నిందలు వేయడం సరికాదు

కొవిడ్-19 ర్యాపిడ్ టెస్టు కిట్ల పనితీరు పై స్పందించిన చైనా

న్యూఢిల్లీ: కొవిడ్-19 ర్యాపిడ్ టెస్టు కిట్ల పనితీరు, ఫలితాల పై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని చైనా తెలిపింది. ఈ కిట్లను ఉపయోగించకూడదని ఐసీఎంఆర్ రాష్ట్రాలను ఆదేశించడంతో సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. గ్వాంఝా వోండ్ ఫో బయోటెక్, ఝు హై లివ్ జోన్ డయాగ్నస్టిక్స్ కంపెనీల నుంచి భారత్ 5 లక్షల యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది. ఫలితాల్లో చాలా తేడాలు కనిపించడంతో వీటిని ఉ పయోగించడం ఆ పేయాలని ఐసీఎంఆర్ సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ‘ఫలితాలు, ఐసీఎంఆర్ నిర్ణయంపై మేం ఆందోళన చెందుతున్నాం. నాణ్యమైన వైద్య పరికరాలను ఎగుమతి చేసేందుకు చైనా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది’ అని చైనీస్ దౌత్య కార్యాలయం అధికార ప్రతినిధి జి రాంగ్ అన్నారు. చైనా ఉత్పత్తులు బాగా పనిచేయడం లేదని కొందరు వ్యక్తులు నిందలు వేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యక్తులు ఎవరో చెప్పకపోవడం గమనార్హం. కోవిడ్-19 మహమ్మారి పై పోరాడేందుకు భారత్ కు చైనా మద్దతు ఇస్తుందని జి రాంగ్ అన్నారు. ముందుగానే ఈ సవాల్ నుంచి బయటపడేందుకు సాయం చేస్తుందన్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటో కనుగొనేందుకు ఐసీఎంఆర్, చైనా సంస్థలతో దౌత్యకార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆ రెండు చైనీస్ కంపెనీలు ఎగుమతి చేస్తున్న టెస్టు కిట్లకు ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో మంచి గుర్తింపు ఉందన్నారు. ‘మానవాళికి వైరస్లు సహజ శత్రువులు. కలిసికట్టుగా పనిచేయడం ద్వారానే ఈ మహమ్మారిపై మనం గెలవగలం. ఇప్పుడు భారత్ అనుభవిస్తున్న బాధనే ఇంతకు ముందు చైనా అనుభవించింది. మహమ్మారిని కట్టడి చేయడం, చికిత్స చేయడం వంటి వివరాలను పంచుకుంది. వైద్య సామగ్రిని భారత్ కు విరాళంగా అందజేసింది’ అని జి రాంగ్ అన్నారు.