కాళేశ్వర గోదారమ్మ జలతరంగం
మేడిగడ్డ: మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్.. అక్కడి నీటి విడుదల.. అక్కడి నుంచి పదమూడున్నర కిలోమీటర్ల దూరం వరకు అడవిని, కొండలు గుట్టల్ని చీల్చుకుంటూ మరో నదిలా పాలసముద్రం పారినట్టు గ్రావిటీ కెనాల్‌లో నీళ్లు.. అన్నారం బరాజ్‌లోకి చేరుతున్న నీటి ప్రవా హం.. అపూర్వ ద శ్యకావ్యం. దేనికదే ప్రత్యేకత. మూడేండ్ల శ్రమ. కాలానికే యాష్టకొచ్చే రీతిలో జరిగిన పని. యుద్ధప్రాతిపదిక అంటే ప్రపంచంలోనే అసలైన నిర్వచనం. కాకతీయులు గొలుసుకట్టు చెరువుల్ని కట్టిస్తే.. తెలంగాణ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ చరిత్రను తిరగరాసిండు. అవతలివానికి కండ్లుకుట్టేంత కష్టపడ్డడు. రాత్రనక పగలనక తను నడిచిండు. తనతోపాటు అందరినీ నడిపిచ్చిండు. తెలంగాణకు తెలివెక్కడిది? వాళ్లకు పాలించుడెక్కడ వస్తది? అని నీల్గిన నాలుకలు కరుచుకునేలా చేసిన మొనగాడు కేసీఆర్ అని తెలంగాణ జల చరిత్రను చరితార్థం చేసిన అబ్బురపడే సందర్భం. వానల్లేవని బెంగటిల్లే తెలంగాణ రైతాంగం ఒక్కసారి మేడిగడ్డ చూస్తే ధైర్యం వస్తది. కన్నెపల్లి నుంచి అన్నారం నదిలాగా.. అదీ నదికి అభిముఖంగా పారే జలద శ్యం కనులారా చూస్తే భరోసా వస్తది. అవును. నిజం. అదొక అపురూప దశ్యకావ్యం. దేశదేశాల నుంచి సాంకేతిక నిపుణులు ఇప్పటికీ కన్నెపల్లి పంప్‌హౌస్‌లో పనులు చేస్తూనే ఉన్నారు.
మేడిగడ్డ కండ్ల చూడవలసిందే!
కాళేశ్వరం గొలుసుకట్టు ప్రాజెక్టుల్లో గోదారమ్మ ఒదిగి ఉన్న దశ్యాలను కండ్ల చూడవలసిందే. కడుపునిండా తిన్న తప్తిని మూటగట్టుకోవలసిందే. మేడిగడ్డ బరాజ్.. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో శనివారం సాయంత్రానికి 5.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. పాలసంద్రం వలె ఎటుచూస్తే అటు నీళ్లు. ఇక్కడినుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరం వరకు చేరిన బ్యాక్ వాటర్. అంబటిపల్లి, సూరారం, బెగ్లూరు, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మహదేవ్‌పూర్, కన్నెపల్లి.. ఇలా మంథని వరకు గోదావరి బ్యాక్ వాటర్. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి శనివారం వరకు ఒకటో నంబర్ పంప్ నుంచి 0.9 టీఎంసీ, మూడో నంబర్ పంప్ నుంచి 0.45 టీఎఎంసీ, నాలుగో నంబర్ పంప్ నుంచి 0.48టీఎంసీ, ఆరో నంబర్ పంప్ నుంచి ఒక టీఎంసీ.. ఇలా దాదాపు 2.9 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. కన్నెపల్లి నుంచి అన్నారం బరాజ్‌వరకు గ్రావిటీ కాల్వ ద్వారా దాదాపు 13.5 కిలోమీటర్ల దూరంలో 36 మీటర్ల వెడల్పుతో గోదావరి పరుగులు పెడుతున్నది. 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అన్నారం బరాజ్‌లోకి శనివారం సాయంత్రానికి 1.37 (కన్నెపల్లి నుంచి పంపింగ్ చేసిన నీటిలో 1.37 టీఎంసీలు పోను కాల్వలో 13.5 కిలోమీటర్ల నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉన్నది) టీఎంసీల నీరు వచ్చి చేరింది. దట్టమైన అడవిలో గ్రావిటీ కెనాల్ పొడవునా గోదావరి పరవళ్లు. ఆకుపచ్చని అరణ్యంలో అపురూప ద శ్యం.
ఇన్ని నీళ్లను కండ్ల చూస్తామని అనుకోలేదు
బీడువారిన తెలంగాణలో గిన్ని నీళ్లను చూస్తామని కలలో కూడా అనుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ మొండి పట్టుదలతో, గుండె ధైర్యంతో గోదారమ్మను మెప్పించి, బీడు భూముల ఆకలి తీర్చి అన్నదాతకు జీవధార పోస్తాండు అని మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం బరాజ్‌లకు వరద ప్రవాహంలా తెలంగాణ నలుమూలల నుంచి వస్త్తున్న ప్రజలు నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. జూన్ 21న సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసినప్పటినుంచి ప్రాజెక్టును చూసి రావలసిందే అని తీర్మానించుకొన్నారని శనివారం తరలివచ్చిన వివిధ రంగాల ప్రజలను చూస్తే అర్థమవుతున్నది గిన్ని నీళ్లను కండ్ల జూస్తమని కలలో కూడా అనుకోలేదు. కేసీఆర్ కడుపు సల్లంగుండ. కంటికి అందనంత దూరంలో నీళ్లు. ఈ నీళ్లను జూస్తే దసరా పండుగనాడు పాలపిట్టను చూసి, జమ్మి పంచుకున్నంత సంబురంగా ఉంది. దీపావళి పండుగనాడు కొత్తబట్టలు కట్టుకున్నట్టుంది అని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బంజెర గ్రామానికి చెందిన అయోధ్యరామయ్య అనే రైతు మేడిగడ్డ దగ్గర ముచ్చటపడ్డాడు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం రోళ్లకళ్లు గ్రామానికి చెందిన లునావత్ లష్కర్ అనే రైతు మా ఊళ్లో నారు పోసినం. పేపర్లల్ల్ల, టీవీలల్ల కాళేశ్వరం ప్రాజెక్టులకు నీళ్లు వచ్చినయంటే చూసిపోదామని వచ్చినం. ఇక్కడికొచ్చినంక మనసు హూషారుగున్నది. సీఎం కేసీఆర్ పడ్డ కష్టం ఫలించింది అని సంబురపడ్డాడు.