మోదీజీ మీరే సాయం చేయాలి

మోదీకి ఫోన్ చేసి..జోక్యం చేసుకోవాలని కోరిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే

ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనను గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ చేసే విషయంలో గవర్నర్ కోషియారీ జాప్యం చేస్తుండటంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ కొత్త టర్న్ తీసుకున్నారు.ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం ఫోన్ చేసినట్లు సమాచారం. తనను గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ చేసే విషయంలో గవర్నర్ చేస్తున్న జాప్యాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.ముఖ్యమంత్రి ఉద్ధవ్ ప్రధాని మోదీ తలుపు తట్టారని, ప్రతిష్టంభన విషయంలో జోక్యం చేసుకోవాలని ఉద్ధవ్ కోరారని ఓ ఎన్సీపీ నేత వెల్లడించారు. “ఎమ్మెల్సీగా నామినేట్ చేసే విషయంలో మీరు జోక్యం చేసుకోండి. ఏ నిర్ణయమూ తీసుకోకపోతే నేను రాజీనామా చేయాల్సి ఉంటుంది. గవర్నర్ కోషియారీ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా రాలేదు” అని ఉద్ధవ్ మోదీతో అన్నట్లు ఆ నేత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయ స్థిరత్వం దృష్ట్యావెంటనే ఈ విషయంలో స్పందించాలని గవర్నర్‌ను తాము కోరినట్లు ఎన్సీపీ నేత తెలిపారు. చివరి తేదీ అయిన మే 27 వరకూ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టకుండా ఐదారు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోవాలని కూడా తాము సూచించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ను గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంవీలవుతుందా? కాదా? అని తాము గవర్నర్‌ను సూటిగానే అడిగామని, అందుకు న్యాయ సలహా అవసరమని ఆయన తమతో అన్నారని ఆ ఎన్సీపీ నేత తెలిపారు. మరోవైపు ఈ విషయం పై తాము న్యాయ సలహా కూడా తీసుకుంటున్నామని, అవసరమైతే సుప్రీంను కూడా ఆశ్రయిస్తామని ఎన్సీపీ నేత ప్రకటించారు.