కలిసొచ్చిన లాక్ డౌన్..

అభివృద్ధి పనులకు సైరన్ నగరంలో ఊపందుకున్న రోడ్ల మరమ్మతులు, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు 

  • అభివృద్ధి పనుల పై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ
  • రెండు షిఫులలో కొనసాగుతున్న పనులు
  • జనసంచారం లేకపోవడంతో పనులు వేగవంతం
  • 2020 జూన్లోగా పనులు పూర్తిచేయాలని లక్ష్యం
  • ఇప్పటికే పూర్తయిన రూ.356.47 కోట్ల పనులు
  • రూ.200 కోట్ల విలువైన బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు
  • కేటీఆర్ ఆదేశాలతో ఊపందుకున్న అభివృద్ధి పనులు
  • మొత్తం 11 ప్రాంతాల్లో చురుగ్గా సాగుతున్న పనులు 

హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా రోడ్లపై జన సంచారం లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు అభివృద్ధి పనుల పై దృష్టి సారించారు. పెండింగ్ లో ఉన్న ఫ్లై ఓవర్ పనులను, రోడ్ల మరమ్మతులను శరవేగంగా పూర్తి చేసేస్తున్నారు. కార్మికులు తగినంత సామాజిక దూరం పాటిస్తూ, రెండు షిప్టుల్లో ఈ అభివృద్ధి పనులను పరుగులెత్తిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉ ండటంతో ఆయా పనులు చాలా నత్తనడకగా సాగేవి. రాత్రుల్లో పనిచేసినా సరే, పనులు అంత సజావుగా జరగకపోయేవి. ఇప్పుడు మాత్రం లాక్ డౌన్ కారణంగా జనసంచారం పూర్తిగా లేకపోవడంతో అధికారులు హైస్పీడ్ లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. విధుల్లో ఉన్న కార్మికులకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లను అందిస్తూ, వారి యోగ క్షేమాలు చూసుకుంటూనే పనులను పూర్తి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక రోడ్ల పై ఫ్లై ఓవర్లు, రోడ్డు మరమ్మతులు వంటి పనులు చేపడితే అక్కడ వాహనదారులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు రోడ్ల పైకి రావట్లేదు. ట్రాఫిక్ జామ్ అనే మాటేలేదు. దీంతో లాక్ డౌన్ సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) శర వేగంగా ఫ్లై ఓవర్లు, గ్రేడ్ సపరేటర్ రోడ్ల పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. రాత్రింబవళ్లు కొనసాగుతున్న పనులు.. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ (ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా హైదరాబాద్ లోని మొత్తం 11 ప్రాంతాల్లో ఈ నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. కరోనా నేపథ్యంలో తక్కువ మంది కార్మికులతోనే ఈ పనులు కొనసాగిస్తున్నారు. రాత్రింబవళ్లు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచనలతో లాక్ డౌన్ సమయంలో జీహెచ్ఎంసీ ఈ పనుల వేగాన్ని పెంచింది. ఇప్పటికే రూ.356.47 కోట్ల పనులు పూర్తి.. మొత్తం 11 ప్రాంతాల్లో రూ.834.44 కోట్లతో ఈ పనులు మొదలు పెట్టగా ఇప్పటివరకు రూ.356.47 కోట్ల పనులు పూర్తయ్యా యి. 2020 జూన్లోగా మిగతా రూ.436.52 కోట్ల పనులను కూడా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఆదేశించింది. రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడంతో పనులు మరింత వేగంగా కొనసాగిస్తున్నామని జీహెచ్ఎంసీ ఇంజనీర్లు తెలిపారు. సామాజిక దూరం పాటిస్తోన్న కార్మికులు… కార్మికులు సామాజిక దూరం పాటిస్తూనే ఈ పనులు చేస్తున్నారని ఇంజనీర్లు చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్ పేమెంట్లలో జాప్యం జరగకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పనులు జరుగుతున్న ప్రాంతాలు.. ప్రస్తుతం ఎల్ బీనగర్ రింగ్ రోడ్, నాగోల్ ఎక్స్ రోడ్, కామినేని జంక్షన్, బైరమల్ గూడ జంక్షన్, రోడ్ నంబరు 45 బయోడైవర్సిటీ జంక్షన్, జూబ్లిహిల్స్ ఎలెవేటెడ్ కారిడార్, ఓయూ కారిడార్, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రోడ్ అండర్ బ్రిడ్జ్, పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ ర్యాంప్, ఒవైసీ ఆసుపత్రి జంక్షన్, బహదూర్ పూరా జంక్షన్ ప్రాంతాల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తవుతుండడంతో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు సగం తీరినట్లే. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రద్దీ రహితంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్ఆర్‌డీపీ) కింద రూ. 2399కోట్ల వ్యయంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ అండర్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి తదితర వాటి నిర్మాణ పనులు చేపట్టిన విషయం విదితమే. వీటిలో రూ. 1500కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. పనులను వేగంగా పూర్తిచేసేందుకు బిల్లుల చెల్లింపులలో జాప్యాన్ని, నిధుల కొరతను అధిగమించేందుకు ఎస్ బీఐ బ్యాంకు ద్వారా రూ. 2500 కోట్ల మొత్తాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీ రుణం రూపంలో సమకూర్చుకుంది. ఇదివరకే మున్సిపల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధులనుంచి రూ. 500కోట్లు, అలాగే జీహెచ్ఎంసీ నిధులనుంచి మరో రూ. 370 కోట్లను ఖర్చుచేసిన అధికారులు మరో రూ. 