ప్రయోజనం శూన్యం

మోదీ విదేశీ కార్యక్రమాలపై ప్రియాంక విమర్శలు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ తూర్పు ఉత్తర ప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో మోదీ విదేశాల్లో నిర్వహించే భారీ కార్యక్రమాల వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. ట్విటర్‌ వేదికగా ఆమె మోదీపై ఘాటు విమర్శలు గుప్పించారు. 5 ట్రిలియన్‌ డాలర్లు అంటూ రోజూ మాట్లాడటం కానీ, పత్రికల పతాక శీర్షికలను మలచుకోవడం కానీ భారత దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచబోవని ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. విదేశాల్లో నిర్వహించే కార్యక్రమాలు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి దోహదపడబోవన్నారు. మదుపరుల నమ్మకం దెబ్బతిందని, అయినప్పటికీ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించాలనుకోవడం లేదని అన్నారు. ఆర్థిక మహాశక్తిగా ఎదగాలనుకుంటున్న భారత దేశానికి ఈ మందగమనం ఓ వేగ నిరోధకమని పేర్కొన్నారు. ఈ నెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలోని హూస్టన్‌లో ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ ఈ ట్వీట్‌ చేశారు.