నేటి నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు 🚌🔥
- – 25శాతం బస్సులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- మార్గదర్శకాల మేరకు పరిమిత సంఖ్యలో రవాణా
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
కరోనా నేపథ్యంలో ఆరు నెలలుగా నిలిచిపోయిన హైదరాబాద్ సిటీ బస్సులు నేటి నుంచి రోడ్డెక్కనున్నాయి. శుక్రవారం నుంచి 25 శాతం బస్సులు నడపనున్నట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, హకీంపేట, ఫలక్‌నుమా, మిథాని, మియాపూర్, హయత్‌నగర్ డిపోల నుంచి పాక్షికంగా బస్సులు ప్రారంభమయ్యాయి. ఈ డిపోల నుంచి 12 చొప్పున సర్వీసులను నడిపినట్లు తెలుస్తోంది. సిటీ సబర్బన్ ప్రాంతాలకు 15 కిలోవిూటర్ల పరిధిలో బస్సులు నడిపారు. శివారు గ్రామాల్లోని ప్రయాణికుల అభ్యర్థన మేరకు బస్సులను ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతంలో బస్సులో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండేది. ఇకపై ఆ పరిస్థితి లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. కరోనా కారణంగా మార్చి 22 వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగడం లేదు. దాదాపుగా ఆరునెలలపాటు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే, అన్‌లాక్ లో భాగంగా ప్రజారవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రాష్టాల్ర మధ్య, జిల్లాల మధ్య బస్సులు పరుగులు తీస్తున్నాయి. నగరంలో సిటీ బస్సులపై మొన్నటి వరకు సందిగ్దత నెలకొన్నది. సిటీ సర్వీసులను తిరిగి ప్రారంభిస్తే కేసులు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, సిటీ శివారు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా బస్సులను నడుపుతున్నారు. నేటి నుంచి నగరంలోని అన్ని ప్రాంతాల్లో సిటీ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిఎం కెసిఆర్‌కు నగర నేతలు విన్నవించారు. దీంతో మార్గదర్శకాల మేరకు 25శాతంబస్సులకు సిఎం ఓకే చెప్పారు. దీంతో పరిమిత సంఖ్యలోనే బస్సులను నడపాలని ప్రభుత్వం చూస్తున్నది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే సిటీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బస్సులు నడవకపోవడంతో ప్రజలు సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా డబ్బు అధికంగా ఖర్చు అవుతున్నది. సిటీ బస్సులు అందుబాటులోకి వస్తే సామాన్యప్రజల కష్టాలు కొంతమేర తగ్గుతాయని చెప్పొచ్చు.గతవారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, కోలుకునే వారిసంఖ్య పెరగడంతో గ్రేటర్‌లో ఆర్టీసీ సర్వీసులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ పరిధిలో బస్సులను నడపాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. గురువారం ప్రగతి భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్ నిర్వహించిన భేటీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మెట్రో సేవలు సైతం ఇప్పటికే ప్రారంభం అయ్యాయని, ఇక ఆర్టీసీని కూడా రోడ్డు ఎక్కించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. రోవైపు చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్న ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో నగరానికి సవిూపంలో ఉన్న ఊళ్లకు తిప్పే బస్సులను బుధవారం తిరిగి ప్రారంభించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండే రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ డిపోల్లో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేకపోవటంతో జిల్లా సర్వీసులను తిప్పుతున్న సంగతి తెలిసిందే. నగరానికి చేరువగా ఉన్న గ్రామాలకు సిటీ డిపోల నుంచి తిరిగే బస్సులను కూడా జిల్లా సర్వీసులుగానే పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి తిప్పటం ప్రారంభించారు. నగరంలోని 18డిపోల నుంచి 230 సర్వీసులు ప్రారంభించారు. నగరానికి 50 నుంచి 60
కి.విూ. పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇవి తిరుగుతాయి. వీటి రూపంలో రోజుకు రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లా సర్వీసుల ద్వారా వస్తున్న రూ.4 కోట్ల రోజువారీ ఆదాయానికి ఇది తోడై కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.