జాబిలమ్మ చెంతకు…

నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్‌-2

సోమవారం తెల్లవారు జామున 2 గంటల 51 నిమిషాలకు 
నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్‌-2

హైదరాబాద్‌, జ్యోతి న్యూస్‌ : 
చందమామ రావే.. జాబిల్లి రావే… అనే గేయం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఇప్పటి సాఫ్ట్‌ జనరేషన్‌లో మెట్రోనగరాల్లో జన్మిస్తున్న వాళ్లు మినహా.. చిన్నప్పుడు ప్రతిఒక్కరూ ఈ పంక్తులను ఆస్వాదించిన వాళ్లే. చందమామను చూపిస్తూ.. ఈ పాటను పాడి చిన్నారులను నిద్రపుచ్చడం పెద్దలకు అనుభవమే. అయితే.. చందమామ రావడం లేదు కానీ.. చంద్రుని మీదకే మనం వెళ్తున్నాం. మన రాయబారిని పంపిస్తున్నాం. చంద్రుని గుట్టుమట్లు తెలుసుకునేందుకు, చందమామ మీద ఏముందో తెలుసుకునేందుకు మన శాస్త్రవేత్తలు అరుదైన ప్రయోగం చేస్తున్నారు. 
చందమామ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. మనుషుల ప్రతినిధిగా ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు. వాస్తవానికి పదకొండు సంవత్సరాల క్రితమే 2008లోనే చంద్రయాన్‌-1 ప్రాజెక్ట్‌ విజయవంతమైంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా.. చంద్రయాన్‌ – 2 రెక్కలు సరిచేసుకుంటోంది. చంద్రునిపైకి దూసుకెళ్లేందుకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ – షార్‌లో సర్వసంసిద్ధంగా ఉంది. 
ఆదివారం అర్థరాత్రి అద్భుతం 
ఈ మహత్కార్యంలో ఎక్కడా ఎలాంటి చిన్న లోపం కూడా తలెత్తకుండా.. ఇస్రో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అత్యంత అరుదైన ఈ ప్రయోగం కోసం యావత్‌ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ప్రపంచదేశాలు కూడా ఈ ప్రాజెక్టుపై దష్టి సారించాయి. షార్‌ నుంచి ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. సోమవారం తెల్లవారు జామున 2 గంటల 51 నిమిషాలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. జీఎస్‌ఎల్‌వి మార్క్‌ 3-ఎం-1 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ – 2 ను అంతరిక్షంలోకి పంపించనున్నారు. 
ఈ ప్రాజెక్టులో భాగంగా ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ – ఎఫ్‌డిఆర్‌, లాంచింగ్‌ రిహార్సల్స్‌ విజయవంతంగా పూర్తయ్యాయి. ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ తర్వాత.. లాంచ్‌ రిహార్సల్స్‌లో భాగంగా చంద్రయాన్‌ – 2 లోని సిస్టమ్స్‌ ఎలా రెస్పాండ్‌ అవుతున్నాయో.. డమ్మీకమాండ్స్‌ ద్వారా పరిశీలించారు. సిగ్నల్స్‌, కమ్యూనికేషన్‌ లింక్స్‌ను సరిచూశారు. రిహార్సల్స్‌ పూర్తయిన తర్వాత.. జీఎస్‌ఎల్‌వి మార్క్‌ 3-ఎం-1 లాంచ్‌ వెహికిల్‌ సిస్టమ్స్‌, ఆర్బిటర్‌, విక్రమ్‌ హెల్త్‌ చెకింగ్‌ సహా… పలు టెక్నికల్‌, సైంటిఫిక్‌ టెస్ట్‌లు నిర్వహించారు. 
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా సతీష్‌ ధవన్‌స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 15వ తేదీ అంటే రేపు వేకువ జామున నిర్వహించనున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3-ఎం1 ఉపగ్రహ వాహక నౌకకు ఇటీవలే లాంచ్‌ రిహార్సల్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం రాకెట్‌లోని ఇంధనం నింపే ట్యాంకులకు ప్రీ ఫిల్‌ ప్రెజరైజేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ నెల 7వ తేదీన రాకెట్‌ ప్రయోగవేదిక మీదకు వచ్చిన తరువాత దశల వారీగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. శనివారం ఉదయాన్నే షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో జరుగనున్న ఎంఆర్‌ఆర్‌ సమావేశంలో ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్‌ సమయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డుకు అప్పగించాక లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో మరో మారు లాంచ్‌ రిహార్సల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రయోగానికి సుమారుగా 20 గంటల ముందు అంటే 14వ తేదీ ఉదయం 6.51 గంటలకు కౌంట్‌డౌన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 15వ తేదీ వేకువజామున 2.51 గంటలకు 3,800 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్‌-2 మిషన్‌ను మోసుకుని నింగికి దూసుకెళ్లేందుకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3-ఎం1 రాకెట్‌ సిద్ధంగా ఉంది. 
