అందుబాటులో ‘టీకాలు’
- రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.84 కోట్ల వ్యాక్సిన్లు
- మూడు రోజుల్లో మరో 11 లక్షల డోసులు అందిస్తాం
- కేంద్ర ప్రభుత్వం ప్రకటన
న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్ :
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా 1.84 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో మరో 11 లక్షల డోసులు అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారంనాడు తెలిపింది. ఇంతవరకూ ఉచిత కేటగరి, డైరెక్ట్ స్టేట్ ప్రొక్యూర్మెంట్ కేటగిరి కింద రాష్టాల్రు, యూటీలకు 22 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు సమకూర్చినట్టు తెలిపింది. ఇందులో వేస్టేజీలతో సహా 20 కోట్ల 17 వేల పైచిలుకు డోసులు వినియోగం అయినట్టు పేర్కొంది. కాగా, గత కొద్ది రోజులుగా దేశంలో 2 లక్షలకు పైగా కొత్త కేసులు, 4,000కు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా వేరయింట్ల కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ పలు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రాష్టాల్రయితే బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించాయి. చాలా రాష్టాల్రు ఆంక్షల పొడిగింపు, పూర్తి లాక్‌డౌక్ కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పక్రియ కూడా కొనసాగుతోంది. అయితే, పలు రాష్టాల్రు కోవిడ్ వ్యాక్సిన్ కొరత కారణంగా 18-44 ఏళ్ల మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సస్పెండ్ చేశాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో ఈ పరిస్థితి ఉంది.