కూలీ కూతురు ఎంపీ!
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిల్చిన ఏకైక మహిళా అభ్యర్థి… కేరళ నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎంపీ! కేరళ నుంచి గెలిచిన రెండో దళిత ఎంపీ! కమ్యూనిస్ట్‌ల కంచు కోటయిన అలత్తూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించిన విజేత. దినసరి కూలీ కూతురుగా మొదలైన ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఎంపీ స్థాయికి చేరింది..ఆమే రమ్యా హరిదాస.
లోక్‌సభ 545మంది ఎంపీల్లో ఆమె ఒకరు. కేంద్ర మంత్రి కాదు.. అధికార పక్షం ఎంపీగా హోదా లేదు… అలాగనీ అనుభవమున్న పార్లమెంటేరియన్ కాదు… అయినా దేశంమొత్తం ఆమె గురించే మాట్లాడుతుంది. ఆమె మాత్రం మౌనంగా పనిచేసుకుంటూ పోతున్నారు.. పనిమంతులు మాట్లాడరు అనే సూక్తిని నిజం చేస్తూ!చాలామంది రాజకీయ నాయకుల ఆరాటం గురించే మాట్లాడే మీడియా ఇప్పుడు మాత్రం రమ్య పోరాటం గురించి మాట్లాడుతుంది. కేరళలోని ఒక దినసరి కూలీ కూతురు అయిన రమ్య అందరూ అత్యంత గౌరవంగా భావించే లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికవడం వరకూ సాగించిన పోరాటం అందులో ఉంది.
ఆ విషయం ఇప్పటిదాకా బయటి జనాలకు అంతగా తెలియదు. ఇప్పుడు దేశమంతా తెలిసింది. వారసత్వం, డబ్బు ఉన్నా కూడా రాజకీయాల్లో రాణించడం కష్టం. అలాంటిది ఏ అండా లేకుండా ఒక సామాన్య మహిళ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టడం ఆషామాషీ కాదు. ఆ విషయం అందరికంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి బాగా తెలుసు. కాబట్టే ఆమె రమ్య నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తూ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేశారు. సోనియా గాంధీ అయితే రమ్యను గుండెలకు హత్తుకున్నారు. ఆ స్థాయికి రావడానికి ఆమె చాలా పోరాటమే చేశారు. కానీ ఎన్నికల్లో గెలవడానికి కాదు. బతకడానికి! ఎందుకంటే పూరి గుడిసె నుంచి పక్కా ఇంటిలోకి మారాలంటేనే ఎంత కష్టమో రమ్యకు తెలుసు. అలాంటిది అలత్తూర్ లోక్‌సభా స్థానం టిక్కెట్ తను ఆశించడమా? కనీసం కలలో కూడా ఊహించలేదామె.
అలాగని ‘నా జీవితం ఇంతే’ అనుకోలేదు. గొప్ప వ్యక్తుల జీవితాలు చిన్నగా మొదలైనట్టే రమ్య కెరీర్ కూడా ఒక స్వచ్ఛంద సంస్థలో 600 రూపాయల జీతంతో ప్రారంభమైంది. మరెవరి కెరీర్ అయినా అక్కడితోనే ముగిసిపోయేదేమో కానీ రమ్య పోరాటం చివరకు ఆమెను ఎంపీగా పార్లమెంట్‌కు చేర్చింది.
తల్లి వారసురాలిగా…
రమ్యది నిరుపేద దళిత కుటుంబం. ఆమె తండ్రి రోజు కూలీగా పనిచేసేవారు. రమ్య చిన్నతనంలో వారి కుటుంబం పూరి గుడిసెలోనే ఉండేది. ప్రస్తుతం రమ్యకు 32 ఏళ్లు. చిన్న వయసులోనే పార్లమెంట్‌లో అడుగుపెట్టిన రమ్య రాజకీయ ప్రస్థానం చిన్నతనంలోనే ప్రారంభమైంది. ఆమె తల్లి రాధ కూడా కాంగ్రెస్ కార్యకర్త. ఆలిండియా మహిళా కాంగ్రెస్‌లో పనిచేశారు. రమ్య చిన్నతనంలో తల్లితో రాజకీయ సభలు, ర్యాలీలకు హాజరయ్యేవారు. కూతురును ఆమె బాగా ప్రోత్సహించేవారు. ఓ పక్క చదువుకుంటూనే, మరోపక్క కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు రమ్య. ఈ క్రమంలోనే కేరళ స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా పనిచేశారు.
