ఆన్‌లైన్ షాపింగ్‌తో హాయ్ హాయ్
ఏవైనా వస్తువులు, దుస్తులు కొనుగోలు చేయాలంటే అందుబాటులో ఉన్న దుకాణాలకు తిరిగి, బేరమాడి కొనుగోలు చేసే రోజులు క్రమంగా మారిపోతున్నాయి. కాలానుగుణంగా మార్పులు రావడంతో పాటు ఇంటర్నెట్, క్యాష్ ఆన్ డెలివరీ తదితర సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పరిస్థితి మారింది. ఎక్కువ శాతం మంది ముఖ్యంగా యువత ఆన్‌లైన్ మార్కెట్‌పై తెగ మోజు చూపిస్తున్నారు. వస్తువైనా, ఆహారమైనా, దుస్తులైనా అన్నింటికీ ఆన్‌లైన్ షాపింగ్స్‌పై ఆధారపడుతున్నారు. ధరలు అందుబాటులో ఉండడం, సమయం ఆదా అవుతుండటంతో ఆన్‌లైన్ సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ పట్ల యువతకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. గతంలో గంటల తరబడి దుకాణాల్లో వేచి ఉండి కావాల్సినవి కొనుగోలు చేసే వారు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో కూర్చొని తమకు నచ్చిన వస్తువులను ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. చిన్నపాటి వస్తువు నుంచి ద్విచక్ర వాహనాలు (సైకిళ్లు), ఎల్‌ఈడీ టీవీలు, మొబైల్ ఫోన్లు, ఈయర్ ఫోన్లు, ఫోన్ పౌచ్‌లు, కూలింగ్ కళ్లజోళ్లు, షూలు, వంట పాత్రలు ఇలా ఏది కావాలన్నా…ఆన్‌లైన్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలోని యువత సైతం ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్‌పై మక్కువ చూపుతున్నారు. మారుతున్న సమాజంలో మార్పులకు అనుగుణంగా వారు కూడా అలవాటు పడుతున్నారు. ఏ వస్తువు కావాలన్నా ఇంటికే నేరుగా వచ్చే సదుపాయం ఆన్‌లైన్ షాపింగ్‌లో ఉండడంతో గిరిజన యువత ఆసక్తి చూపుతున్నారు. కోరుకున్న వస్తువు కోరుకున్న చోటుకు ఇట్టే వచ్చేస్తుండడంతో పాటు వచ్చిన తరువాత కూడా ఇష్టం లేకుంటే తిరిగి పంపే సదుపాయం ఉండడం, ఆ మొత్తం తిరిగి తమ అకౌంటులో పడుతుండడంతో హ్యాపీగా ఆన్‌లైన్ షాపింగ్ చేసేస్తున్నారు.
నచ్చితే ఓకే.. లేదంటే వాపస్
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ వైపు చూస్తున్నారు. విభిన్న ఫీచర్లతో మార్కెట్‌ను మంచెత్తుతున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, హైస్పీడ్ ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులో ఉండటంతో ఆన్‌లైన్ మార్కెటింగ్ క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. నచ్చిన వస్తువులు ఎంపిక చేసుకోవడమే తరువాయి. ఇంటి ముంగిటకు కోరినవి వచ్చి చేరుతున్నాయి. వినియోగదారులకు ఎంతో విలువైన సమయం ఆదా అవుతోంది. వస్తువు నచ్చకపోతే వాపస్ చేసి నగదును తమ అకౌంట్‌లోకి తిరిగి పోందుతున్నారు. అదే దుకాణాల్లో కొనుగోలు చేస్తే వస్తువు నచ్చకపోతే మరో వస్తువు తీసుకోవాల్సిందే. నగదు మాత్రం తిరిగి ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఆన్‌లైన్ షాపింగ్‌పై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జోమాటో తదితరవి ఆన్‌లైన్లో సేవలు అందిస్తున్నాయి. వీటికి ప్రజల నుంచి ఆదరణ పొందుతున్నాయి. మనకు కావాల్సిన వస్తువులు ఆన్‌లైన్లో నమోదు చేయగానే వందల కొద్ది మోడల్స్, వాటి రంగులు, ధరలు, ఫొటోలతో సహా నమూనాలు చూపిస్తున్నాయి. దీంతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మంచి వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు వీలుంది. ఆన్‌లైన్ సేవలు ఏజెన్సీ ప్రాంతానికి కూడా విస్తరించాయంటే వాటికి ఆదరణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈజీ మార్కెటింగ్
ఆన్‌లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ మేక్ ఇట్ ఈజీగా మారిపోయింది. పనులపై బిజిబిజీగా గడుపుతున్నారు. ఈ తరుణంలో ఆన్‌లైన్ షాపింగ్‌తో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే కోరుకున్న వస్తువు ఇంటికి చేరుతోంది. కొత్త కొత్త వెరైటీలు లభిస్తుండటంతో అందరూ అటువైపు వెళ్తున్నారు.
క్యాష్ ఆన్ డెలివరీ విధానం మేలు
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన వేల రూపాయల విలువ చేసే వస్తువులకు బదులుగా కొన్ని సందర్భాల్లో ప్యాకింగ్ లోపల అట్టలు, కాగితాలు ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్లో ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేసే వ్యక్తులు సాధ్యమైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీ విధానం ద్వారానే షాపింగ్ చేసుకోవడమే మంచిది. దీని వల్ల ఆన్‌లైన్ మోసాలు సాధ్యమైనంత వరకు జరగకుండా ఉంటాయి.
————————————