200కోట్ల విలువైన బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 834.44 కోట్లతో చేపట్టిన 11పనుల్లో వచ్చే జాన్ నాటికి రూ. 436.52కోట్ల విలువైన పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకనుగుణంగా లాక్ డౌన్ సమయాన్ని జీహెచ్ఎంసీ, ఆయా నిర్మాణ సంస్థలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ, మళ్లింపు వంటి సమస్యలు లేనందున నిరాటంకంగా రేయింబవళ్లూ పనులు కొనసాగిస్తున్నారు. వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఎక్కువ యంత్రాలను ఉపయోగిస్తూ తక్కువ మంది కార్మికులు ఉండేలా నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే ఎల్ అండ్ టీ సంస్థతోపాటు వివిధ ప్యాకేజీలకింద చైనాతో అనుబంధం కలిగిన సంస్థలు చేపట్టిన దుర్గం చెరువు సహా పలు ఎలక్ట్రికల్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. బీటీ సరఫరాకు తొలగిన అడ్డంకులు కాంప్రహెన్సివ్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) కింద నగరంలో 1800 కోట్ల వ్యయంతో చేపట్టిన 709 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఇతర రాష్ట్రాల నుంచి బీటీ సరఫరాకు మార్గం సుగమం అయింది. దీంతో శుక్రవారం నుంచి యథావిధిగా పనులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. లాక్ డౌన్ విధించడంవల్ల ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోవడంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన బీటీ రాక నిలిచిపోయింది. ప్రస్తుత సమయాన్ని ప్లైఓవర్ల నిర్మాణం, రోడ్ల పునరుద్ధరణ పనులకు సద్వినియోగం చేసుకోవాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు, బీటీ వాహనాలకు అంతరాయం లేకుండా చూడాలని డీజీపీని కోరారు. దీంతో ఆయన పొరుగు రాష్ట్రాలతో మాట్లాడి బీటీ లారీలు యథావిథిగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి ఆయా ప్రాంతాల్లో పనులు యథావిథిగా ప్రారంభమవుతాయని వివరించారు. లాక్ డౌన్ సమయంలో ఎస్ఆర్‌డీపీ, సీఆర్ఎంపీ పనులను వేగంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులను మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఆదివారం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మేయర్ తనిఖీ చేశారు. ఓవైసీ దవాఖాన, ఐఎస్ సదన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్, బహదూర్‌ప్పు క్రాస్ రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులను తనిఖీ చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలు లేనందున కార్మికుల భద్రతకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని మెటీరియల్ ను ముందస్తుగా సమకూర్చుకుని పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ పనులకు అడ్డుగా ఉన్న ఆస్తులను సేకరించి నిర్మాణ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. ఆలాగే వాటర్ పైలైన్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర శాఖల కేబుళ్లను యుద్ధప్రాతిపదికన తరలించి నిర్మాణాలను వేగవంతం చేసేందుకు సహకరించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించిందని మేయర్ తెలిపారు. ఎస్ఆర్డీపీ పనులు పూర్తి అయితే ట్రాఫిక్ రద్దీ రహిత, సిగ్నలింగ్ రహిత రవాణాకు అవకాశం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రాజెక్టు ఇంజినీర్లు పాల్గొన్నారు. అదేవిధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వలస కూలీలు, నిరాశ్రయులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆశ్రయం పొందుతున్న 530మందిలో 130 మందిని విక్టరీ ప్లే గ్రౌండ్ కు తరలించినట్లు తెలిపారు. వారందరికీ రెండు పూటలా ఉచితంగా అన్నపూర్ణ భోజనం పెడుతున్నామని మేయర్ తెలిపారు. అనంతరం ఆ ప్రాంతంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికురాలని పలుకరించారు. చేతులకు గెస్టు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించారు. కార్మికుల క్షేమం కోసమే వాటిని ఇచ్చారని అందరూ తప్పకుండా వాడాలని సూచించారు. లాక్ డౌన్ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) శర వేగంగా ఫ్లై ఓవర్లు, రోడ్ల పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచనలతో జీహెచ్ఎంసీ ఈ పనుల వేగాన్ని పెంచింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ (ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా నగరంలోని మొత్తం 11 ప్రాంతాల్లో ఈ నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. కరోనా నేపథ్యంలో తక్కువ మంది కార్మికులతోనే ఈ పనులు కొనసాగిస్తున్నారు. రాత్రింబవళ్లు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎల్ బీనగర్ రింగ్ రోడ్, నాగోల్ ఎక్స్ రోడ్, కామినేని జంక్షన్, బైరమల్ గూడ జంక్షన్, రోడ్ నంబరు 45 బయోడైవర్సిటీ జంక్షన్, జూబ్లిహిల్స్ ఎలెవేటెడ్ కారిడార్, ఓయూ కారిడార్, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రోడ్ అండర్ బ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.