చంద్రుడిపై నీటిజాడలను కొనుగొన్న చంద్రయాన్‌-1… చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు ఇది తొలిసారి కాదు. 2008లోనూ శ్రీహరికోట నుంచి లాంచ్‌ అయిన చంద్రయాన్‌-1ను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది మన ఇస్రో. ఇది చంద్రునిపై నీటి జాడను కూడా కొనుగొంది. చంద్రుడిపైకి రోవర్‌ ప్రయోగం… ఇప్పుడు చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో భాగంగా చంద్రునిపై ఏకంగా ఓ రోవర్‌ను దించాలనేది ఇస్రో లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ వెల్లడించారు. ఇప్పటికే చంద్రునిపై రోవర్‌ను దించడానికి రెండు ప్రదేశాలను పరిశీలించామని, గతంలో ఏ రోవర్‌ దిగని ప్రదేశంలో చంద్రయాన్‌-2 రోవర్‌ను దింపబోతున్నామని ఆయన తెలిపారు. ఏప్రిల్‌లో శ్రీహరికోట నుంచి… ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి చంద్రయాన్‌-2ను ప్రయోగించనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి అది చంద్రుని కక్ష్యలోకి చేరడానికి ఒకటి నుంచి రెండు నెలల సమయం పడుతుందని ఇస్రో చైర్మన్‌ శివన్‌ తెలిపారు. 14 రోజులపాటు తిరగనున్న రోవర్‌… చంద్రయాన్‌-2 ప్రయోగంలో జీఎస్‌ఎల్‌వీ ఎంకే 2 రాకెట్‌ను ఉపయోగించనున్నారు. ‘చంద్రుని ఉపరితలంపై 14 రోజులపాటు తిరుగాడేలా రోవర్‌ను రూపొందించాం. ఇది చంద్రునిపై 150 నుంచి 200 కిలోమీటర్ల మేర తిరుగుతుంది. అక్కడి ఉపరితలంపై రసాయన విశ్లేషణ చేస్తుంది..’ అని ఇస్రో చైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. ప్రయోగం ఇలా జరుగుతుంది… చంద్రయాన్‌-2 బరువు మొత్తం 3290 కిలోలు. ఇందులో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ ఉంటాయి. చంద్రుని కక్ష్యకు వంద కిలోమీటర్ల దూరంలో ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ వేరవుతుంది. ఆ తర్వాత అది రోవర్‌ను చంద్రుని ఉపరితలంపై దించుతుంది. 
మొత్తం మూడు మానవరహిత వెహికిల్స్‌… 
ఈ మిషన్‌ కోసం ప్రస్తుతం ఇస్రో మూడు మానవరహిత వెహికిల్స్‌ను రూపొందించడంపై పని చేస్తోంది. ఇందులో ఒకటి ఆర్బిటర్‌ క్రాఫ్ట్‌. ఇది చంద్రునిపై కొంత ఎత్తులో తిరుగుతూ ఉంటుంది. ఒక రోవర్‌, ఆ రోవర్‌ను చంద్రునిపై సురక్షితంగా దించేలా ఒక ల్యాండర్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఆర్బిటర్‌ ద్వారా డేటా అంతా భూమికి… చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో భాగంగా ఆరు టైర్లున్న రోవర్‌ చంద్రునిపై ల్యాండవుతుంది. ఇది సెమీ ఆటానమస్‌ మోడ్‌లో ఉంటుంది. భూమి నుంచి ఇచ్చే కమాండ్స్‌ ఆధారంగా రోవర్‌ అటూ ఇటూ తిరుగుతుంది. చంద్రుని ఉపరితలానికి సంబంధించిన డేటాను సేకరించి భూమికి చేరవేస్తుంది. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ ద్వారా ఈ డేటా అంతా భూమిని చేరుతుంది. ఆ డేటాకు సంబంధించిన విశ్లేషణ అంతా ఇస్రోలో జరుగుతుంది. 
