‘తిక్క’ తీరింది !

  • రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిల తరలింపు
  • ఐషోలేషన్‌ ‌కేంద్రాలకు తరలిస్తున్న పోలీసులు
  • పారిశ్రామిక వాడల్లో పోలీసులు కఠినంగా గస్తీ
  • అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వారిపై కేసులు
  • లాక్‌డౌన్‌ ‌సడలింపు వేళ గుమికూడుతున్న జనం
  • పోలీసులు వారిస్తున్నా పట్టించుకోని ప్రజలు
  • కరోనా వ్యాప్తికి ఇదే కారణమంటున్న పోలీసులు

గోదావరి ఖని,జ్యోతిన్యూస్‌ :
‌లాక్‌డౌన్‌ ఆం‌క్షలు మరింత కఠినంగగా అమలు చేయడంతో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో జిల్లాల్లో కూడా కేసులు దారికొస్తున్నాయి. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాల్లో పోలీసులు ఆ దిశగా కృషి చేస్తున్నారు. ఎక్కడికక్కడే చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు ప్రధాన కూడళ్ల వద్ద వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అకార ణంగా రోడ్లపైకి వచ్చేవారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడంతోపాటు, వాహనాలను సీజ్‌ ‌చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ‌సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు విపరీతంగా రోడ్లపైకి వస్తున్న ప్రజలు ఆ తరువాత పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. లాక్‌డౌన్‌ ఆం‌క్షలు కఠినంగా ఉండటంతో రోడ్లపైకి రావాలంటేనే జనం జంకుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరిఖని, వివిధ కాలనీలలో పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ ఆధ్వర్యంలో పెట్రోలింగ్‌ ‌నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఇష్టానుసారంగా బయట తిరిగితే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కొవిడ్‌ ‌నిబంధ నలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయి యువకులను పోలీసులు ఐసోలేషన్‌కు పంపించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..కరోనా నుంచి ప్రజలను రక్షించడానికి పోలీసులు రోడ్లపై ఉంటూ నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్నారు. కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. గల్లీల్లో, రోడ్లపై ఆకతాయిలు ఎంత చెప్పినా వినకుండా తిరుగుతున్నారని ఆయన తెలిపారు. వారిని సుల్తానాబాద్‌ ఐసోలేషన్‌ ‌కి ప్రత్యేక వాహనంలో తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రతి రోజు ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా రోడ్లపై తిరిగితే వారిని ఐషోలేషన్‌ ‌వ్యాన్లో సుల్తానాబాద్‌ ‌కి పంపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐపీఎస్‌ అధికారి నికిత పంత్‌, ‌గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌, ‌సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు. ఇదిలా ఉండగా
లాక్‌డౌన్‌ ‌సడలింపు సమయంలోనూ ప్రజలు రోజూ నిత్యావసర సరుకుల కోసం బయటకు రావద్దని డిజిపి ఇప్పటికే ఆదేశించారు. దీంతో పోలీసులు కూడా ఇంటి నుంచి ఒకరే వచ్చి వారం రోజులకు సరి పడా నిత్యావసరాలను తీసుకు వెళ్ళాలని సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే కేసులు నమోదు చేస్తూ భారీ జరిమానాలతోపాటు వాహనాలను సీజ్‌ ‌చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ‌నిబంధనలు కఠినంగా అమలవుతుండగా మార్కెట్ల వద్ద విపరీతంగా ఉంటున్న రద్దీతోనే ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ ‌సడలింపు సమయంలో ప్రజలు ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. నిత్యావసర సరుకుల దుకాణాల్లో బారులు తీరుతుండటం, భౌతికదూరం నిబంధనలను పాటించక పోవడంతో ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రజలు భయాం దోళనకు గురి అవుతున్నారు. నాలుగు గంటల వ్యవధిలో పనులు పూర్తి చేసుకోవాలన్న తపనతో ప్రజలు నిబంధనల ను లెక్క చేయడం లేదు. ముఖ్యంగా మాంసం, కూరగాయల దుకాణాలు, సూపర్‌ ‌మార్కెట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంటుంది. ఆయా ప్రదేశాల్లో సాధారణ రోజుల్లో కంటే భిన్నంగా ప్రజలు గుమిగూడుతున్నారు. ఈ విషయమై అధికారులు చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని జిల్లాల్లో ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. విశాలమైన స్థలాల్లోకి మార్కెట్లు తరలించి విక్రయాలు జరిపిస్తుండటంతో ప్రజలు గుమిగూడడం లేదు. కరోనా తొలిరోజుల్లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ‌సందర్భంగా జిల్లాలోనూ కూరగాయల మార్కెట్‌ను ప్రస్తుతం ఉన్న సముదాయం నుంచి తరలించి వార్డుల వారీగా ఏర్పాటు చేశారు. అలాగే మాంసం దుకాణాలను వివిధ ప్రాంతాలకు తరలించారు. దీంతో వైరస్‌ ‌వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. ఇదిలా ఉండగా టిఫిన్‌ ‌సెంటర్ల వద్ద జనం విపరీతంగా గుమిగూడుతున్నారు. దీన్ని నిరోధించాలంటే టిఫిన్‌ ‌సెంటర్లు, హోటళ్లలో కేవలం పార్సిల్‌ ‌సర్వీస్‌ అమలు చేస్తే వైరస్‌ ‌వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. ఉన్నతాధికారులు వివిధ ప్రాంతాల్లో రద్దీగల ప్రాంతాల్లో పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.