సిట్ విచారణకు పిలిస్తే వెళ్తా: కవిత
హైదరాబాద్, ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ఇంకా ముగింపునకు రాకపోవడం ఆశ్చర్యకరమని ఆమె పేర్కొన్నారు. విచారణను వేగవంతం చేసి దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ, సిట్ అధికారులు పిలిస్తే తాను తప్పకుండా హాజరై పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. “చట్టాలను అందరూ గౌరవించాలి.. దర్యాప్తుకు సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశంపై త్వరగా నిజాలు వెలుగులోకి రావాలని అభిప్రాయపడ్డారు.
సిట్ విచారణను తప్పుపడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని కవిత అభిప్రాయపడ్డారు. రాజకీయ ఆరోపణల కంటే దర్యాప్తు పారదర్శకంగా సాగి ప్రజల్లో నమ్మకం పెరగడం ముఖ్యమని చెప్పారు.
కాంగ్రెస్‌పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. “కొంతమందితో కలిసి కాంగ్రెస్ రాజకీయ నాటకాలకు తెరలేపుతోంది” అని ఆరోపించారు. తనతో పాటు తన భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ అంశంపై సమగ్ర విచారణ అవసరమని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో కవిత చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సిట్ దర్యాప్తు పురోగతిపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