భారత్‌ అంతరిక్ష పరిశోధన రంగంలో చంద్రయాన్‌ -2 మిషన్‌ ఓ కలికితురాయిగా చెబుతున్నారు. ఫలితంగా ఈ మిషన్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అసలు ఈ మిషన్‌ ఏంటి.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయనే విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత ఇతర దేశాల్లోని శాస్త్రవేత్తల్లోనూ నెలకొంది. దీంతో.. ఇస్రో కొంత వరకు దీనికి సంబంధించిన అంశాలను వెల్లడించింది. టీజర్ల రూపంలో వివరాలు చూచాయగా వెల్లడించింది. 
2008లో తొలిసారిగా చంద్రయాన్‌ -1 ద్వారా ఉపగ్రహాన్ని ఇస్రో చంద్రుడిపైకి పంపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పాటు చంద్రుడి ఉపరితలంపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది. అయితే.. చంద్రుడి దక్షిణ ధవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే అత్యధిక నీటి ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర ధవంతో పోలిస్తే దక్షిణ ధవం ఎక్కువగా అంధకారంలో ఉంటుంది. 
చంద్రుని మీద ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే పరిశోధనలు చేశాయి. చంద్రయాన్‌-1 ప్రాజెక్ట్‌ ద్వారా భారత్‌ మొదటి ప్రయత్నంలో చంద్రుడి పైకి ఉపగ్రహాన్ని పంపి.. పలు పరిశోధనలు చేసింది. చంద్రయాన్‌-2 మిషన్‌లో భాగంగా ఈ సారి చంద్రుడిపైకి ల్యాండర్‌ను దింపి అందులో ఉన్న రోవర్‌ ద్వారా చంద్రుడిపై పరిశోధనలు చేస్తారు. దీంతో చంద్రుడి మీద పరిశోధనలు చేసిన నాలుగో దేశంగా భారత్‌ ఆవిర్భవించనుంది. 
చంద్రుడి ఉపరితలంపై విస్తత పరిశోధనలే లక్ష్యంగా చంద్రయాన్‌-2ను ఇస్రో చేపట్టింది. ఇంతవరకూ ఏ దేశం చేరుకోని చంద్రుని దక్షిణ భాగం వైపు వెళ్లడానికి ఇస్రో ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే చంద్రునిపై వ్యర్థ రహిత అణుశక్తి మూలకాల లభ్యతపై ఇస్రో అధ్యయనం చేయనుంది. ఈ అణుశక్తి ట్రిలియన్‌ డాలర్ల విలువ చేయనుంది. ఇస్రో చంద్రయాన్‌-2లో పంపనున్న రోవర్‌ ద్వారా నీరు, హీలియం-3 జాడ కోసం చంద్రుని ఉపరితలంపై పలు నమూనాలను విశ్లేషించనుంది. 
చంద్రునిమీద స్థలాకతి ఎలా ఉంది ? ఖనిజాలు ఏమైనా ఉన్నాయా? రసాయన కూర్పులు, నేలధర్మం, భౌతిక లక్షణాలతోపాటు సున్నితమైన చంద్ర వాతావరణంపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విస్తరించడానికి చంద్రయాన్‌ 2 లో అనేక సైన్స్‌ పేలోడ్‌ లను శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. ఇది ఒక కొత్త అవగాహనకు దారితీయడమే కాకుండా చంద్రుని యొక్క మూలం, పరిణామాలను అధ్యయనం చేసేందుకు ఉపయోగ పడనుంది. 
ఇప్పటి వరకూ చంద్రునిపై ఎవ్వరూ చేరుకోని ప్రాంతానికి ప్రయోగం చేస్తున్నామని, చంద్రుని దక్షిణ ధ్రువానికి ఈ ప్రయోగాన్ని నిర్దేశించామని, ఆ ప్రాంతం గురించి విశ్వానికి తెలియజేయనున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్‌ -1 మాదిరిగానే చంద్రయాన్‌-2 కూడా విజయవంతం అవుతుందని, చంద్రునిపై జీవజాడ విషయంలో భారతదేశం.. ప్రపంచానికి ఓ దిక్సూచిలా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.