పాటతో పైపైకి..
రమ్యను అందరిలో ప్రత్యేకంగా నిలిపింది… గాయనిగా ఆమె ప్రతిభ. ఆ గుర్తింపే రాజకీయ పరమపద సోపానంలో రమ్యను చివరి గడికి చేర్చింది. కేరళ నుంచి ఇప్పటివరకూ లోక్‌సభకు ఎన్నికైన రెండో దళిత మహిళగా నిలిపింది. సంగీతంతో ఆమెది విడదీయరాని బంధం. చిన్నతనం నుంచే ఆమె పాటలు పాడేవారు. కుటుంబ పరిస్థితుల వల్ల సంగీత శిక్షణ తీసుకోలేకపోయారు. కానీ స్టేజీ మీద, గుళ్లలో పాట పాడే అవకాశాన్ని చేజారనిచ్చేవారు కాదు రమ్య.
కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రదర్శనల్లోనూ, సభల్లోనూ ఆమె తన ఉపన్యాసాల కన్నా పాటలతోనే అదరగొట్టేవారు. పాటతోనే సోషల్ మీడియాలో ఆమె కేరళ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. రమ్య మంచి మాటకారి కూడా. స్వచ్ఛంద సంస్థ ‘ఏక్తా పరిషత్’లో చేరి భూ సంస్కరణల కోసం పోరాడారు. ”అప్పడే నాకు కేరళ బయట ప్రపంచాన్ని చూసే అవకాశం వచ్చింది. నేను ప్రపంచాన్ని చూసే దక్కోణం మారింది” అంటారు రమ్య. ఆదివాసీలు, దళితుల సమస్యలపై పోరాటాలతో ప్రజల్లో పేరు తెచ్చుకుని, కున్నమంగళం పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
ప్రతిభకు పట్టం
రమ్య రాజకీయ జీవితం 2010లో అనుకోని మలుపు తిరిగింది. అద ష్టం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రూపంలో గడప తొక్కింది. కాంగ్రెసలో కొత ్త రక్తం నింపడానికి ప్రతిభావంతులైన యువ నాయకత్వం కోసం దేశవ్యాప్తంగా సాగిన అన్వేషణలో రాహుల్ కంట్లో పడ్డారు రమ్య. మంచి వాగ్ధాటి, ప్రజా సమస్యలపై అవగాహన, సజనాత్మకత, పోరాడే తత్వం ఉన్న రమ్య పార్టీకి ఉపయోగపడతారని రాహుల్ భావించారు.
యూత్ కాంగ్రెస్ నేషనల్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అలత్తూర్ నుంచి రమ్యను బరిలోకి దింపాలని రాహుల్‌గాంధీ నిర్ణయిం చారు. వద్దని ఎంతమంది చెప్పినా ఆయన వినలేదు. ఆమెకు సీటు ఇవ్వడం చాలామంది కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేకపోయినా రాహుల్‌కు ఎదురుచెప్పలేకపోయారు. అలా ఆమె యూడీఎఫ్ కూటమి అభ్యర్థి అయ్యారు. ”నాకు టిక్కెట్ వచ్చిన సంగతి టీవీల్లో చూశాకే తెలిసింది” అని గుర్తుచేసుకుంటారు రమ్య.
