్తాల్లో ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఉన్నాయి. దాదాపు 60 శాతం సిగ్నళ్లు సక్రమంగా పని చేయడం లేదు. సాంకేతిక లోపాలు.. ట్రాఫిక్‌ సిబ్బంది అశ్రద్ధతో నిర్ణీత కాలవ్యవధిలో గ్రీన్‌, రెడ్‌ లైట్లు వచ్చే పరిస్థితి లేదు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. సిగ్నలింగ్‌ వ్యవస్థ పనితీరుపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువైన నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్‌ ఎం.దానకిషోర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) అధికారులతో చర్చించారు. సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం బీఈఎల్‌ నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ సిగ్నళ్లు కొన్ని ప్రాంతాల్లో సరిగా పని చేయడం లేదు. యూ టర్న్‌లతో 44 చోట్ల సిగ్నళ్ల అవసరం లేకపోగా… మరో ఎనిమిది చోట్ల అవసరం ఉన్నా పూర్తిగా వినియోగంలో లేవు. మిగతా 169 చౌరస్తాల్లో మెజార్టీ చోట్ల తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మూడు నెలలకోసారి రూ.కోటి చొప్పున, యేటా రూ.4 కోట్లు నిర్వహణ వ్యయంగా బీఈఎల్‌కు జీహెచ్‌ఎంసీ చెల్లిస్తోంది. సిగ్నళ్ల విద్యుత్‌ బిల్లుల భారమూ బల్దియాదే. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోన్నా… సిగ్నలింగ్‌లో లోపాల వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతోన్న నేపథ్యంలో మెరుగైన నిర్వహణ దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. 15 రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
వాహనాల రద్దీ పెరుగుతోన్న నేపథ్యంలో మరిన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్‌ విభాగం నుంచి జీహెచ్‌ఎంసీకి ప్రతిపాదనలు అందాయి. మరో 90 ఏరియాల్లో వాహనాల కోసం, 95 చోట్ల పాదచారుల కోసం సిగ్నళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందిస్తున్న బల్దియా… కాలగమనంలో కొత్త సిగ్నళ్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ట్రాఫిక్‌ అస్తవ్యస్తం:
ప్రస్తుతం నగరంలోని జంక్షన్లలో ఉన్న ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఎప్పుడు పని చేస్తాయో తెలియని పరిస్థితి. ట్రాఫిక్‌ నియంత్రించాల్సిన అధికారులు ప్రతిరోజూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో, ఇతర తనిఖీల పేరుతో ఎక్కడో జంక్షన్‌లో అడ్డా వేడమే సరిపోతుంది. సిగ్నల్స్‌ పనిచేసినట్లయితే ఆ ప్రాంతంలో సిబ్బంది పనిచేయాల్సిన అవసరం లేకుండా వాహనదారులు ఎవరికి వారు వెళ్లే పరిస్థితి ఉంది. కానీ సిగ్నల్స్‌ పనిచేయని ప్రదేశాల్లో సిబ్బంది మొత్తం విధుల్లో ఉంది.
ముఖ్యంగా ఎలాంటి అడ్డంకుల్లేకుండా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలమైన పరిస్థితుల్లేకపోవటం కూడా ఇందుకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. రౌండ్‌ ది క్లాక్‌ ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులకు సకల సౌకర్యాలు కల్పించిన సర్కారు ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు ముఖ్యమైన సిగ్నల్స్‌పై దష్టి సారించకపోవటం గమనార్హం. నగరంలోని వీఐపీ జోన్‌ పరిధిలోని సచివాలయం ముందు, అసెంబ్లీ ముందు, అంబేద్కర్‌ విగ్రహం వద్ధ, లక్డీకాపూల్‌ చౌరస్తా, మాసాబ్‌ట్యాంక్‌, నాంపల్లి, సికిందరాబాద్‌ ప్యాట్నీ కూడళ్లలో కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయకుండా మోరాయిస్తున్నాయి. దీంతో అప్పటికప్పుడు పోలీసులు రంగంలో దిగుతూ నడిరోడ్డుపై నిలబడి మ్యానువల్‌గా సిగ్నల్స్‌ చూపించాల్సి వస్తోంది. గ్రేటర్‌ అధికారులు, మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బందం ట్రాఫిక్‌ నియంత్రణపై ముంబై నగరంలో ఏడాది క్రితం అధ్యయనం చేసినానంతరం రూపొందించిన పలు ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవటం, ప్రస్తుతమున్న సిగ్నల్స్‌కు కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవటంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతకు ప్రధాన కారణం. వీఐపీలు, వీవీఐపీలు ఏయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే రూట్‌లోని మాసాబ్‌ట్యాంక్‌ చౌరస్తాలో కూడా ఒక్కసారిగా సిగ్నల్స్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. ఫలితంగా వీఐపీలు రాకపోకలు సాగించే సమయంలో కూడా పలుసార్లు సిగ్నల్స్‌ సక్రమంగా పనిచేయకపోవటంతో కాస్త ముందుగానే సిగ్నల్స్‌ వద్ద పోలీసులు వాహనాలను నిలిపివేస్తున్నారు.