ఓటుకు నోటు కేసులో కీలక మలుపు

  • ఎసిబి చార్జిషీట్‌ ఆధారంగా రేవంత్‌పై ఈడి కేసు
  • దాదాపు ఆరేళ్ల తరవాత ఈడి ఛార్జిషీట్‌ ‌దాఖలు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం ఎంపీ రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌ ‌దాఖలు చేసింది. ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఈడీ చార్జ్‌షీట్‌ ‌దాఖలు చేసింది.గతంలో ఏసీబీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ ఆధారంగా ఈడీ రేవంత్‌పై మనీలాండరింగ్‌ ‌కేసు నమోదు చేసింది. తాజాగా దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో రేవంత్‌రెడ్డితోపాటు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా నింది తుడిగా పేర్కొంది. అలాగే సెబాస్టియన్‌, ఉదరుసింహ, మత్తయ్య, వేం కృష్ణకీర్తన్‌ ‌పేర్లను నమోదు చేసింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు.. ఎమ్మెల్యే స్టీఫెన్‌కు రేవంత్‌ ‌ముడుపులిచ్చి ప్రలోభపెట్టారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో రేవంత్‌ ‌మనీలాండరింగ్‌ ‌నేరానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఛార్జ్‌షీట్‌ ఆధారంగా రేవంత్‌రెడ్డిపై ఈడీ మనీలాండరింగ్‌ ‌కేసు నమోదు చేసింది. రేవంత్‌తో పాటు టీడీపీ నాయకుడు వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం కృష్ణా కీర్తన్‌రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్‌ ‌దాఖలు చేసింది.ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డి పట్టుబడ్డ విషయం తెలిసిందే. 2015 మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ ‌చేసే విధంగా స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌ ‌రాయబారం సాగించాడు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం. మొత్తం 4.5 కోట్ల బేరంలో మొదటగా రూ. 50 లక్షలు చెల్లించారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2015 మే 31న జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌లో రేవంత్‌ ‌రెడ్డిని రెడ్‌ ‌హ్యాండెడ్‌గా ఏసీబీ పట్టుకుంది. ఈ కేసులో ఏపీ మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపిన నేపథ్యాన్ని గతంలో దొరికిన వీడియోలను కూడా ఈ కేసులో ఆధారాలుగా సేకరించారు. ఈ కేసులో మనీలాండరింగ్‌ ‌జరిగినట్లు చెబుతు న్నారు. ఈ డబ్బులు ఏవిధంగా వచ్చాయి.. ఎలా చేతులు మారాయి.. అన్నీ సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఓటు కు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని ఈడీ ప్రధాని నిందితుడిగా ఈడీ చేర్చింది.2015 మే 31న స్టీఫెన్‌సన్‌కు అతని ఇంట్లో రూ. 50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి వీడియో కెమెరాకు చిక్కారు. అయితే ఆరేళ్ల పాటు వివిధ కోణాల్లో విచారించిన ఈడీ అనేక ఆధారాలను సేకరించింది.