రాత మార్చిన ‘గీత’
సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజెప్పుతూనే ఉన్నారు. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం.

పడి లేచిన కెరటం
సమస్యలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తే తట్టుకోగలం. కానీ కష్టాలన్నీ మూటకట్టుకుని మూకుమ్మడిగా దాడి చేస్తే? సావిత్రి కథ అలాంటిదే! ” రోజూ ఎనిమిది కిలోమీటర్లు పోవాలి, ఈతాకు ముళ్లు గుచ్చుకుంటున్నా, ఇరవై అడుగుల ఎత్తున్న 30 చెట్లను ఎక్కి కల్లుగీయాలి. అప్పుడే నా మీద ఆధారపడిన అయిదుగురికి ఆకలి తీరుతుందన్నా” అని నవ్వుతూ చెప్పింది సావిత్రి. గతంలోని చేదును, భవిష్యత్తు గురించి భయాన్ని పక్కన పెట్టి వర్తమానంలో జీవిస్తున్న ఆమెను ‘రూరల్‌మీడియా’ కలిసింది.
”భర్త మరణ వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. స్పహలోకొచ్చాక ఇక నా పిల్లలకు నేనే దిక్కు అని, వాళ్లకి తండ్రి కూడా నేనే అయి ఏ లోటు రాకుండా పెంచాలని అర్థమైంది. అండగా ఆయనున్నంత కాలం నాకెప్పుడూ ఎలాంటి లోటూ రాలేదు. ఆయన పోయాక నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఇబ్బందులన్నీ చుట్టుముట్టడం మొదలుపెట్టాయి. ఆయన మరణంతో అత్తా,మామ,మరదలు భాధ్యత కూడా నామీదే పడింది.” అని రెండేళ్ల నాటి విషాదాన్ని వివరించింది.
కులవత్తే జీవనాధారం
ఆమెకు ఇద్దరు పిల్లలు. అందులో ఓక పాపకు అంగవైకల్యం లేవలేదు. అత్తా, మామ, మరదలు కూడా ఆమెతోనే ఉంటారు. రెక్కాడితే గాని ఆ కుటుంబానికి డొక్కాడని పరిస్థితి. అయినా ఆమె ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తమకు తెలిసిన, కులవత్తిలో నైపుణ్యం సాధిస్తే అదే తమకు ఉపాధి చూపుతుందని నమ్మింది. భర్త మతితో కుంగిపోకుండా, అతడు చేసిన కులవత్తినే స్వీకరించి, సొంతకాళ్లపై నిలబడి తన భవిష్యత్‌ని తానే తీర్చిదిద్దుకుంటోంది.
మెదక్ జిల్లాలోని నారాయణ ఖేడ్ సమీపంలోని రేగోడ్ గ్రామానికి చెందిన పుర్రాసావిత్రి భర్త బతికుండగా కనీసం ఇంటి నుంచి బయటకు రాకుండా బతకింది. ఇప్పుడు వీధిలోకి వచ్చి ఈత చెట్లు ఎక్కితే గానీ, కుటుంబం గడవని పరిస్ధితి. గుండెల్లో విషాదాన్ని దాచుకుంటూ బతుకు బండిని నడిపిస్తోంది.రెండేళ్ల క్రితం భర్త సాయిరాం చనిపోవటంతో, భర్త చేసిన కల్లు గీత వత్తిని చేపట్టింది ఆమె. మగవాళ్లకే కష్టసాద్యమైన పనిచేస్తూ, తనపై ఆధారపడిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
కష్టాల కుటుంబం
”నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కూతురు సత్య భవానికి పుట్టుకతోనే పక్షవాతం. ప్రస్తుతం పాప వయస్సు ఐదేళ్లు. కనీసం కదలలేదు. ఎవరినీ గుర్తు పట్టలేని పరిస్థితి. ప్రతి నెల కుమార్తె వైద్యానికి 3 వేల రూపాయలు ఖర్చవుతుంది..’ అని కళ్లు తుడుచు కుంటూ మాతో చెప్పింది సావిత్రి. ఏడాదిన్నర వయస్సున్న కొడుకు అభినవ్‌ను గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో చేర్చింది. ఇద్దరు బిడ్డల భారమే కాక, అత్తా, మామ, మరదలు కూడా ఆమెపై ఆధారపడి ఉన్నారు. సావిత్రి మామ పన్నెండేళ్ల క్రితమే అనారోగ్యంతో మంచాన పడ్డారు. భర్త బతికున్నపుడు వారి పోషణను అతనే చూసుకునే వాడు. అతడు చనిపోవడంతో మూడో చెల్లెలు స్వప్న పోషణ కూడా సావిత్రిపైనే పడింది.
రోజుకు 8కిలో మీటర్లు వెళ్లాలి
ఉమ్మడి మెదక్ జిల్లాలో కల్లుగీతలో ఎక్సైజ్ శాఖ లైసెన్స్ తీసుకున్న మొదటి మహిళ సావిత్రి.
ఆమెకు ఎక్సైజ్ శాఖ జారీచేసిన టీఎఫ్టీ లైసెన్స్ ఉంది.దీని వల్ల ముప్పై చెట్లకు కల్లు గీసేందుకు అనుమతి ఉంటుంది. వీటి ద్వారా వచ్చే కల్లును గ్రామంలో అమ్ముకోవచ్చు. గ్రామానికి 8 కిలోమీటర్లు దూరంలో ఈత వనాలు ఉన్నాయి. రోజూ సావిత్రి అక్కడికి వెళ్లి ఈత చెట్లను ఎక్కి కల్లును గీస్తుంది.దానిని కుండల్లో తెచ్చి, ఊర్లోనే చిన్న దుకాణంలో అమ్ముకుంటోంది. ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన కల్లు మాత్రమే ఆమె దగ్గర దొరుకుతుందని స్ధానికులంటారు. అన్ని ఖర్చులు పోను ఆమెకు నెలకు మిగిలేది ఆరు నుండి ఎనిమిది వేల రూపాయలు మాత్రమే. ఆమెకు వేరే ఆదాయ మార్గం లేక పోవడంతో ఇదే వత్తిలో కొనసాగుతున్నట్టు చెబుతోంది.
ప్రభుత్వం ఆదుకోవాలి
”మామ లక్ష్మాగౌడ్‌కు 15 వందలు, నాకు వెయ్యి రూపాయలు ప్రభుత్వ పెన్షన్ వస్తుంది. కానీ, మామకు బిడ్డ సత్య భవాని వైద్యానికే నెలకు ఆరు వేల వరకు ఖర్చు అవుతుంది. అవిపోతే మిగిలే 3వేలతో కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది. వారి వైద్యం కోసం ప్రభుత్వం సాయం చేస్తే, నాపై కొంత భారం తగ్గుతుంది.” అని సావిత్రి ధీనంగా అభ్యర్ధిస్తోంది.
ఇప్పటికీ అర్ధరాత్రి సమయంలో కూతురు సత్యభవాణికి ఫిట్స్ వస్తాయని ఆందోళనగా అంటోంది ఆమె. సావిత్రికి ఆర్ధిక సాయం చేయాలనుకునే వారు ఫోన్ నెం.9494820188 లో సంప్రదించండి.
రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది స్త్రీ శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. ‘కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభా’ అని కవి చెప్పినట్టుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ మన దేశంలోని మహిళలకు కాస్తంత చేదు గుళికలనే మింగించింది. ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురి అవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇందుకు కారణాలలేమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకేయాలి.
-శ్యాంమోహన్