బాధిత కుటుంబాలను.. పరామర్శించాల్సిందే..
- – అప్పటి వరకు నేనిక్కడినుంచి వెళ్లేది లేదు
- – అన్నింటికీ తెగించే వచ్చా.. జైలుకు వెళ్లేందుకు సిద్ధమే
- – కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
- – రాత్రంతా చునార్ గెస్ట్ హౌస్‌లోనే బస
- – ప్రియాంకను కలిసేందుకు వచ్చిన బాధిత కుటుంబాలు
- – ఒకరిద్దరినే నన్ను కలిసేందుకు అనుమతించారు
- – యూపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటూ ప్రియాంక ఆగ్రహం
లక్నో, జులై20 : ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించే వరకు తాను ఇక్కడి నుంచి వెళ్లనని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీనికి ఆ రాష్ట్ర పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకొని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చునార్ గెస్ట్‌హౌస్‌కు తరలించగా రాత్రి అక్కడే బసచేసిన ఆమె బాధిత కుటుంబాలను కలవకుండా వెనక్కి వెళ్లేది లేదని స్పష్టంచేశారు. పేదలకు ప్రజలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన ప్రియాంక శనివారం ఉదయం మాట్లాడుతూ.. 24 గంటలు అవుతోంది. సోన్‌భద్ర కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు అనుమతించేదాకా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లేది లేదని శపథం చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందాన్ని వారణాసి ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాకు దిగారు. టీఎంసీ నేతలు.. కాల్పుల్లో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్తున్నారన్న సమాచారంతో వారిని ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు.
గెస్ట్ హౌస్ వద్దే ప్రియాంకను కలిసిన బాధిత కుటుంబాలు..
తమను కలిసేందుకు ప్రియాంక గాంధీని అనుమతించకపోవడంతో ఎట్టకేలకు బాధిత కుటుంబసభ్యులే చునార్ గెస్ట్‌హౌస్ వద్దకు వచ్చి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు చెందిన ఇద్దరు బంధువులను మాత్రమే నన్ను కలిసేందుకు వచ్చారు. మరో 15మంది నన్ను కలిసేందుకు వస్తే అనుమతించట్లేదు. కనీసం, నేను కూడా వారిని కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఇదిలాఉంటే సోన్‌భద్రలో జరిగిన కాల్పుల్లో 10మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రమోద్ తివారీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్ రామ్ నాయక్‌ను కలిసింది. ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను అభ్యర్థించింది. ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కనీసం బాధితుల కన్నీళ్లను ఎవరైనా తుడవడానికి వెళ్తే కూడా అనుమతించట్లేదు. ఏదైతే జరిగిందో అది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం. అని పేర్కొన్నారు.