25 వేలకు చేరువలో … భారత్ కరోనా కేసులు
775 మరణాలు..ఒక్క రోజులో 57 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా బారినపడి గత 24 గంటల్లో 57 మంది కన్నుమూశారు. అలాగే కొత్తగా 1,429 కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దీంతో భారత్ లో ఇప్పటి వరకు 24,506 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో 775 మంది మరణించగా.. 5,062 మంది కోలుకున్నారు. మరో 18,668 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి మొత్త 52 మరణాలు సంభవించాయి. వీరిలో 18 మంది మహారాష్ట్ర, 15 మంది గుజరాత్, తొమ్మిది మంది మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్, దిల్లీలో ముగ్గురు చొప్పున, తమిళనాడులో ఇద్దరు, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ లో ఒక్కరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు సంభవించిన 775 మరణాల్లో.. అత్యధికంగా మహారాష్ట్రలో 301 మంది, గుజరాత్ లో 127 మంది, మధ్యప్రదేశ్ లో 92 మంది, దిల్లీలో 53 మంది, ఆంధ్రప్రదేశ్ లో 29 మంది, రాజస్థాన్ లో 27 మంది, తెలంగాణలో 26 మంది మృతిచెందారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో 25, తమిళనాడులో 22, కర్ణాటక, పశ్చిమ బంగాల్ లో 18 చొప్పున, పంజాబ్ లో 17 మరణాలు సంభవించాయి. ఇక వైరస్ బారిన పడ్డవారి విషయంలోనూ అత్యధికంగా మహారాష్ట్రలో 6817 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో 2,815, దిల్లీలో 2,514, రాజస్థాన్లో 2,034, మధ్యప్రదేశ్ లో 1,852 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం పెరిగింది. ఈ వారం మొదట్లో అది 7.5 రోజులు ఉండగా, ఇప్పుడు 10 రోజులైందని వెల్లడించింది. “గత 14 రోజుల్లో దేశంలోని 80 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. అధికారులు, ప్రజల సమష్టి కృషితో కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగాం” అని పేర్కొంది. ఇదిలా ఉండగా కొత్తగా నమోదైన మరణాల్లో మహారాష్ట్రలో 18, గుజరాత్ లో 9, ఉత్తరప్రదేశ్ లో 3 సంభవించాయి. “అహ్మదాబాద్లో కరోనా కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం నాలుగు రోజులు పడుతోంది. ఇదే కొనసాగితే వచ్చే నెల 15 నాటికి 50 వేలకు, నెలాఖరుకు 8 లక్షలకు చేరతాయి” అని అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. “ఇప్పటి వరకు అహ్మదాబాద్ లో 1,639 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో ఇదే అత్యధికం. 75 మంది చనిపోయారు. 105మంది కోలుకొన్నారు” అని ఆయన చెప్పారు. కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయాన్ని 8 రోజులు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. లక్ష్యాన్ని సాధిస్తే వచ్చే నెల 15 నాటికి కేసుల సంఖ్య 50 వేలకు బదులు 10 వేలకు పరిమితం అవుతుందని వివరించారు. మహారాష్ట్రలోని మూడు జిల్లాల పై వైరస్ నీడ పడకపోవడం గమనార్హం. వార్దా, భాండారా, గడ్చిరోలి జిల్లాల్లో ఇంతవరకు కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. దీనికి కారణం ముందుజాగ్రత్త చర్యలు పకడ్బందీగా చేపట్టడమేనని అధికారులు అంటున్నారు. కాగా కేరళలోని కోజికోడ్ లో కరోనా సోకిన 4 నెలల పసిపాప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ‘ఆయుష్’ సాయం కరోనా వైరస్ చికిత్సలో ఆయుష్ మందుల ప్ర?బావాన్ని అంచనా వేయడానికి స్వల్పకాలిక పరిశోధనలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర ఆయుష్ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఆస్పత్రులు, సంస్థలు ముందుకు రావాలని ఆహ్వానించింది. పరిశోధన ప్రాజెక్టు వ్యవధి గరిష్ఠంగా 6 నెలలు ఉండాలని తెలిపింది. ప్రతిపాదనలకు వ్యవస్థీకృత విలువల కమిటీ (ఐఈసీ) అనుమతిస్తే ఆయుష్ వైద్యులు, సాంకేతిక మానవ వనరులు, ల్యాబ్ దర్యాప్తులు, ఇతర అవసరాల కోసం రూ.10 లక్షల సాయం చేస్తామని తెలిపింది. మహారాష్ట్రలో కంటే గుజరాత్ లో వేగం దేశంలో కరోనాకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్ర కంటే ఇప్పుడు గుజరాత్ లో పరిస్థితి ఎక్కువగా కలవరపరుస్తోంది. బుధవారంతో లాక్ డౌన్ 2.0 విధించి వారం అయింది. ఈ సమయంలో గుజరాత్ లో కేసులు, మరణాలు మూడు రెట్లు పెరిగాయి. ఈ నెల 15 వరకు మహారాష్ట్రలో 2,801 కేసులు నమోదయ్యా యి. 22 కల్లా 5,649కు పెరిగాయి. మరణాలు ఈనెల 15 నాటికి 187 ఉండగా, 22 కల్లా 270కు పెరిగాయి. గుజరాత్ లో పరిస్థితి చూస్తే ఈ నెల 15 నాటికి నమోదైన మరణాలు 33. వారం తర్వాత 103కు చేరాయి. ఇదే వ్యవధిలో కేసులు 695 నుంచి 2,407కు పెరిగాయి. దేశంలోని మొత్తం కొవిడ్-19 కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలు కలిసి సగానికి దాటిపోయాయి. 170 జిల్లాలను ప్రభుత్వం రెడ్ జోన్లుగా గుర్తించగా, వీటిలో ఎక్కువ ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర మంత్రి అవ్పాదకు కరోనా మహారాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి జితేంద్ర అవాద్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తనను కలిసిన పోలీసుల్లో ఒకరికి కరోనా సోకిందని తేలడంతో మంత్రి, కుటుంబ సభ్యులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నెల 13న ఆయనకు కొవిడ్-19 పరీక్ష నిర్వహించగా ‘నెగెటివ్’ వచ్చింది. గురువారం మళ్లీ పరీక్ష చేయగా కరోనా సోకినట్లు తేలింది. యూపీలోని కాన్పూరులో 13 మంది మదర్సా విద్యార్థులకు కొవిడ్-19 సోకింది. వైరస్ సోకిన తల్లీగీ సభ్యులతో వారు సన్నిహితంగా మెలిగారు.