అమరావతి పనులు పూర్తిగా పడకేశాయి

  • – పనులు ప్రారంభించే సామర్థ్యం వైకాపాలో కొరవడింది 
  • – పొరుగు రాష్ట్రాలకు పండగ, ఏపీకి దండగలా జగన్‌ పాలన 
  • – టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 

అమరావతి, జులై19: ఏపీలో పాలన పూర్తిగా వెనుకబడింనది, అమరావతి పనులు పడకేశాయని, ఆగిపోయిన పనులను ప్రారంభించే సామర్థ్యం వైకాపాలో కొరవడిందని మాజీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిధుల మంజూరుకు ప్రపంచబ్యాంకు వెనుకంజ వేసిందని అన్నారు. శుక్రవారం శాసనసభ సమావేశాల్లో రోడ్ల నిర్మాణం, ఇతర పనుల నిలిపివేతపై చర్చకు పట్టుబట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. వివిధ ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోవడంపై చర్చకు పట్టుపడదామన్నారు. వైకాపా దౌర్జన్యాల వల్ల పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని, యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, అమరావతి పనులు పూర్తిగా పడకేశాయన్నారు. ఆగిన పనులను ప్రారంభించే సామర్థ్యం వైకాపాలో కొరవడిందని ఆరోపించారు. వైకాపా పాలన పొరుగు రాష్టాల్రకు పండగ, ఏపీకి దండగగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని నగరం అమరావతిలో పనుల నిలిపివేతపై శాసన సభలో శుక్రవారం వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వానికిపాలనపై అవగాహన లేదని, ప్రతిపక్షం చెబితే వినరని మండిపడ్డారు. వైకాపా నేతల చేతగానితనంతో రాష్టాన్రికి తీవ్రనష్టం చేస్తున్నారని దుయ్యబట్టారు. పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం పేట్రేగాయని, దాడులు, దౌర్జన్యాలతో శాంతిభద్రతలను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శాంతిభద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు రావని, యువత ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని చెప్పారు. ఇది ఒకరోజు పోరాటం కాదు, ప్రతిరోజూ ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు సూచించారు. తెదేపా నేతల వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని, ఇది హేయమని చంద్రబాబు దుయ్యబట్టారు.