ఆర్థిక వ్యవస్థకు దన్ను

ఆర్ బీఐ నిర్ణయాల పై ప్రధాని మోదీ ట్వీట్

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయాలు పేదలు, రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అలాగే, ద్రవ్య లభ్యత, రుణ సరఫరా సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. “ ఆర్బిఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ద్రవ్య లభ్యత, రుణ సరఫరా సామర్థ్యం పెరగనుంది. చిన్న స్థాయి పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, రైతులు, పేదలు ఎంతగానో లబ్దిపొందనున్నారు. ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్'(డబ్ల్యూఎంఏ) పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలు కూడా ప్రయోజనం పొందనున్నాయి” అని మోదీ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు నేడు ఆర్‌బీఐ పలు కీలక ప్రకటనలు చేసింది. రాష్ట్రాల డబ్ల్యూఎంఏ పరిమితిని 60శాతానికి పెంపు, సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50వేల కోట్లు, నాబార్డుకు రూ.25వేల కోట్లు వంటి కీలక నిర్ణయాలు నేటి ఆర్ బీఐ ప్రకటనల్లో ఉన్నాయి.– రైతులు, కూలీలను ఆదుకోవాలి యూపీ సీఎంకు ప్రియాంక గాంధీ లేఖ న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని రైతులు, కూలీలను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేయాలన్నారు. అందుకోసం వెంటనే నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల పంటలకు భరోసా ఇవ్వాలని, చెరుకు రైతుల పాత బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేని వారికి కూడా ఉచితంగా గోదుమలు, పప్పులు, నూనె తదితర నిత్యావసరాలు అందజేయాలని కోరారు. ఆర్థిక రంగం పై కరోనా వైరస్ పెనుప్రభావం చూపించిందని, అది రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల పై పడిందని ప్రియాంక అన్నారు. ఈ మహమ్మారి ధాటికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం ఇబ్బందులు పడుతున్నాయన్నారు. దీంతో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని, వారికి తగిన సహాయం చేసి ఉపశమనం కలిగించాలని ప్రియాంక గాంధీ కోరారు.