ఘనంగా దసరా ఉత్సవాలు

కల్వకుర్తి ఆర్ సి జ్యోతి న్యూస్ :: ఆమనగల్లు పట్టణంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దసరా ఉత్సవాలకు మున్సిపల్ పాలకవర్గం కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి, రావణదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా మార్కెట్ యార్డ్ లో రావణ దహన కార్యక్రమం నిర్వహించగా, ఈసారి గ్రామ వాస్తు ప్రకారం తూర్పు దిక్కు అయినా మాడుగుల రోడ్డు ప్రభుత్వ జూనియర్ కళాశాల విశాలమైన స్థలంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీ చౌక్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఊరేగింపుగా బయలుదేరి రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి హాజరయ్యారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యువతీ యువకులు ప్రత్యేక వస్త్రధారణలో అలరించారు. పట్టణంలోని గాంధీచౌక్ లో రాజస్థాన్ నుండి రప్పించిన కళాకారులచే ప్రత్యేక నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకొంది. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. రావణ దహన కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించిన ఆచారి సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ పాలకవర్గాన్ని అభినందించారు. ఈ సంవత్సరము సుమారు వెయ్యి లైట్లతో పట్టణాన్ని సుందరంగా అలంకరించామని, 5 సంవత్సరాల తర్వాత ఆమనగల్లు సురసముద్రము నిండడం ప్రజలందరికీ శుభసూచకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ , వైస్ చైర్మన్ దుర్గయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండె హరి ప్రసాద్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.