మద్యం డోర్ డెలివరీ
కర్ణాటక మంత్రి నగేశ్ వివాదాస్పద ప్రకటన
బెంగళూరు: నూతన ప్రభుత్వంలో మంత్రి పదవి రాని వారి అలకలు తీర్చడంలో లీనమైన సీఎం యడియూరప్పకు మంత్రి నగేశ్ రూపంలో సరికొత్త తలనొప్పి ఎదురైంది. ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన నగేశ్ బుధవారం ఆ శాఖ ప్రక్షాళన పనులను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మద్యాన్ని డోర్ డెలివరీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు కూడా మండిపడటంతో మంత్రి వెంటనే యూటర్న్ తీసుకున్నారు. డోర్ డెలివరీ ఇవ్వడం వల్ల పరిమితికి మించి మద్యం సేవించే అలవాటుకు అడ్డుకట్ట వేయచ్చని తొలుత తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తర్వాత తాను అలాంటి వ్యాఖ్యలే చేయలేదని చెప్పడం గమనార్హం.
మరోవైపు సీఎం యడియూరప్ప సైతం నగేశ్ వ్యాఖ్యలపై గుర్రుమంటున్నారు. తనతో చర్చించకుండా ఇలాంటి ప్రకటనలు చేసినందుకు ఆయనపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గురువారం నగేశ్‌ను ఇంటికి పిలిపించుకుని మరీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నిర్ణయాలపై మీడియా, బహిరంగ ప్రదేశాల్లో ఎలా చర్చిస్తారంటూ మంత్రిపై యడ్డీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో వరద బీభత్సం స ష్టిస్తుంటే ఇలాంటి వ్యాఖ్యలు తాజా వివాదానికి తెరతీసినట్లు కనిపిస్తోందని యడ్డీ కోప్పడినట్లు సమాచారం. దీంతో పాటు పలు మహిళా సంఘాలు సైతం మంత్రిపై మండిపడటంతో వెంటనే ఆయన యూటర్న్ తీసుకున్నారు. అసలు తాను వ్యాఖ్యలేవీ చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించే యోచనలో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ క్షమాపణలు కూడా చెప్పారు.