నేటి నుంచి ఆ దేశాలకు అనుమతి లేదు

  • సౌదీ అరేబియా కీలక నిర్ణయం…
  • భారత్‌ తో సహా 20 దేశాలపై ప్రయాణ ఆంక్షలు

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
కరోనా మహమ్మారి జోరు ఇంకా పూర్తిగా తగ్గకముందే సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ తో సహా 20 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించింది. ఈ తాత్కాలిక ఆంక్షలు బుధవారం నుంచి అమల్లో ఉంటుందని ఆ దేశం స్పష్టం చేసింది. ఈ 20 దేశాల నుంచి సౌదీలోకి ప్రయాణికులను అనుమతించేది లేదని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే కొందరికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. దౌత్యవేత్తలు ఆ దేశాల నుంచి సౌదీకి వెళ్లే సౌదీ పౌరులు వైద్యులు వారి కుటుంబాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపింది. సౌదీలో కరోనాను నియంత్రించేందుకే ఈ తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు ఆ దేశ ప్రతినిధులు తెలిపారు. లెబనాన్‌ టర్కీ ఐర్లాండ్‌ ఇటలీ పోర్చుగల్‌ స్వీడన్‌ స్విట్జర్లాండ్‌ అమెరికా భారత్‌ అర్జంటీనా బ్రెజిల్‌ ఇండోనేషియా పాకిస్తాన్‌ దక్షిణాఫ్రికా జపాన్‌ బ్రిటన్‌ ఫ్రాన్స్‌ యూఏఈ జర్మనీ ఈజిప్ట్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు తమ దేశంలోకి తాత్కాలికంగా అనుమతి లేదని సౌదీ తెలిపింది. సౌదీలో ఇప్పటివరకూ 368000 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 6400 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. జూన్‌ 2020లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో సౌదీ అరేబియాలో కూడా ఒక్క రోజుకే 5000 కేసులు నమోదయిన సందర్భాలున్నాయి.2021 జనవరిలో రోజుకు 100 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే.. మంగళవారం మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 310 కరోనా కేసులు నమోదు కావడంతో సౌదీ అప్రమత్తమైంది. తాత్కాలిక ఆంక్షలు విధించాలన్న నిర్ణయానికొచ్చింది. ఇదిలా ఉంటే.. సౌదీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డిసెంబర్‌ 17 నుంచి సౌదీలో ఫైజర్‌ బయోన్‌ టెక్‌ వ్యాక్సిన్‌ ను ఇస్తున్నారు. గత 14 రోజుల్లో ఆంక్షలు విధించిన ఈ 20 దేశాల విూదుగా ప్రయాణం చేసిన ప్రయాణికులపై కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని సౌదీ స్పష్టం చేసింది. కాగా కరోనా నిబంధనలను పాటించని వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి తాఫిక్‌ అల్‌ రబియా స్పష్టం చేశారు.