మగపిల్లలకు బాధ్యతలు నేర్పాలి అమ్మాయిల పట్ల అసభ్యంగా ఉంటే అంతే సంగతులు: రేమారాజేశ్వరి

అమ్మాయిల పట్ల అసభ్యంగా ఉంటే అంతే సంగతులు: రేమారాజేశ్వరి 
మహబూబ్‌నగర్‌,జూలై 18: తల్లిదండ్రులు మగపిల్లలకు బాధ్యతలు చెప్పకపోవడం వల్ల చాలా మంది నెగెటివ్‌ ఆలోచనతో పెరుగుతున్నారని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మనం చూసే దృష్టిని బట్టి చెడు ఉంటుందని అన్నారు. అమ్మాయి రోడ్డుపై వెళ్తున్నప్పుడు అవకాశం కోసం చూడకుండా బాధ్యతగా చూస్తే ఇలాంటి ఘటనలు జరగవన్నారు. అబ్బాయిలకు ఆడపిల్లల పట్ల బాధ్యతలనునేర్పాలన్నారు. 
అత్యాచారాలు, మహిళలపై జరిగే లైంగిక దాడులకు వాళ్లు వేసుకునే డ్రస్సే కారణమనే వాదనలు సరికాదన్నారు. పిల్లలకు బాధ్యతాయుతమైన జీవన శైలిని అలవాటు చేయాలని రెమా రాజేశ్వరి అన్నారు. 
శాఖా పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా సామాజిక బాధ్యత లేకుంటే నేరాలను నియంత్రించలేమని అన్నారు. అత్యాచారాలు, హత్యలు వంటి పెద్ద నేరాల గురించే మాట్లాడుతుంటామని, రోజూ జరిగే వేధింపులు చాలా మటుకు బయటకు రావని అన్నారు. బాల్యానికి రక్ష పేరుతో పాఠశాలల్లో గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఒకసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం 
రాదన్నారు. ఇతర దేశాలకు వెళ్లాలన్నా పాస్‌పోర్ట్‌ కోసం పోలీసు విచారణ చేయాల్సి ఉంటుందని, 
కేసులంటే ఎక్కడికీ వెళ్లలేరని చెప్పారు.అమ్మాయిలకు ఇష్టం లేకుండా వారితో మాట్లాడినా, మిస్‌డ్‌ కాల్స్‌ ఇచ్చానా, వేధించినా కేసులు నమోదవుతాయని చెప్పారు.