కమ్యూనిస్టల కోటలో…
అలత్తూర్ లోక్‌సభా స్థానం 2009లో ఏర్పాటయింది. అప్పటి నుంచి ఆ స్థానం కమ్యూనిస్ట్ పార్టీకి కంచుకోట. సీపీఐ(ఎం)కు చెందినపీకే బిజూ 2009, 2014ల్లో
గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలత్తూర్ పరిధిలోని ఒక్క అసెంబ్లీ స్థానం మినహా అన్నిటినీ కమ్యూనిస్టులే గెలుచుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో గెలుపుపై కాంగ్రెస్ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ పేరు, నాయకులను మాత్రమే నమ్మి రమ్య ఊరుకోలేదు. కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారం కోసం అవసరమైన నిధులను ఆమె సోషల్ మీడియాలో క్రౌడ్‌ఫండింగ్ ద్వారా సేకరించారు. ‘రమ్యా హరిదాస్ ఛాలెంజ్ ఫండ్’ పేరుతో ప్రజలు, అభిమానుల నుంచి నేరుగా విరాళాలు సేకరించారు. అలత్తూర్ ప్రచారానికి వెళ్లేటప్పుడు ఆమె దగ్గర ఉన్నవి మూడు జతల దుస్తులే. ప్రచారం ముగిసేసరికి ఆమెకు 56 జతల దుస్తులు విరాళంగా వచ్చాయి. ”ప్రజలకు నా నేపథ్యం తెలుసు. అందుకే క్రౌడ్‌ఫండింగ్‌కు బాగా స్పందించారు.
కొందరు తమ పెన్షన్‌లో కొంత డబ్బును, మరికొందరు చికిత్స కోసం దాచుకున్న డబ్బు ఇచ్చారు. ఆ సంఘటనలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఎంపీగా నా జీతం అలత్తూర్ ప్రజల కోసమే ఖర్చు చేస్తా” అంటారు రమ్య. ఆమె ఖర్చుచేసేదల్లా సినిమా టిక్కెట్‌కు మాత్రమే! హీరో మోహన్‌లాల్‌కు ఆమె వీరాభిమాని. ఆయన సినిమాకు టిక్కెట్ కొనడమే ఆమె పెట్టే లగ్జరీ ఖర్చు.
మాటలకు చేతలే సమాధానం
స్థానిక అంశాలపై పట్టు ఉండడం ఎన్నికల్లో రమ్యకు కలిసొచ్చింది. వాటిని తన ప్రచారంలో లేవనెత్తింది. ”నేను నడిచొచ్చిన దారిని మర్చిపోను. మీతోనే ఉంటాను. నన్ను నమ్మి ఓటేయండి” అని ఓటర్లను అభ్యర్తించారు. ప్రచారంలో పాటలు పాడడం, నవ్వుతూ మాట్లాడడం ద్వారా ఆమె జనాలకు దగ్గరయ్యారు. తమకు పోటీయే కాదనుకున్న రమ్యకు ప్రజల్లో పెరుగుతున్న మద్దతు కేరళ కమ్యూనిస్ట్ పార్టీకి మింగుడుపడలేదు.
కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ లీడర్, ఎల్డీఎఫ్ కన్వీనర్ విజయరాఘవన్ రమ్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసభ్యకరమైన విమర్శలు చేశారు. వాటిపై రమ్య స్పందిస్తూ ”ఎప్పుడూ మహిళల రక్షణ గురించే మాట్లాడే నాయకుడి నోటి నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అనుకోలేదు. భవిష్యత్తులో మరే మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదు” అని ఎదురుదాడి చేశారు. విజయరాఘవన్‌పై పోలీస్ కేసు కూడా పెట్టారు. విజయ్ రాఘవన్ దిగొచి ‘నా ఉద్దేశం అది కాద’ని క్షమాపణలు చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ మాత్రం ఊహించని విజయాన్ని రమ్య సాధించారు. పీకే బిజూపై ఆమె లక్షన్నర ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కేరళ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తొలి దళిత ఎంపీగా ఆమె కొత్త రికార్డు సష్టించారు. ఒకప్పుడు
రాళ్లు విసిరిన చేతులే ఇప్పుడు ఆమె మీద పూలవర్షం కురిపిస్తున్నాయి.
”ప్రజలకు నా జీవిత నేపథ్యం తెలుసు. అందుకే క్రౌడ్‌ఫండింగ్‌కు బాగా స్పందించారు. కొందరు తమ పెన్షన్ నుంచి డబ్బు ఇస్తే, మరికొందరు చికిత్స కోసం దాచుకున్న డబ్బు ఇచ్చారు. ఆ సంఘటనలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఎంపీగా నా మొత్తం జీతాన్ని అలత్తూర్ ప్రజల కోసమే ఖర్చు చేస్తా” అంటారు రమ్య హరిదాస.