ఈటెలకు మద్దతు ప్రకటించిన నేతలు

  • ఉమ్మడిగా పోరాడుదామని పిలుపు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి, కోదండరాం గురువారం ఈటల నివాసంలో సమావేశమయ్యా రు. భవిష్యత్‌ ‌రాజకీయ కార్యాచరణతో పాటు నిర్ణయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈటల బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీతో ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్‌ ‌వ్యతిరేక శక్తుల మద్దతు కూడగట్టే యోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమకారులను అంతా ఒకతాటిపైకి తీసుకుని వచ్చి పోరాడాలని ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. ఇదిలావుంటే ఈటల తప్పు చేసుంటే పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేయాలని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి అన్నారు. కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండ రాం మాజీ మంత్రి ఈటలను శార్‌ ‌పేట్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈటలకు మద్దతు ఇవ్వడం కోసమే వచ్చామని కొండా అన్నారు. ఈ సందర్భంగా కొండా డియాతో మాట్లాడారు. రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ఈటలకు అండగా ఉంటామని కొండా తెలిపారు. ఈటలను సస్పెండ్‌ ‌చేసే ధైర్యం లేదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కక్ష సాధింపుగా ఈటల కుటుంబ సభ్యులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని కొండా అన్నారు. కేసీఆర్‌ ‌కొట్లాడాల్సింది కరొనాపై అని కొండా అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మేమంతా ఐక్యంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. రాజకీయ విబేధాలు ఉంటే చర్చించుకోవాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతులు పాటించే అలవాటు కేసీఆర్‌కు లేదని కోదండరాం అన్నారు. ఎవరైనా తన నీడన బతకాలన్నదే కేసీఆర్‌ ‌నైజం అని కోదండ రాం వ్యాఖ్యానించారు.