కాలుష్య రహత సాంకేతికత

వినియోగించుకోవాలి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఊహించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రస్తుతం భవిష్యత్తు అభివృద్ధి నమూనా గురించి పునరాలోచించాల్సిన ఆవశక్యత ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవ సందర్భంగా ఆయన ఓ ప్రకటన చేశారు. “గతం, కఠినమైన వర్తమానం నేర్పించిన పాఠాలతో భవిష్యత్తును సుస్థిర మార్గాల్లో ఆవిష్కరించాలి” అని అన్నారు. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు మూసివేయడం, విమానాలను రద్దు చేయడం, రోడ్ల పై తక్కువ వాహనాలు తిరుగుతుండటంతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక శక్తి, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, ఎలక్ట్రికల్ వాహనాలు, కాలుష్య రహిత సాంకేతికతను వినియోగించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. గ్రామీణ స్థాయి నుంచి స్వచ్ఛందంగా భారీ స్థాయిలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. సహజ వనరులను పరిరక్షించడానికి “తగ్గింపు, పునర్వినియోగం, పునరుత్పత్తి” అనే మంత్రాన్ని అవలంబించాలని అన్నారు. సమష్టిగా సుస్థిర జీవన విధానం కోసం కృషి చేయాలని, మెరుగైన భవిష్యత్తు కోసం మన ప్రకృతిని, సంస్కృతిని రక్షించాల్సి ఉందని తెలిపారు.